New Year 2023 Resolutions । మీకోసం, మీ కుటుంబం కోసం ఈ కొత్త ఏడాదిలో ఇలాంటి తీర్మానాలు చేయండి!
New Year 2023 Resolutions Ideas: కొత్త సంవత్సరం అన్ని రకాలుగా కలిసి రావాలి, సంతోషంగా బ్రతకాలి అని అందరూ కోరుకుంటారు. తీర్మానాలు చేసుకుంటారు. మరి మీరు, మీ కుటుంబం బాగుండాలంటే ఇలాంటి తీర్మానాలు చేసుకోవాలి.
కొత్త ఆశలతో కొత్త సంవత్సరం 2023 రాబోతుంది. మరికొద్ది రోజులలో 2022 సంవత్సరం ముగుస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎన్నో రకాల ప్రణాళికలు వేసుకుంటారు, మరెన్నో రకాల తీర్మానాలను చేసుకుంటారు. మరి మీరు చేసిన తీర్మానాలు నెరవేరాలంటే ఆ దిశగా చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలి. మీతో పాటు మీ కుటుంబం, మీ పిల్లలు, ఆత్మీయుల భద్రతపై శ్రద్ధ వహించడం మీ బాధ్యత. ఈ కొత్త సంవత్సరం నుండి మీ సామాజిక, ఆర్థిక, ఆరోగ్య భద్రతను కల్పించడం కోసం మార్గాలను అన్వేషించండి.
New Year 2023 Resolutions Ideas- నూతన సంవత్సర తీర్మానాలు
రాబోయే సంవత్సరంలో మీకోసం, మీ కుటుంబ సంరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ఇక్కడ కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ దిశగా మీ వంతు ప్రయత్నం చేస్తే ఇవి మీకు మంచి భవిష్యత్తును అందిస్తాయి. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉండేందుకు దోహదపడతాయి.
కుటుంబ సభ్యులకు హెల్త్ చెకప్
మీ తల్లిదండ్రుల దగ్గరి నుండి మీ భార్యాపిల్లల వరకు కుటుంబ సభ్యులందరినీ మీరు రక్షించాలనుకుంటే, వారి ఆరోగ్య సంరక్షణ కోసం చర్యలు తీసుకోండి. ఎప్పటికప్పుడు వారికి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సకాలంలో గుర్తించి చికిత్స అందించవచ్చు.
ఆరోగ్యం బీమా
కేవలం హెల్త్ చెకప్ చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సభ్యులను రక్షించలేరు. వారికి ఏవైనా అనారోగ్య సమస్యలు బయటపడితే చికిత్స కూడా అవసరం. అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు చెప్పి రావు. కాబట్టి ఆసుపత్రుల్లో పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వస్తే అది మీ ఆర్థిక ప్రణాళికను దెబ్బతీయవచ్చు. అందువల్ల మీ ఇంట్లో మీతో పాటు ఇంటి సభ్యులకు ఆరోగ్య బీమా కల్పించడం ఉత్తమమైన చర్య. అలాగే మీ అందరి ఆరోగ్యం కోసం కూడా సరైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అవసరం.
విహారయాత్ర
శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యం. కుటుంబ సభ్యులు అందరూ కలిసి విహారయాత్ర చేస్తే మానసిక ఉల్లాసం లభిస్తుంది. జీవితంలో ఎప్పుడూ ఉండే సమస్యల సుడిగుండం నుంచి కొంత విరామం, విశ్రాంతి తీసుకున్నట్లు అవుతుంది. కాబట్టి మీ ఈ ఏడాది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర ప్లాన్ చేయండి, అడపాదడపా ఉత్సాహభరితమైన కార్యకలాపాలలో పాల్గొనేలా ప్లాన్ చేసుకోండి.
భవిష్యత్తు కోసం పొదుపు
మీరు 20 ఏళ్ల యువకుడైనా లేదా ఇంటి పెద్దవారైనా, భవిష్యత్తులో కుటుంబం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోకుండా చూసుకోవడం మీ బాధ్యత. కాబట్టి మీ ఆదాయంలో కొంత డబ్బును భవిష్యత్తు కోసం ఆదా చేయడం చాలా ముఖ్యం. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు చేసిన పొదుపు మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ నూతన ఏడాదిలో దుబారా ఖర్చులను నివారించండి. మీ కుటుంబ సభ్యులకు కూడా దీనిని బోధించండి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, జీవిత బీమా లేదా రిటైర్‌మెంట్ ప్లాన్ ద్వారా మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుకోవడానికి ప్లాన్ చేయండి.
నైపుణ్యాల శిక్షణ
మీరైనా, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వృత్తివ్యాపారాలలో ఉన్నతంగా రాణించాలంటే అందుకు తగిన నైపుణ్యాలు అవసరం. మీ పురోగతికి అవసరం అయ్యే శిక్షణ పొందడం, క్రాస్ కోర్సులు చేయడం ప్లాన్ చేయండి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు, చిన్నపిల్లలు ఉంటే వారి భద్రత కోసం, భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని చర్యలు ఆలస్యం చేయకుండా, వెంటనే ప్రారంభించండి.
చెడు వ్యసనాలను వదిలించుకోండి
ఏ వ్యక్తికైనా చెడు వ్యసనాలు మంచివి కావు. మీకు ధుమపానం, మద్యపానం మరేవైనా చెడు వ్యసనాలు ఉంటే వాటిని వదిలించుకోవడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యం, మీ డబ్బు, మీ గౌరవాన్ని దెబ్బతీసే ఎలాంటి చెడు అలవాట్లనైనా దూరం చేసుకోవడం మంచిది. ఆ దిశగా గట్టి ప్రయత్నాలు చేయాలి.
అందరికీ మంచి జరగాలనే ఆశతో కొత్త సంవత్సరాన్ని ఉత్సాహంగా స్వాగతిద్దాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు హిందూస్తాన్ టైమ్స్- తెలుగు తరఫున ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు.
సంబంధిత కథనం