Bleeding Gums| చిగుళ్ల నుంచి రక్తస్రావమా? పట్టించుకోకపోతే పళ్లు రాలతాయ్!
Bleeding Gums Home Remedies: చిగుళ్ల నుంచి రక్తస్రావం జరిగడం సాధారణమే, అయితే తరచుగా ఇలా జరుగుతుందంటే మాత్రం దానిని విస్మరించకూడదు. చిగుళ్లలో రక్తస్రావాన్ని నివారించే మార్గాలు చూడండి.
Gum Care: మీరు మీ దంతాలను బ్రష్ చేస్తున్నపుడు, టూత్‌పేస్ట్ నురగను ఉమ్మివేసినప్పుడు ఆ నురగలో అప్పుడప్పుడు గులాబీ రంగును గమనించవచ్చు. లేదా దంతాలను ఫ్లాస్ చేస్తునప్పుడు కూడా కొంత రక్తస్రావం అనేది జరగవచ్చు. ఇది మీ చిగుళ్ళ నుంచి కలిగే రక్తస్రావం. ఈ రక్తస్రావం అనేది తక్కువ మొత్తంలో ఎప్పుడో ఒకసారి జరిగితే పెద్ద విషయం కాదు కానీ, మీ చిగుళ్ళలో రక్తస్రావం నిరంతరంగా ఉంటే, మీరు దానిని విస్మరించకూడదు. ఎందుకంటే ఇది మీ దంతాలు ఊడిపోవడం మొదలుకొని, వివిధ రకాల సమస్యలకు కారణం అవుతుంది.
చిగుళ్లలో బ్లీడింగ్ అనేది చాలా మంది ఎదుర్కొనే సాధారణ సమస్య. నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం, చిగుళ్ల వ్యాధి, హార్మోన్ల మార్పులు, కొన్ని ఔషధాల వాడకం లేదా గర్భిణీలలో తలెత్తే కొన్ని సమస్యలు వంటి అనేక కారణాల వల్ల ఇది సంభవించవచ్చు.
కాబట్టి చిగుళ్లలో నుంచి తరచుగా రక్తస్రావం జరిగుతుంటే, వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఈ సమస్యను ఇలాగే వదిలేస్తే అది చిగుళ్ల నష్టానికి దారితీస్తుంది, ఫలితంగా దంతాలు ఊడిపోతాయి. నోటి ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది, ఇది మరిన్ని దుష్ప్రభావాలను కలిగిస్తుంది.
Bleeding Gums Home Remedies- చిగుళ్ల నుంచి రక్తస్రావం నివారించే మార్గాలు
మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో, రక్తస్రావం నివారించడంలో సహాయపడే కొన్ని సహజ నివారణ మార్గాలను ఇక్కడ తెలుసుకోండి.
నోటి పరిశుభ్రత
ఫ్లోరైడ్ కలిగిన టూత్‌పేస్ట్‌ను ఉపయోగించి రోజుకు రెండుసార్లు దంతాలను బ్రష్ చేయాలి, కఠినమైన బ్రెసిల్స్ కలిగిన బ్రష్ చిగుళ్ళ కోతకు, దంతాలపై ఎనామిల్ దెబ్బతీయడానికి కారణం కావచ్చు. కాబట్టి మీరు దంతాలను శుభ్రం చేసుకోవడానికి మృదువైన బ్రష్ ఉపయోగించడం మంచిది. అంతేకాకుండా వారంలో కనీసం మూడు సార్లు ఫ్లాసింగ్ చేయడం , యాంటీ బాక్టీరియల్ మౌత్ వాష్ ఉపయోగించడం ద్వారా మీ దంతాలు, చిగుళ్ళ నుండి ఫలకం, బ్యాక్టీరియాను తొలగించవచ్చు, రక్తస్రావం అరికట్టవచ్చు.
ఉప్పునీటితో పుక్కిలించడం
ఉప్పులో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి మీ నోటిలో బ్యాక్టీరియాను చంపడానికి, మీ చిగుళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పును కరిగించి, 30 సెకన్ల పాటు మీ నోటితో పుక్కిలించండి. నోటికి సంబంధించిన చాలా వరకు సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆయిల్ పుల్లింగ్
నోటి ఆరోగ్య సంరక్షణలో భాగంగా చాలా ఏళ్లుగా ఆచరిస్తూ వస్తున్న మరొక కార్యాచరణ ఆయిల్ పుల్లింగ్. దీనివలన మీ నోరు శుభ్రపడుతుంది. ఒక టేబుల్ స్పూన్ నూనెను (కొబ్బరి లేదా నువ్వుల నూనె) మీ నోటిలో 10-20 నిమిషాల పాటు ఉంచుకొని పుక్కిలిస్తూ ఉండండి. ఇది మీ నోటి నుండి హానికరమైన బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది, మీ చిగుళ్ళలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
విటమిన్ సి
విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని మీ రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మీ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. విటమిన్ సి ఒక యాంటీఆక్సిడెంట్, ఇది రోగనిరోధక వ్యవస్థకు బలోపేతం చేస్తుంది, ఆరోగ్యకరమైన చిగుళ్ల కణజాలం నిర్మాణాన్ని ప్రోత్సహిస్తుంది. నారింజ, కివీస్, స్ట్రాబెర్రీలు, క్యాప్సికమ్ వంటి ఆహారాలలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది.
గ్రీన్ టీ
గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మీ చిగుళ్లలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి, మీ నోటిలో హానికరమైన బ్యాక్టీరియా వృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
పొగాకును నివారించడం
పైన పేర్కొన్న సంరక్షణ చర్యలు తీసుకుంటూనే పొగాకు ఉత్పత్తులను నివారించడం అనేది చిగుళ్ల ఆరోగ్యానికి, నోటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన అంశం. పొగాకు ఉత్పత్తులు నివారించడం వల్ల చిగుళ్లలో రక్తస్రావం, ఇతర నోటి ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. పొగాకు ఉత్పత్తులు మీ చిగుళ్ళకు హాని కలిగిస్తాయి, చిగుళ్ల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి, ఇది రక్తస్రావం సహా ఇతర అనేక అనారోగ్య సమస్యలకు, ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తుంది.
సంబంధిత కథనం