Chanakya Niti Telugu : ఇల్లు కట్టేముందు ఈ 4 విషయాలు చెక్ చేసుకోవాలి.. లేకపోతే ప్రమాదమే
Chanakya Niti Telugu : చాణక్యుడు గొప్ప వ్యక్తి. ప్రజలకు ఉపయోగపడే చాలా విషయాలను చెప్పాడు. వాటిని పాటించినవారు జీవితంలో విజయం సాధిస్తారు. జీవితాంతం నివసించే.. ఇంటిని కొనుగోలుచేసేప్పుడు లేదా నిర్మించేప్పుడు తీసుకోవాల్సి జాగ్రత్తల గురించి చాణక్యుడు వివరించాడు.
మధ్యతరగతి జీవితాల్లో ఇల్లు కొనడం అనేది ఓ పెద్ద విషయం. సొంతింటి కల అనేది చాలా గొప్పది. కానీ దానిని కొనుగోలు చేసేటప్పుడు, మీరు, మీ కుటుంబ సభ్యులు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోకుండా, తర్వాత పశ్చాత్తాపపడకుండా ఉండాలి. అందుకే ఇల్లు కొనేప్పుడు కొన్ని ప్రాథమిక విషయాలను గుర్తుంచుకోవాలి. ఇల్లు కొనేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటో ఈ పోస్ట్‌లో చూద్దాం.
చాణక్యుడు ప్రకారం, ఇల్లు కొనేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు అక్కడ నివసించే పొరుగువారి పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. సమీపంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలి. అటువంటి ప్రదేశంలో ఉండడం వల్ల మీకు ఆత్మవిశ్వాసం కలుగుతుంది. వారిలా పురోగమించాలనే మీ కోరిక పెరుగుతుంది. దాని కోసం కష్టపడి పనిచేయడానికి మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటారు. మీ చుట్టూ ఉండేవాళ్ల ప్రభావం మీ మీద కచ్చితంగా ఉంటుంది. అదే.. మీ చుట్టూ ఉన్న వాళ్లు పనికిరాని వాళ్లైతే మీరు కూడా అలాగే తయారవుతారు.
మీ ఇంటి చుట్టుపక్కల విద్యావంతులు, మేధావులు ఉంటే చాలా మంచిది. మీ పిల్లలు అదే వాతావరణాన్ని చూస్తారు. వారి మధ్య జీవిస్తారు. అటువంటి పరిస్థితిలో ఇది వారిపై సానుకూల ప్రభావం చూపుతుంది. జ్ఞానుల సహవాసం వల్ల మీరు కూడా జ్ఞానవంతులు అవుతారు. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా మీ పిల్లలకు మాత్రం ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. వారి జీవితంలో ఉన్నతస్థాయికి వెళ్తారు.
మీరు ఎక్కడ ఇల్లు కొనాలన్నా, నిర్మించాలన్నా చుట్టుపక్కల ప్రాంతంలో పాఠశాలలు, ఆసుపత్రులు ఉండాలి. పిల్లల చదువుల కోసం, వారు మంచి పాఠశాలలో చదవడం చాలా ముఖ్యం. ఏదైనా ఆరోగ్య సమస్య విషయంలో మీరు సమయం మించిపోకుండా.. ఆసుపత్రికి వెళ్లి సంప్రదించవచ్చు. మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో ఈ సౌకర్యాలు ఉన్నాయో లేదో పరిశీలించిన తర్వాత, మీరు ఇల్లు కొనడం లేదా నిర్మించడం గురించి ఆలోచించాలి.
ఇల్లు కొనే సమయంలో అక్కడి భద్రతా ఏర్పాట్లను కూడా చూడాలి. నిర్వహణ వ్యవస్థ సరిగ్గా ఉన్న ప్రదేశంలో ఇల్లు కొనండి. దీని ద్వారా, దొంగతనం, దోపిడీ ప్రమాదం లేకుండా మీరు మనశ్శాంతిని పొందవచ్చు. అంతే కాకుండా ఏ సమస్య వచ్చినా యాజమాన్యాన్ని అడిగితే వెంటనే సాయం అందుతుంది.
నాలుగైదు ఏళ్లు ఉపయోగించే.. ఫోన్ కొనేప్పుడే అందులో ఫీచర్స్ ఏంటి? ఎలా ఉంటుంది? అని ఎంక్వైరీ చేస్తాం. అలాంటిది జీవితకాలం నివసించే ఇంటిని కొన్నా, కట్టినా.. కచ్చితంగా చాలా లెక్కలు చూసుకోవాలి. ఇల్లు అంటే ప్రతీ ఒక్కరికి ఓ ఎమోషన్. ఇల్లు సరిగా ఉంటే కుటుంబం సరిగా ఉంటుంది. లేదంటే.. అన్ని సమస్యలే వస్తాయి. మీ మనశ్శాంతి.. మీ ఇంట్లోనే దొరుకుతుంది. కాబట్టి చాణక్యుడి చెప్పిన మాటలను ఇల్లు కొనేప్పుడు ఓ సారి గుర్తుచేసుకోండి.