Wednesday Motivation: బతకడం వృథా అని విరక్తిగా ఉన్నారా? అయితే ఈ కథ మీ కోసమే
Wednesday Motivation: కొంతమందిలో చిన్న చిన్న వైఫల్యాలకే విరక్తి వస్తుంది. తాము బతకడం వృధా అనుకుంటారు. అలాంటివారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.
శివ ధనవంతుల బిడ్డ. దేనికీ లోటు లేదు. ఏది కావాలంటే అది కాళ్ల దగ్గరికి వచ్చి చేరుతుంది. ఏ పనీ చేయాల్సిన అవసరం లేదు. దీంతో అతనికి జీవితంపై విసుగొచ్చేసింది. ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది. అను ఏ పనీ చేసేందుకు శ్రద్ధ పెట్టడం లేదు. కష్టపడే లక్షణం కూడా లేదు. దీంతో అతను జీవించడం వృధా అని నిర్ణయించుకున్నాడు. ఊరి బయట ఉన్న ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. ఆ సాధువుతో ‘నాకు ఈ జీవితం వద్దు. నాకు ఈ ప్రాపంచిక విషయాలపై ఆసక్తి పోయింది. అలా అని నేను ప్రశాంతంగా ఇంట్లో పుస్తకాలు చదువుతూ కూర్చోలేను. ధ్యానం వంటివి చేయలేను. ఎప్పుడూ ఏ పని చేసింది లేదు. అందుకే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా జీవితాన్ని ఎలా జీవించాలో కూడా తెలియడం లేదు. అందుకే నేను బతకడం ఎందుకు అనిపిస్తోంది’ అని చెప్పాడు.
దానికి ఆ సాధువు ‘నువ్వు సాధారణంగా రోజు ఏం చేస్తూ ఉంటావు’ అని ప్రశ్నించాడు. దానికి శివ ‘నేను ఏ పనీ చేయను. బోర్ కొడితే కాసేపు చదరంగం ఆడుతాను. అంతే అంతకుమించి నేను ఏ పనీ చేసింది లేదు. అందుకే నాకు ఈ జీవితం నచ్చడం లేదు. చేయడానికీ ఏ పనీ రాదు కూడా’ అని చెప్పాడు.
వెంటనే సాధువు ‘నువ్వు ఇప్పుడు చదరంగం ఆడాలి. అది కూడా నా శిష్యుడుతో’ అని చెప్పాడు. దానికి ఆ యువకుడు సరే అన్నాడు. తన శిష్యుడిని పిలిచి శివతో చదరంగం ఆడమని చెప్పాడు. వారు చదరంగం ఆట మొదలు పెడుతున్నప్పుడు ఒక కత్తి తీసి మీ ఇద్దరిలో ఎవరు ఓడిపోతారో వాడిని నేను చంపేస్తాను అని చెప్పాడు సాధువు. దాంతో శివలో భయం మొదలైంది. బతకడం వృధా అని అనుకున్న వ్యక్తిలో కూడా ఆ కత్తిని చూడగానే, చావు అనే పదం వినగానే కలవరం ప్రారంభమయ్యింది. చదరంగం ఆట ఆడడం మొదలుపెట్టారు. శివకు చెమటలు పట్టడం మొదలయ్యాయి. కానీ ఎదురుగా ఆడుతున్న శిష్యుడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అతనిలో ఎలాంటి భయం, బెంగా లేవు. శివ మాత్రం వణికిపోతూ ఆడుతున్నాడు. ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాడు. ప్రాణాన్ని కాపాడుకునేందుకు ఏకాగ్రతగా ఆడడం ప్రారంభించాడు.
శివ కాసేపటికి మళ్లీ శిష్యుడి ముఖం చూసాడు. అతనిలో మాత్రం ఇంకా అదే ప్రశాంతత. అప్పుడు శివలో ఆలోచన మొదలైంది. తాను బతికి సాధించేది ఏమీ లేదు. ఈ సాధువు ప్రశాంతమైన చిత్తంతో జీవించగలడు. అందుకే తాను ఓడి ఆ శిష్యుడికి ప్రాణభిక్ష పెట్టాలని అనుకున్నాడు. కావాలనే తప్పులు చేయడం మొదలుపెట్టాడు. ఇది గమనించిన సాధువు వెంటనే ఆట ఆపమని చెప్పాడు.
శివను ఉద్దేశించి ‘నువ్వు గెలిచే సమయంలో కూడా ఓడిపోవాలని తప్పులు చేశావు. దానికి కారణం నీలో చిగురించిన మానవత్వం, జాలి, దయ. ఇవే ఒక మంచి మనిషికి ఉండాల్సిన లక్షణాలు. అంతేకాదు మొదట్లో ఆట గెలిచేందుకు నువ్వు చాలా ఏకాగ్రతగా ఆడావు. అంటే నువ్వు కచ్చితంగా ధ్యానం చేయగలవు. కాకపోతే ఇప్పటి వరకు ప్రయత్నించలేదు. నీలో అన్ని మంచి గుణాలు ఉన్నాయి. కానీ ప్రయత్న లోపం ఎక్కువగా ఉంది. ధ్యానం చేయడం ఈరోజు నుంచే ప్రారంభించు. అంతా మేలే జరుగుతుంది. నీకున్న ధనంతో ఇతరులకు సాయం చేయడం మొదలుపెట్టు. నీకు జీవించాలన్న కోరిక పెరుగుతుంది’ అని వివరించాడు. శివ సాధువు చెప్పినట్టే చేశాడు. అతనికి జీవితంలో నిజమైన సంతోషం అంటే ఏంటో తెలుసొచ్చింది.