Basil leaves in skincare: తులసితో మీ చర్మానికి 5 అద్భుతమైన ఉపయోగాలు-basil leaves in beauty skincare routine 5 ways tulsi can transform your skin ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Basil Leaves In Beauty Skincare Routine 5 Ways Tulsi Can Transform Your Skin

Basil leaves in skincare: తులసితో మీ చర్మానికి 5 అద్భుతమైన ఉపయోగాలు

Zarafshan Shiraz HT Telugu
Feb 16, 2023 07:02 PM IST

Basil leaves in skincare: తులసిలో ఉండే ఔషధ గుణాలు మీ చర్మాన్ని ఆరోగ్యంగా చేయడంలో సహాయపడుతాయని నిపుణులు ఇక్కడ సూచిస్తున్నారు.

తులసితో చర్మానికి 5 అద్భుతమైన ప్రయోజనాలు
తులసితో చర్మానికి 5 అద్భుతమైన ప్రయోజనాలు (Image by Bhushir Kachchhi from Pixabay )

తులసి చర్మానికి అనేక ప్రయోజనాలను ఇస్తుంది. పొడి చర్మం, సున్నితమైన, మొటిమలు కలిగిన చర్మం లేదా వృద్ధాప్య ఛాయలు ