Junk Food: ఈ జంక్ ఫుడ్స్‌తో ప్రయోజనాలు కూడా ఉన్నాయి
ఫిట్‌నెస్ ప్రియులు జంక్ ఫుడ్ అంటేనే జంకుతారు. అయితే కొన్ని రకాల జంక్ ఫుడ్స్‌తో కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటో చూడండి.
హెల్తీ డైట్‌ని ఫాలో అయ్యేవారు, ఫిట్‌నెస్‌ని బాగా ఇష్టపడేవారు జంక్‌ఫుడ్‌కి చాలా దూరంగా ఉంటారు. కొన్నిసార్లు కఠినమైన డైట్‌ని ఫాలో అవుతూ ఇష్టమైన ఆహారాన్ని దూరం చేసుకుంటారు. ముఖ్యంగా జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంటారు. ఎందుకంటే అవి చాలావరకు అనారోగ్యకరమైనవే. అయితే స్ట్రిక్ట్ డైట్ పాటిస్తున్న సమయంలో మనసు ఒక్కోసారి జంక్‌ఫుడ్ వైపు మళ్లుతుంది. వాటిని తినలేక.. తినాలనే కోరికను చంపుకోలేక చాలా మంది తమలో తామే మదన పడుతూ ఉంటారు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే మీరు జంక్‌ఫుడ్స్‌ను హ్యాపీగా తినేయండి.
అదేంటి జంక్‌ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు కదా తినేయమంటున్నారు అనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. ఎలాంటి జంక్‌ఫుడ్ తినాలో తెలిస్తే.. వాటిని తింటూ మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు అంటున్నారు నిపుణులు. హెల్తీ డైట్ అంటే నోరు కట్టేసుకోవడం కాదు.. ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసుకోవడమే అంటున్నారు.
సాధరణంగా జంక్ఫుడ్స్ అన్నింటినీ ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. వీటిలో తక్కువ పోషకాలు, అధిక కేలరీలు ఉంటాయి. కానీ చూడడానికి ఆకర్షణీయంగానూ.. రుచితో ఆనందించేలా చేస్తాయి. కాబట్టి వాటిని చూడగానే నోరు ఊరుతుంది. ఆ సమయంలో ఏది కనిపిస్తే దానిని తినడం అస్సలు మంచిది కాదు. కనిపించిందల్లా తినేసి తర్వాత తిరిగ్గా బాధపడటం కంటే.. హెల్తీ జంక్‌ఫుడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. పైగా కొన్ని జంక్ఫుడ్స్ మీ శరీరం బాగా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు కూడా అందిస్తాయి. ఇంతకీ ఆ జంక్ఫుడ్స్ ఏమిటి? మన శరీరానికి, ఆరోగ్యానికి అవి ఎంతవరకు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
డార్క్ చాక్లెట్
మీరు హెల్తీ జంక్‌ఫుడ్ తినాలనుకుంటే మీ లిస్ట్‌లో మొదటిగా ఉండాల్సింది డార్క్ చాక్లెట్. ఎందుకంటే దీనిలో బ్లూ బెర్రీస్‌తో సహా ఇతర పండ్ల కంటే అధికమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని శాస్త్రీయ అధ్యయనాలు చెప్తున్నాయి. ఇవి శరీరంలోని చెడు అణువులతో పోరాడడంలో మీకు సహాయం చేస్తాయి. అంతేకాకుండా గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.
డార్క్ చాక్లెట్స్ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. మీరు కాస్త డిస్టర్బ్‌గా ఉన్నప్పుడు దీనిని మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇది మీ ఏకాగ్రతను, మానసిక స్థితిని తక్షణమే మెరుగుపరుస్తుంది. హానికరమైన యూవీ కిరణాలనుంచి మీ చర్మాన్ని కాపాడడంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. మంచి నాణ్యమైన డార్క్ చాక్లెట్లో అధిక కోకో కంటెంట్ ఉంటుంది. కాబట్టి ఇది సాధారణ మిల్క్ చాక్లెట్ల కంటే చేదుగా ఉంటుంది. కానీ శరీరానికి అవసరమైన ఫైబర్, ఖనిజాలతో నిండి ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు తక్కువ మొత్తంలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల రక్తం గడ్డకట్టడాన్ని నివారించవచ్చు.
