Liquor Consumption: మద్యం తాగితే మీ శరీరంలో ఏమి జరుగుతుందో తెలుసా.. ఈ విషయాలు తెలిస్తే మద్యం జోలికి పోరు…
Liquor Consumption: మద్యపానం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది మందు అలవాటు మానుకోరు. మద్యం అనారోగ్యాలకు కారణమని చెబుతూనే ప్రభుత్వాలు రకరకాల బ్రాండ్ల పేరుతో వాటిని అమ్ముతుంటాయి. అసలు మద్యం సేవిస్తే శరీరంలో ఏమి జరుగుతుందో తెలిస్తే దాని జోలికి కూడా వెళ్లరు.
Liquor Consumption: మద్యం పేరు ఏదైనా శరీరంలో అది చేసే పని ఒకటే.. డబ్బున్న వాళ్ళు బార్లలో బీర్లు, బ్రాందీలు, విస్కీ, వైన్, జిన్ను అనునకుంటూ మద్యం త్రాగితే గ్రామాల్లో నివసించే వాళ్లు కాస్త ఖరీదు తక్కువలో దొరికే సారా, కల్లూ తాగుతారు. ఏం త్రాగినా శరీరంలో దాని ప్రభావం ఒకే రకంగా ఉంటుంది.
మద్యం త్రాగేవారి కాలేయం దెబ్బతిని "సిర్రోసిస్ ఆఫ్ లివర్" (Cirrhosis of Liver) అనే జబ్బు వస్తుంది. పొట్టనిండా నీరు చేరి క్రమంగా "బానపొట్ట” వస్తుంది. కాళ్ళ వాపులు వస్తాయి. మానవ శరీరంలో కాలేయం ఒకటే ఉంటుంది కాబట్టి, అది దెబ్బ తింటే మరణానికి చేరువ అవుతున్నట్టేనని గుర్తించాలి. బావిలో నీళ్ళూరినట్లు కాలేయంలో నీరు ఊరుతుంది. అన్నవాహిక, జీర్ణాశయం కలిసే దగ్గర గల రక్తనాళాలు ఉబ్బిపోయి, రక్త స్రావం కూడా జరగొచ్చు. ప్రమాదంతోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.
గుండెకు బోలెడు ముప్పు…
మద్యం సేవిస్తే గుండె కండరాలు దెబ్బతిని "గుండె విశాలంగా" మారుతుంది. గుండె వైశాల్యం క్రమంగా పెరుగుతుంది. చివరకు గుండె ఆగిపోతుంది. ఈ జబ్బుని "గుండె పెరగటం" (Cardiomegaly) అంటారు. ఇది చివరికి "హార్ట్ ఫెయిల్యూర్"కు దారి తీస్తుంది.
పొట్టలో పుళ్లు…
మద్యపానంతో పొట్టలో పుళ్లు ఏర్పడతాయి. గాస్ట్రైటిస్" (Gastritis) వస్తాయి. పొట్టలో క్యాన్సర్ . క్రమంగా ఆకలి మందగిస్తుంది. అన్నవాహికలో క్యాన్సర్ తీవ్రమయ్యే కొద్దీ అన్నం మింగుడు కూడా పడదు. తర్వాత దశలో కనీసం మంచి నీళ్ళు కూడా మ్రింగుడు పడవు. ఆ సమయంలో వైద్యులు కూడా చేయగలిగింది ఏమి ఉండదు.
నరాల క్షీణత..
మద్యం సేవించడం వల్ల "నరాల బలహీనత" వస్తుంది. కాళ్ళూ, చేతులో నొప్పులూ, మంటలూ పుడ్తాయి. ఎన్ని మందులు వాడినా ఈ సమస్యలు తగ్గవు. నరాల నొప్పులు తగ్గుతాయని ఇంజెక్షన్లు వాడినా ఉపయోగం పెద్దగా ఉండదు.
తాగే వారికి మెదడు, నరాలు దెబ్బతింటాయి. మెదడులో కణాలు దెబ్బతింటాయి. జ్ఞాపకశక్తి క్షీణిస్తుంది. నిద్రపట్టడం తగ్గిపోతుంది. త్రాగేవారికి ఆహార పదార్థాల, విటమిన్ల లోపాలు కూడా వస్తాయి. “వెర్నిక్స్ ఎన్సెఫలోపతీ", "పాలీన్యూరైటిస్" (Polyneuritis), "నికోటినిక్ యాసిడ్" లోపంతో వచ్చే “ఎస్ కెఫలోపతీ" (Encephalopathy) మొదలైన జబ్బులు వస్తాయి.
ఒకేసారి మానేసినా ప్రమాదమే…
మద్యం అలవాటు ఉన్న వారు అతిగా త్రాగినా, అకస్మాత్తుగా మానినా, ఎక్కువ చలికి గురైనా, “డెలీరియం ట్రెమన్స్” (Delirium Tremens) అనబడు మెదడు వ్యాధి వస్తుంది. ఈ రోగం వల్ల నిద్ర ఉండదు. కాళ్ళూ, చేతులూ వణుకుతుంటాయి. భయం, దృష్టి, వినికిడికి సంబంధించిన భ్రమలు వస్తుంటాయి. ఎవరో బెదిరిస్తున్నట్లు మాటలు వినపడటం, ఎవరూ పిలవకపోయినా పిలిచినట్లు, పిలిస్తే వినపడక పోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. జ్ఞాపక శక్తి సన్నగిల్లిపోతుంది.
తీవ్రమైన భ్రమలు…
"ఎక్యూట్ హెలూసినోసిస్" (Acute Hallucinosis) అనే జబ్బుతో తీవ్రమైన భ్రమలు కలిగి, ఆ పరిస్థితి వారాలు మొదలుకొని నెలల తరబడి ఉండొచ్చు. ఈ సమస్య ఉంటే ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు పెరుగుతాయి.
రక్తపోటు, పక్షవాతం రావడానికి త్రాగుడు కూడా ఒక కారణమని వైద్య పరిశోధనల్లో గుర్తించారు. మెదడు మీద సారా పనిచేయటంలో "ఆల్కహాలిక్ డెమెన్షియా" (Alcoholic Dementia) చివరి దశ. ఈ దశలో అన్ని పేర్లు మర్చిపోతారు. కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుండవు.
మద్యపానంతో కండరాలు దెబ్బతింటాయి. “స్కెలిటల్ మయోపథీ" (Skeletal Myopathy) అనే సమస్యతో విపరీతమైన నీరసం, శారీరక శ్రమ చేయటానికి ఇష్టపడకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. చివరకు పనిచేసే స్థితిని కూడా కోల్పోతారు.
మద్యం తాగితే ఆ సామర‌్థ్యం తగ్గిపోతుంది…
మద్యపానం ఎక్కువైతే కాలేయం దెబ్బతినడం వలనా, పురుషుల సెక్సు హార్మోన్లు తయారు కావటం తగ్గిపోతుంది. పురుషుల్ో వృషణాలు సన్నబడతాయి. స్త్రీలలో మాదిరి వక్షోజాల పరిణామం పెరుగుతుంది. చివరకు సెక్సు సామర్థ్యం క్షీణించి వంధ్యత్వం వస్తుంది.
నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, ఊపిరితిత్తుల్లో, క్యాన్సర్ ఉన్నవారు సారా తాగేవారయితే వారి జీవన ప్రమాణం బాగా తగ్గిపోతుంది. బ్రతకాల్సిన దానికన్నా ముందుగా చనిపోతారు.