Tooth Powder vs Toothpaste | దంత ఆరోగ్యానికి పేస్ట్ వాడాలా లేక మంజనా ఏది బెస్ట్?
ఉదయం లేవగానే దంతాలు శుభ్రపరుచుకోవటానికి మనకు టూత్ పేస్ట్ లేదా టూత్ పౌడర్ ఆప్షన్లుగా ఉంటాయి. మరి ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనదో తెలుసా? ఈ స్టోరీ చదవండి.
దంత పరిశుభ్రత కోసం ఇప్పుడు ఎన్నో రకాల టూత్ పేస్టులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ కొంతమందికి దంత మంజన్, టూత్ పౌడర్ వంటి వాటితోనే పళ్లు తోముకోవటాన్ని ఇష్టపడతారు. మరి ఈ రెండింటిలో అసలు ఏది ఉత్తమమైనది ఏది అని మీరెప్పుడైనా సందేహించారా? నిజానికి టూత్‌పేస్ట్, టూత్ పౌడర్ రెండింటిలో ఒకే రకమైన సమ్మేళనాలు ఉంటాయి. రెండూ నోటి ఆరోగ్యానికి సంబంధించి వాటి వాటి ప్రయోజనాలు కలిగి ఉంటాయి. అయితే దంత ఫలకాన్ని తగ్గించటం అలాగే దంతాలపై ఏర్పడిన మరకలు తొలగించటానికి టూత్‌పేస్ట్ కంటే టూత్ పౌడర్ మెరుగైనదని కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయి.
టూత్ పౌడర్ పురాతన కాలం నుంచే ఉండేది శతాబ్దాల ముందు నుంచి చార్ కోల్, ఎములక చూర్ణం, బూడిద వంటి రకరకాల చూర్ణాలను మిశ్రమంగా చేసుకొని టూత్ పౌడర్ గా ఉపయోగించేవారు. టూత్‌పేస్ట్‌లోని కొన్ని తీపి పదార్థాలు మీ నోటిలో ఉండే ఎంజైమ్‌లను నాశనం చేస్తాయి, ఫలితంగా ఇది జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది. టూత్ పౌడర్లు ఎక్కువ శాతం సహజమైన, సేంద్రీయ పదార్థాలతో తయారు చేస్తారు. ఫ్లోరైడ్ కలిగి ఉండదు, కాబట్టి విషపూరితం కాదు. పిల్లల విషయంలో సురక్షితమైనది. నేడు లభించే టూత్ పౌడర్లలో స్పైస్ ఇంకా స్వీట్ రెండు ఫ్లేవర్లలో లభిస్తుంది. అయితే ఇంట్లో కూడా మీకు మీరుగా టూత్ పౌడర్ సిద్దం చేసుకోవచ్చు.
టూత్‌పేస్ట్ వలన ప్రయోజనాలు
దంతాలను శుభ్రపరచటంలో టూత్ పౌడర్ మెరుగైనదే అయినప్పటికీ టూత్‌పేస్ట్‌తో బహువిధమైన నోటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. టూత్ పౌడర్ ఫార్ములేషన్‌లలో ఫ్లోరైడ్ సమ్మేళనం ఉండదు. మరోవైపు టూత్‌పేస్ట్‌లో ఈ సమ్మేళనం ఉంటుంది. కాబట్టి దంతక్షయం, దంతాలకు సంబంధించి ఇతర ఏవైనా సమస్యలు ఉన్నప్పుడు టూత్‌పేస్ట్ ఉపయోగించటం మంచిది.
దంతాలను దృఢంగా ఉంచటానికి, దంతాలపై సున్నితంగా పాలిష్ పనిచేయటానికి టూత్‌పేస్ట్ ఉపయోగించాలి. అలాగే టూత్‌పేస్ట్ ఉపయోగించటం చాలా సులభం, నురగ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి నోరంతా తాజాగా మారిన అనుభూతి కలుగుతుంది.
పొగాకు, కాఫీ, టీ, రెడ్ వైన్ వంటి కొన్ని పానీయాలు ఎక్కువగా తీసుకునేంటే పళ్లపై కఠిన మరకలు ఏర్పడతాయి. ఇలాంటపుడు టూత్‌పేస్ట్ ఉత్తమం.
దంతాలను సులభంగా తెల్లగా మార్చటానికి, ఫలకాన్ని తగ్గించడాని, చిగురువాపును తొలగించడానికి, సున్నితమైన దంతాలు కలిగిన వారికి టూత్‌పేస్ట్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
చివరగా చెప్పేదేంటంటే.. దంత ఆరోగ్యం, నోటి ఆరోగ్యం విషయంలో మీకు వివిధ రకాల ప్రయోజనాలు కావాలంటే టూత్ పేస్ట్ ఉత్తమమైనది. దంతాలు శుభ్రంగా ఉండాలి అనుకునే వారు, ఫ్లోరైడ్ సమ్మేళనాలు వద్దనుకునే వారు, ఎలాంటి దంత సమస్యలు, చిగుళ్ల సమస్యలు లేని వారు టూత్ పౌడర్ ఉపయోగిస్తే మంచిది. ఏదేమైనా ఛాయిస్ మీదే!
సంబంధిత కథనం