Falooda | మండుటెండలో ఫాలుడా.. చేస్తుంది మిమ్మల్ని టండా టండా!
పైనుంచి సర్రుమనే ఎండ ఎంత ఉన్నా.. చల్లని ఫాలుడా నోట్లో వేసుకుని నములుతుంటే టండా.. టండా కూల్ కూల్ అనిపిస్తుంది.
చాలామందికి ఫాలుడా అంటే నోరూరుతుంది. శీతల పానీయలకు బదులు ఈ ఫాలుడాను తీసుకుంటే చాలా మంచింది. ఫాలుడాను ఒక పానీయం అని చెప్పలేం, చాలా మంది దీనిని బేవరేజ్- డీజర్ట్‌గా సూచించడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఇందులో సబ్జా, వెర్మిసెల్లీ, పాలు, డ్రై ఫ్రూట్స్, ఐస్ క్రీం, కుల్ఫీ లేదా రబ్రీతో పాటు కొంచెం నిమ్మకాయ, రోజ్ వాటర్, కస్టర్డ్ పౌడర్, పిస్తా, బాదాం, కాజు ఇలా అన్నీ కలిసి ఉంటాయి. ఒక్కో స్పూన్ తింటున్న కొద్దీ.. కొంచెం స్మూత్‌గా, కొంచెం క్రీమీగా, కొంచెం క్రంచీగా ఇలా రకరకాల ఫ్లేవర్స్ తీపితో మిళితం అయి నాలుకను తాకితే మనస్సుకు హాయిగా అనిపిస్తుంది.
విశేషమేమంటే.. ఈ ఫాలుడా కూడా మన హైదరాబాదీ కిచెన్లో నుంచి వచ్చిందే. పర్షియన్ పాలకులు ప్రత్యేకంగా దక్కనీ హైదరాబాద్, కర్నాటిక్ ప్రాంతాలలో ఈ స్పెషల్ ఫాలుడా రెసిపీని పరిచయం చేశారు. దమ్ బిర్యానీ లాగే దీని రుచికి జనాలు ఫిదా అవడంతో ఫాలుడా అన్ని ప్రాంతాలకు విస్తరించింది.
అయితే ఫాలుడాలో ఎన్ని రకాల పదార్థాలు కలిపినా అందులో మెయిన్ ఇంగ్రీడియెంట్ మాత్రం సబ్జా గింజలే. ఈ సబ్జా గింజలను మన భారతీయ కిచెన్ లో విరివిగా వాడతాం. ఇవి తినడం ద్వారా శరీరంలో వేడి తగ్గుతుంది.
ప్రయోజనాలు ఏముంటాయి?
- ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.
- చర్మానికి మేలు చేస్తాయి.
- దీనిలో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్ణం సమస్య ఉండదు కాబట్టి మలబద్ధకం సమస్య నివారించుకోవచ్చు.
- ఎసిడిటీ, ఉబ్బరం లేదా తలనొప్పిగా ఉంటే సబ్జాతో తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఇది సహజంగా శరీరాన్ని చల్లబరుస్తుంది, మలినాలను తొలగిస్తుంది.
- సబ్జాలో ALA (ఆల్ఫా లిపోయిక్ యాసిడ్) ఉంటుంది. ఇది కొవ్వును కరిగించి అధిక బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
సబ్జాను ఎలా తీసుకోవచ్చు?
సబ్జా గింజలను ఒకటి లేదా రెండు గంటల పాటు నానబెట్టాలి. అప్పుడు వీటి రూపం మారి నునుపుగా, జారిపోయేలా తయారవుతాయి.
ఇలా నానబెట్టిన సబ్జా గింజలను పెరుగు, మజ్జిగ, షర్బత్, మిల్క్‌షేక్ లాంటి పానీయాలలో కలుపుకొని తాగేయవచ్చు. లేదా ఒక గ్లాసు నీటిలో చిటికెడు ఉప్పు, కొంచెం పంచదార వేసి తాగవచ్చు. లేదా ఫాలుడా లాగా మిక్స్ చేసి రీఫ్రెష్ అవ్వవచ్చు.
సంబంధిత కథనం