Thursday Motivation : సమస్య చూసి ఆగిపోతే.. గెలుపు వైపు వెళ్లే దారి కనిపించేదెలా?
Thursday Motivation : సమస్యలు చూసి ఆగిపోవడం మనకు అలవాటు. వందలో తొంబై మంది చేసే తప్పు ఇదే. కానీ కొన్నిసార్లు విధితో పోరాడాలి అప్పుడే జీవితంలో విజయం దక్కుతుంది.
సమస్యలు వస్తేనే మనిషి జీవితం బలంగా తయారవుతుంది. లేదంటే అలాగే సాధారణంగా నడుస్తూ ఉంటుంది. సమస్యలేని జీవితం గెలుపును చూడాలంటే కష్టం. ఎందుకంటే జీవితంలో దెబ్బలు తగిలితేనే.. బలంగా తయారవుతాం. లేదంటే అక్కడే ఉండిపోతాం. గెలిచేందుకు మీ మనసు మదనపడాలి. మీతో మీరు యుద్ధం చేయాలి. అప్పుడే గెలుపు సాధ్యమవుతుంది. మనకు బాగా తెలిసిన ఓ నటుడి గురించిన జీవితం తెలుసుకుందాం.
చిన్నప్పుడు ఒకరోజు వెన్నెముక సమస్య కారణంగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ఆసుపత్రికి వెళ్లాడు. హృతిక్ రోషన్ నటుడిగా మారడం అసాధ్యం, డ్యాన్స్ చేయడం అసాధ్యమని వైద్యులు చెప్పారు. బాలీవుడ్‌లోని పెద్ద నిర్మాతలలో ఒకరైన రాకేశ్ రోషన్ కుమారుడు హృతిక్. అతడి జీవితంలో ఇలాంటి ఘటన జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కొందరి దగ్గరకు తీసుకెళ్తే.. నటుడిగా మారినా డ్యాన్స్ చేయడం కుదరదని చెప్పేశారు. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాడు హృతిక్. తన గుండెల్లో నటుడిగా ఎదగాలని ఉన్న కోరిక కంటతడి పెట్టించింది.
ఈ సమస్య మాత్రమే కాదు.. చిన్నప్పుడు హృతిక్ రోషన్‌కు నత్తిగా మాట్లాడే అలవాటు ఉండేది. దీంతో డైలాగ్స్ చెప్పేందుకు కూడా పనికి రాడని చెప్పేవారు. అయిష్టంగానే బడికి వెళ్లేవాడు హృతిక్. స్కూల్లో ఒంటరిగా గడిపేవాడు. ఇంటికి తిరిగి రాగానే ఏడ్చేవాడు.
అయితే ఈ సమస్యల నుంచి బయటపడేందుకు హృతిక్ రోషన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్ని సమస్యలను ఎదుర్కొన్నాడు. పెరుగుతున్న కొద్దీ సమస్యలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. ఇందులో అతడి కష్టం చాలా ఉంది. విధితో పోరాడాడు. తనను చూసిన నవ్విన వారికి సమాధానం చెప్పాడు. భారతదేశంలోని నటుల్లో మంచి డ్యాన్సర్లలో ఒకరిగా ఉన్నాడు హృతిక్ రోషన్. చిన్నప్పుడు ఎగతాళి చేసిన వారే హృతిక్ రోషన్‌ను చూపి చప్పట్లు కొట్టారు.
అందుకే జీవితంలో సమస్యలు ఉన్నయాని ఆగిపోకూడదు. ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. కష్టాలు వస్తాయి.. పోతాయి.. కానీ కలల కోసం కష్టపడటం మాత్రం ఆపేయకూడదు. కల కంటే నెరవేరేదాకా నిద్రపోకూడదు. జీవితంలో విజయం సాధించేందుకు కచ్చితంగా కష్టపడాలి.
జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవాల్సిన సమయం రావొచ్చు..
అది కష్టంగానే ఉంటుంది..
కానీ ఆ ఒంటరి తనమే..
డబ్బు విలువ..
చదువు విలువ..
సమయం విలువ..
జీవితం విలువ..
అన్ని నేర్పిస్తుంది.
అందుకే జీవితంలో ఏ సమస్య వచ్చినా మనసుకు తీసుకోకూడదు. దానితో యుద్ధం చేసేందుకు ముందుకు వెళ్లాలి. మీరే ఒక సైనికుడిలాగా మారాలి. అందుకోసం నిరంతరం శ్రమించాలి. పక్క నుంచి రాళ్లు పడుతూ ఉంటాయి. కానీ భయపడి ఆగిపోవద్దు. ముందుకు సాగిపోతూ ఉండాలి.
నీకు కష్టమనిపించే ఉద్యోగం..
ఒక నిరుద్యోగికి జీవితకాల స్వప్నం..
నీకు విసుగు తెప్పించే పిల్లలు..
పిల్లలు లేని దంపతులకు మధుర స్వప్నం..
నీ వద్ద ఉన్న చిరు సంపాదన..
చిల్లిగవ్వ కూడా లేనివారికి ఊరటనిచ్చే స్వప్నం..