పాప్ కార్న్
సినిమా అంటే గుర్తొచ్చేది టికెట్ అయినా.. దానిని ఎంజాయ్ చేయాలంటే పాప్ కార్న్ ఉండాల్సిందే. ఈ స్నాక్ తృణధాన్యాల నుంచి తయారు చేస్తారు. ఇవి ఆరోగ్యాన్ని కాపాడడమేకాకుండా అనుకున్న దానికంటే ఎక్కువ తిన్నామనే అనుభూతిని కలిగిస్తాయి. తద్వారా మీరు ఎక్కువగా తినడాన్ని కంట్రోల్ చేయవచ్చు. దీనిని మీరు మీకు నచ్చిన మసాలాలతో కలిపి తీసుకోవచ్చు.
స్వీట్స్
మధుమేహం ఉన్న వారికి ఇది అస్సలు పనికి రాదు. కానీ పూర్తి ఆరోగ్యంగా ఉన్న వారు తక్కువ మోతాదులో స్వీట్స్ తీసుకుంటే కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. రోజూవారీ సమయంలో తక్కువ మొత్తంలో స్వీట్ తీసుకోవడం వల్ల మీ సంకల్ప శక్తి, స్వీయ నియంత్రణ మెరుగుపడుతుంది. శాస్త్రీయ అధ్యయనాల ప్రకారం మీ రక్తంలో చక్కెర తగ్గినప్పుడు మీ మెదడు మందగిస్తుందట. మీరు దేనిపైనా దృష్టిని కేంద్రీకరించకుండా చేస్తుందట. ఆ సమయంలో చిన్న అల్పాహారంగా స్వీట్ లేదా చక్కెర తీసుకుంటే మీ మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. మీరు మానసికంగా మెరుగ్గా ఉండాలంటే కచ్చితంగా చక్కెరను తీసుకోవాలని ఇటీవలి పరిశోధనలు సూచించాయి.
ఐస్ క్రీమ్స్
చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఐస్ క్రీంను ఇష్టపడతారు. అయితే కొందరు డైట్ కారణంగా వాటికి దూరంగా ఉంటారు. కానీ ఈ విషయం తెలిస్తే మీరు కచ్చితంగా ఐస్ క్రీం తింటారు. వీటిలో ప్రోటీన్, కాల్షియం వంటి కొన్నిప్రయోజనకరమైన పోషకాలు ఉన్నాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి. కొన్ని బ్రాండ్స్ విటమిన్ బి, ప్రోబయోటిక్స్‌తో కూడిన ఐస్ క్రీం తయారు చేస్తాయి. ఇవి మీ ఆరోగ్యానికి చాలా మంచివి. అతిగా తీసుకోనంత వరకు ఐస్ క్రీంలు మీకు మంచి ఆహారంగా చెప్పవచ్చు.
చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ చాలా తీపిగా ఉంటుంది. కాబట్టి దీనికి చాలామంది దూరంగా ఉంటారు. కానీ కొందరు చూయింగ్ గమ్ ఎక్కువగా తీసుకుంటారు. ఎందుకంటే ఇవి ఒత్తిడిని దూరం చేయడానికి ఉపయోగపడుతాయి. ఇటీవలే నిర్వహించిన ఓ అధ్యయనం చూయింగ్ గమ్ ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుందని తేల్చింది. రోజూవారీ కార్యకలాపాల పనితీరులో మెరుగుదల అందిస్తుందని ఆస్ట్రేలియన్ బృందం నివేదించింది. చూయింగ్ గమ్ ఫుడ్ తినాలనే కోరికను కూడా నియంత్రణలో ఉంచుతుంది. అయితే ఏదైనా మితంగానే ఉండాలి సుమా.
ఇవే కాకుండా స్వీట్ పోటాటో చిప్స్, పీనట్ బటర్ కప్స్, ఓట్ మీల్ కూకీస్ వంటి వాటిని మీరు తీసుకోవచ్చు. రోజూ అన్ని తినాలని కాకుండా.. రోజులో ఏదొక సమయంలో ఏదొ ఒకటి మీరు తీసుకుని మీ జంక్ ఫుడ్ కోరికలను అదుపులో ఉంచుకోవచ్చు. సరైన అవగాహనతో.. సరైన మోతాదులో వీటిని తీసుకుంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.