silver, copper cleaning: వెండి, రాగి, ఇత్తడి తళతళ మెరవాలంటే.. ఇలా శుభ్రం చేయండి
silver, copper cleaning: పూజ సామాన్లు, ఇంట్లో వాడే ఇత్తడి, రాగి వెండి వస్తువులు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా శుభ్రం చేసుకోవచ్చో తెలుసుకోండి.
ఇంట్లో పూజలకు వాడే ఇత్తడి వెండి సామాన్లు, వెండి ఇత్తడి దేవుని విగ్రహాలు, రాగి వస్తువులు తొందరగా నల్లబడిపోతుంటాయి. వాటిని మామూలుగా శుభ్రం చేస్తే తెల్లబడవు. ప్రతి దాన్నీ శుభ్రం చేయడానికి ప్రత్యేక పద్ధతి ఉంది. ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎలా శుభ్రం చేయాలో చూడండి.
వెండి సామాన్లు శుభ్ర పరిచే పద్ధతులు:
1.నిమ్మరసం, ఉప్పు
వెండి దేవుళ్ల విగ్రహాలు, పూజా సామాగ్రి శుభ్రం చేయడానికి ఈ పద్ధతి మేలు. ఒక గిన్నెలో నిమ్మకాయ రసం పిండి, అందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేడి నీళ్లు పోసుకోవాలి. ఈ మిశ్రమంలో వెండి వస్తువులను ఒక 5 నిమిషాలుంచి మెత్తని వస్త్రంతో తుడిచేయాలి. పైనున్న నలుపు పోతుంది.
2. కెచప్
శ్యాండ్ విచ్, సమోసాలతో తినే కెచప్ ను వెండి వస్తువులు శుభ్రం చేయడానికి వాడొచ్చు. ఒక టిష్యూ మీద కాస్త కెచప్ వేసుకుని నలుపు ఉన్న దగ్గర రుద్దాలి. దాన్నలా 15 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత మెత్తని వస్త్రంతో తుడిచుకోవాలి. డిజైన్లున్న వస్తువులైతే మెత్తగా ఉండే టూత్ బ్రష్ తో ఒకసారి రుద్దండి. కెచప్ లో ఉండే ఆమ్లతత్వం వల్ల వెండి వస్తువులు తెల్లబడతాయి.
3. వెనిగర్
సగం కప్పు వెనిగర్‌లో, రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, గోరువెచ్చని నీళ్లు కలిపి దాంట్లో వెండి వస్తువులు పూర్తిగా నానేలా పెట్టుకోవాలి. ఒక రెండు గంటల తరువాత చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
ఇత్తడి వస్తువులు శుభ్రం చేసే పద్ధతి:
బియ్యంపిండి, వెనిగర్:
మూడు స్పూన్ల ఉప్పు, 1 చెంచా మైదా లేదా బియ్యం పిండి, నీళ్లు కలిపిన వెనిగర్ తీసుకుని పేస్ట్ లాగా చేసుకోవాలి. స్పాంజి లేదా ఏదైనా గుడ్డ సహాయంతో రాగి వస్తువులకు రాసుకోవాలి. వేడి నీళ్లతో కడిగేసుకుంటే చాలు. రాగి వస్తువల నలుపు వదిలిపోతుంది. వెనిగర్ కు బదులుగా నిమ్మరసం కూడా వాడొచ్చు.
రాగి వస్తువులు శుభ్రం చేసే పద్ధతి:
రాగి వస్తువులను నిమ్మరసంతో, వెనిగర్‌తో, కెచప్ తో కూడా శుభ్రం చేసుకోవచ్చు. టూత్ పేస్ట్ కూడా ఉపయోగించొచ్చు. కానీ అస్సలే నలుపు తగ్గకపోతే ఈ పద్ధతిలో శుభ్రం చేసి చూడండి.
ఒక లోతు ఎక్కువగా ఉన్న స్టీల్ పాత్ర తీసుకోవాలి. దాంట్లో రాగి వస్తువులు మునిగే అన్ని నీళ్లు పోసుకోవాలి. మూడు వంతుల నీళ్లకు 1 వంతు వెనిగర్ వేయాలి. దీంట్లోనే 3 చెంచాల ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రాగి వస్తువును మునిగేలా పెట్టుకుని, నీళ్లను వేడి చేసుకోవాలి. నీళ్లు మరగడం మొదలవ్వగానే జిడ్డు వదలడం గమనిస్తారు. ఇప్పుడు వెంటనే గ్యాస్ కట్టేయండి. నీళ్లు చల్లబడ్డాక రాగి వస్తువు బయటకు తీసి నిమ్మరసం, ఉప్పు కలిపిన మిశ్రమంతో ఒకసారి రుద్ది కడిగేయండి.
టాపిక్