Bedtime Ritual | ప్రతి రాత్రి ఇలాంటి కార్యచరణ ఉంటే మీ నిద్రను ఎవ్వరూ ఆపేదేలే!
Create Bedtime Ritual- ప్రతిరోజూ ఉదయం ఎలాగైతే లేచి మన పనులు మనం చేసుకుంటామో అలాగే రాత్రి పడుకునే ముందు కూడా కొన్ని పనులు చేస్తే ఎన్నో లాభాలుంటాయి. ఏం చేయాలి? ఏం లాభాలుంటాయి అనేది ఇక్కడ తెలుసుకోండి.
మెదడు పనితీరు సరిగ్గా ఉండాలన్నా, మానసిక స్థితి మెరుగ్గా ఉండాలన్నా ముందుగా ప్రతి ఒక్కరికి మంచి నిద్ర అనేది ఉండాలి. అయితే ఇక్కడ చిక్కుముడి ఏమిటంటే అసలు మంచి నిద్ర ఎలా లభిస్తుంది? నిద్రపోవటానికి చాలా రకాల టిప్స్ ఉంటాయి, కానీ అవన్నీ పాటించినా కచ్చితంగా నిద్ర వస్తుంది అనే దానికి గ్యారెంటీ లేదు. కానీ నిద్రపోవడం అనేది కచ్చితంగా చాలా అవసరం. మన నిద్ర చక్రం సవ్యంగా సాగాలంటే, మన నిద్ర మీద మనకు పూర్తి నియంత్రణ ఉండాలంటే నిద్రకు సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ అవసరం.
ప్రతిరోజూ ఉదయం లేవగానే జాగింగ్ చేయడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం ఇలా ప్రణాళికాబద్ధమైన దినచర్య ఎలా అయితే ఉంటుందో.. రాత్రి పడుకునేముందు కూడా అలాంటి ఆచరణ (Bed Time Routine) అనేది ఒకటి ఉండాలి. అప్పుడు మన శరీరం, మన మెదడు ఆ రకమైన ఆచరణకు అలవాటుపడుతుంది. పడుకునే సమయం ఆసన్నమైందనే సంకేతాలు వెళ్తాయి. అప్పుడు సరైన సమయానికి నిద్ర వస్తుంది. మన నిద్ర మీద మనకు నియంత్రణ వస్తుంది. స్లీప్ సైకిల్ కూడా బాగుంటుంది. ఇది మొత్తంగా మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
సరే , అంతా బాగుంది కానీ రాత్రి పడుకునే ముందు ఏం చేయాలి? ఎలా చేయాలి అనేగా మీ సందేహం. దీనికి మరీ అంతగా కష్టపడాల్సిన పనిలేదు, ఎక్కువ సమయం వెచ్చించాల్సిన పనిలేదు. మీకు ఇష్టమైన పనులనే మీకు నచ్చినంత సేపు చేసుకుకోవచ్చు. అందుకు కనిష్టంగా 10 నిమిషాల సమయం, గరిష్టంగా 2 గంటల సమయం కేటాయించుకోవచ్చు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే ఎలక్ట్రానిక్ పరికారల మీద సమయం ఎంతమాత్రం కేటాయించకూడదు.
మీ Bed Time Routineలో భాగంగా ఏ విధమైన కార్యకలాపాలను ఎంచుకోవాలి? అనేదానిపై మీకు ఇబ్బంది ఉన్నట్లయితే ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఇచ్చాము. వీటిని ప్రతిరోజూ పడుకునే ముందు తప్పకుండా ఆచరించాల్సిన అలవాట్లుగా మార్చుకోండి.
Bedtime Routine- Tips
- మీ ముఖాన్ని కడుక్కోండి, ఫేస్ మాస్క్ వేసుకోండి లేదా సువాసనగల లోషన్‌ను అప్లై చేయండి
- హెర్బల్ టీ తాగండి
- పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని చదవండి
- ఏదైనా రాయండి
- కొద్దిసేపు ధ్యానం చేయండి
- శరీర భాగాలను సాగదీయడం- స్ట్రెచింగ్ లాంటివి చేయండి
- సంగీతం/పాడ్‌కాస్ట్/ఇ-బుక్ వినండి
ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాల్సి వస్తే స్క్రీన్ చూడకుండా ఆడియో మాత్రమే వినిపించేలా జాగ్రత్తలు తీసుకోండి. ఇంకేం.. ఇప్పుడు రాత్రి పడుకునేముందు ఏం చేయవచ్చో ఒక అవగాహన వచ్చింది కదా. వీటిలో మీకు నచ్చిన వాటిని అలవాటుగా చేర్చుకోండి. ప్రతిరోజూ తప్పకుండా చేయండి. మీరు కొన్ని రోజుల్లోనే మెరుగైన ఫలితాలను చూస్తారు. మీకు సరైన సమయంలో నిద్రరావడమే కాకుండా అదనపు ప్రయోజనాలు దక్కుతాయి. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి, మీ నైపుణ్యాలు పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఇక చదివింది చాలు. ఇప్పుడు వెళ్లి పడుకోండి. గుడ్ నైట్!
సంబంధిత కథనం