BMW X3 diesel SUV | బీఎండబ్ల్యూ నుంచి డీజిల్ వేరియంట్ X3 SUV కారు విడుదల
లగ్జరీ కార్ల తయారీదారు BMW గురువారం తమ బ్రాండ్ నుంచి X3 SUV డీజిల్ వేరియంట్ (BMW X3 xDrive20d)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. తాజాగా విడుదలైన డీజిల్ వేరియంట్ కూడా లుక్ పరంగా అచ్ఛం పెట్రోల్ వెర్షన్‌నే పోలి ఉంటుంది.
Chennai | లగ్జరీ కార్ల తయారీదారు BMW గురువారం తమ బ్రాండ్ నుంచి X3 SUV డీజిల్ వేరియంట్ (BMW X3 xDrive20d)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. స్థానికంగా చెన్నైలోని కంపెనీ ప్లాంట్‌లో తయారైన ఈ కొత్తకారు ధర రూ. 65.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఇదివరకే ఈ మోడెల్ లో పెట్రోల్ వెర్షన్‌ను సంస్థ విడుదల చేసింది. తాజాగా విడుదలైన డీజిల్ వేరియంట్ కూడా లుక్ పరంగా అచ్ఛం పెట్రోల్ వెర్షన్‌నే పోలి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్న ఏకైక తేడా ఏంటంటే డీజిల్ వేరియంట్‌లో టర్బోచార్జ్డ్ డీజిల్ పవర్‌ట్రెయిన్ వ్యవస్థ ఉంటుంది.
కొత్త BMW X3 SUV డీజిల్ వేరియంట్‌లో సాధారణంగా BMW కార్లకు ముందు భాగంలో ఉండే సిగ్నేచర్ కిడ్నీ గ్రిల్ కారుకు ఒక భారీతనాన్ని అందిస్తుంది. అలాగే అడాప్టివ్ LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్ పైపులు, ముందు-వెనక బంపర్‌లు అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి.
BMW X3 SUV- 2022
బోనెట్ కింద ట్విన్‌పవర్ టర్బో టెక్నాలజీతో రూపొందించిన శక్తివంతమైన 2.0-లీటర్ నాలుగు-సిలిండర్ల డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 140 kw/ 190 hp శక్తి, 1,750 - 2,500 rpm వద్ద గరిష్టంగా 400 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీంతో కేవంలో 7.9 సెకన్లలో గంటకు 0 -100 కి.మీ వేగాన్ని ఈ కారు అందుకుంటుంది. ఈ కారులో గరిష్టంగా గంటకు 213 కి.మీ వేగంతో దూసుకుపోవచ్చు.
లోపల క్యాబిన్‌లో మూడు-జోన్ల ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, 16-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, 12.3-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, 7.0తో పనిచేసే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉన్నాయి. వైర్‌లెస్ Apple CarPlay , Android Auto ఆపరేటింగ్ సిస్టమ్ లను సపోర్ట్ చేస్తుంది.
లగ్జరీ ఎడిషన్‌గా పరిచయం అవుతున్న BMW X3 డీజిల్ కారు మినరల్ వైట్, ఫైటోనిక్ బ్లూ, బ్రూక్లిన్ గ్రే, సోఫిస్టో గ్రే, బ్లాక్ సఫైర్ అలాగే కార్బన్ బ్లాక్ అనే 6 కలర్ వేరియంట్లలో లభిస్తుంది.