Fake Paneer: పన్నీర్ కొనే ముందు మీ చేత్తో చిన్నటెస్ట్ చేయండి, నకిలీదైతే తెలిసిపోతుంది-check purity of paneer and milk at home in these ways ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fake Paneer: పన్నీర్ కొనే ముందు మీ చేత్తో చిన్నటెస్ట్ చేయండి, నకిలీదైతే తెలిసిపోతుంది

Fake Paneer: పన్నీర్ కొనే ముందు మీ చేత్తో చిన్నటెస్ట్ చేయండి, నకిలీదైతే తెలిసిపోతుంది

Koutik Pranaya Sree HT Telugu
Oct 22, 2024 07:00 PM IST

Paneer Adulteration: పన్నీర్ కూడా కల్తీ చేసే అవకాశం పండగల సమయాల్లో కాస్త పెరుగుతుంది. అందుకే పాలు, పన్నీర్ లాంటి వాటి స్వచ్ఛత తెల్సుకోడానికి ఎలాంటి పరీక్షలు ఇంట్లో చేయొచ్చో తెల్సుకోండి.

పన్నీర్, పాల కల్తీ గుర్తించాల్సిన పద్ధతి
పన్నీర్, పాల కల్తీ గుర్తించాల్సిన పద్ధతి (Shutterstock)

నకిలీ పన్నీర్‌ను అనలాగ్ పన్నీర్ లేదా సింథటిక్ పన్నీర్ అంటారు. దీన్ని పాలతో తయారు చేయరు. బదులుగా వెజిటేబుల్ నూనె, పిండి, రసాయనాలు లాంటివి వాడి తయారు చేస్తారు. రుచిలో, చూడ్డానికి ఏ మాత్రం తేడా లేకుండా అచ్చం నిజమైన పన్నీర్ తిన్నట్లే ఉంటుంది. అందుకే దీన్నెలా గుర్తించాలో, ఈ సింథటిక్ పన్నీర్ గురించి నష్టాలేంటో తెల్సుకుందాం.

సింథటిక్ పన్నీర్ అంటే?

వాస్తవానికి పనీర్ తయారు చేయడానికి సాంప్రదాయ పద్ధతి ఫాలో అవుతారు. పాలను వెనిగర్ లేదా నిమ్మరసం సహాయంతో విరగ్గొట్టి పన్నీర్ తయారు చేస్తారు. అయితే సింథటిక్ జున్ను ఇలా కాదు. దాంట్లో వెజిటేబుల్ నూనె కొవ్వు, పిండి, రసాయనాలు వాడతారు. దీని ధర సాధారణ పన్నీర్ కన్నా సగం తక్కువ ఉండొచ్చు. దీన్ని తింటే మాత్రం ఆరోగ్యం మీద దుష్రభావం తప్పదు.

సింథటిక్ పన్నీర్ గుండె ఆరోగ్యానికి కూడా చాలా హానికరం. ఇది తిన్న వెంటనే కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలతో పాటూ అనేక ఉదర సంబంధిత సమస్యలు కూడా రావచ్చు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రకారం ఇలాంటి కల్తీ పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ కూడా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.

కల్తీ ఎలా తెల్సుకోవాలి?

నకిలీ పన్నీర్ తెల్సుకోడానికి మీ చేతుల మధ్య పెట్టి నలిపి చూడటం. కాస్త పన్నీర్ తీసుకుని వేళ్లతో నలిపితే వెంటనే పిండిలాగా విరిగిపోకూడదు. కల్తీ లేని పన్నీర్‌ అలా సులభంగా పిండిలాగా అయిపోదు. దాంట్లో ఉండే అసలైన కొవ్వు దానికి కారణం. లేదంటే మరో మార్గం కూడా ఉంది. కాస్త పన్నీర్ తీసుకుని నీళ్లలో వేసి మరిగించాలి. అది చల్లారాక అందులో కందిపప్పు పొడి చేసి కాస్త కలపాలి. కాసేపటికి పన్నీర్ లేత ఎరుపు రంగులోకి మారితే అది యూరియా, లేదా డిటర్జెంట్ తో కల్తీ చేశారని అర్థం. అందుకే పన్నీర్ కొనేముందు తప్పక చేత్తో నలిపి, చిన్న ముక్క నోట్లో వేసుకుని రుచి చూసి కొనడం మేలు.

నకిలీ పాల కోసం పరీక్ష:

నకిలీ పాలను గుర్తించడానికి మీ ఇంట్లో సులభమైన పరీక్ష చేయవచ్చు. దీని కోసం ఒక గాజు గ్లాసు తీసుకోండి. ఇప్పుడు అందులో 5 మిల్లీ లీటర్ల పాలు కలపాలి. అంతే మొత్తంలో నీళ్లు కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఒకవేళ నురుగు ఏర్పడితే అందులో డిటర్జెంట్ కలిపారని అర్థం చేసుకోండి. అంతేకాకుండా అయోడిన్ సహాయంతో పాలలో కల్తీని కూడా గుర్తించవచ్చు. ఇందుకోసం రెండు నుంచి మూడు మిల్లీ లీటర్ల పాలను మరిగించి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాలలో రెండు మూడు చుక్కల అయోడిన్ కలపాలి. పాలు నిజమైతే దాని రంగు కాస్త పసుపు రంగులోకి మారుతుంది. పాలు నకిలీవి అయితే దాని రంగు నీలం రంగులో కనిపిస్తుంది.

Whats_app_banner