Conjunctivitis | కండ్లకలకతో బాధపడుతున్నారా? ఈ సులభమైన వ్యాయామాలు చేస్తే సమస్య మాయం!-conjunctivitis prevention effective eye exercises to keep your eyes safe from flu and infections ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Conjunctivitis Prevention, Effective Eye Exercises To Keep Your Eyes Safe From Flu And Infections

Conjunctivitis | కండ్లకలకతో బాధపడుతున్నారా? ఈ సులభమైన వ్యాయామాలు చేస్తే సమస్య మాయం!

HT Telugu Desk HT Telugu
Aug 02, 2023 09:30 AM IST

Conjunctivitis Prevention: శారీరక శ్రమ చేయడం ద్వారా కూడా కంటి ఫ్లూ లేదా కండ్లకలకను నివారించవచ్చు. కళ్లలో మంట నుంచి ఉపశమనం కలిగించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కొన్ని సులభమైన వ్యాయామాలు ఏమిటో ఇక్కడ తెలుసుకోండి.

Conjunctivitis Prevention
Conjunctivitis Prevention (istock)

Conjunctivitis: ఇటీవల కాలంగా చాలా మందికి కండ్లకలక సమస్య సాధారణంగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ముఖ్యంగా భారీ వర్షాలు, వరదలు, నీరు నిలిచిన ప్రాంతాల్లో కండ్లకలక కేసులు విపరీతంగా విస్తరిస్తున్నాయి. ఇది అంటువ్యాధి కావడంతో ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. కండ్లకలక అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ వలన కలిగే ఇన్ఫెక్షన్. ఈ వర్షాకాలంలో ఉండే తేమ వాతావరణం కారణంగా బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, మీ కంటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అత్యవసరం అని వైద్యులు అంటున్నారు.

కంజక్టివిటిస్ లేదా కండ్లకలక వ్యాప్తిని నివారించడానికి, మీ చేతులను తరచుగా కడగడం, బహిరంగ ప్రదేశాలలో తిరుగుతున్నప్పుడు ఏ ఉపరితలాలను తాకకుండా ఉండండి, అలాగే తరచుగా మీ చేతులను కళ్ల వద్ద ఉంచకపోవడం, మీ కళ్లను తాకకుండా ఉండటం ముఖ్యం. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేటప్పుడు సామాజిక దూరం పాటించాలి. కళ్ళలో ఎరుపు, దురద, జిగట, నొప్పిని అనుభవిస్తుంటే అలాంటి లక్షణాలను విస్మరించకూడదు, ఎందుకంటే ఇవి కండ్లకలక లేదా పింక్ ఐకి సంకేతాలు కావచ్చు.

HT డిజిటల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో షార్ప్ సైట్ ఐ హాస్పిటల్స్ లో సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ అనురాగ్ వాహి కండ్లకలకను నయం చేసే కొన్ని మార్గాలను పంచుకున్నారు. పౌష్టికాహారం తీసుకోవడం, కంటి వ్యాయామాలు చేయడం, ఇతర శారీరక శ్రమ చేయడం ద్వారా కూడా కంటి ఫ్లూ లేదా కండ్లకలకను నివారించవచ్చని ఆయన చెప్పారు. డాక్టర్ అనురాగ్ ప్రకారం, కళ్లలో మంట నుంచి ఉపశమనం కలిగించడానికి, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి కొన్ని సులభమైన, ప్రభావవంతమైన వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

1. చురుకైన నడక

చురుకైన నడక ద్వారా శరీరం అంతటా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది కంటివైపు కూడా రక్త ప్రసరణను ప్రేరేపించే ప్రభావవంతమైన వ్యాయామం. శరీరంలోని ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి వ్యవస్థకు రక్త ప్రసరణ అవసరం కాబట్టి, రక్త ప్రసరణ పెంచడానికి, ఇన్ఫెక్షన్లు నివారించడానికి, అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడకను లక్ష్యంగా పెట్టుకోండి.

2. సైక్లింగ్

సైక్లింగ్ అనేది కంటికి ఆక్సిజన్ సరఫరాను పెంచే గొప్ప కార్డియో వ్యాయామం. రెగ్యులర్ గా సైక్లింగ్ చేయడం వలన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, కంటి ఫ్లూని నివారించడానికి సహాయపడుతుంది.

3. ఏరోబిక్స్

జంపింగ్ జాక్స్, డ్యాన్స్ వంటి ఏరోబిక్ వ్యాయామాలు చేయడం ద్వారా హృదయ స్పందన రేటు పెరుగుతుంది, ఇది కళ్లలో కన్నీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఈ కన్నీళ్లు కంటిలోని మలినాలను బయటకు పంపి కళ్ళను రక్షించడంలో సహాయపడతాయి, కంటి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

4. ఐ రోలింగ్

ఐ రోలింగ్ అనేది కంటి ఒత్తిడిని తగ్గించడానికి, కంటి లూబ్రికేషన్‌ను మెరుగుపరచడానికి సహాయపడే ఒక సాధారణ వ్యాయామం. హాయిగా కూర్చుని, నెమ్మదిగా మీ కళ్ళను వృత్తాకార కదలికలో ఐదుసార్లు సవ్యదిశలో అలాగే ఐదుసార్లు అపసవ్య దిశలో తిప్పండి.

5. వేగంగా రెప్పవేయడం

క్రమమైన వ్యవధిలో దాదాపు 20 సెకన్ల పాటు వేగంగా కళ్లను బ్లింక్ చేయండి. వేగవంతమైన రెప్పపాటు సహజమైన కన్నీళ్లను సృష్టించి, కంటి ఉపరితలంపై వ్యాప్తి చేస్తుంది, కళ్లను తేమగా ఉంచుతుంది. అప్పుడు ఇన్ఫెక్షన్‌లకు తక్కువ అవకాశం ఉంటుంది.

6. ఫోకస్ షిఫ్టింగ్

కొన్ని సెకన్ల పాటు మీకు సమీపంలో ఉన్న వస్తువుపై దృష్టి కేంద్రీకరించండి, ఆపై మీ దృష్టిని దూరంగా ఉన్న వాటిపైకి మరల్చండి. ఈ అభ్యాసం మీ కంటి వశ్యతను మెరుగుపరచడానికి, కళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ వ్యాయామాన్ని చాలాసార్లు పునరావృతం చేయండి.

7. పామింగ్

మీ అరచేతులు వెచ్చగా మారే వరకు వాటిని రుద్దండి, ఆపై వాటిని మీ మూసిన కళ్లపై మెల్లగా ఉంచండి. పామింగ్ కంటి అలసటను తగ్గిస్తుంది, కంటి కండరాలను సడలిస్తుంది, ఓదార్పు ప్రభావాన్ని అందిస్తుంది.

WhatsApp channel

సంబంధిత కథనం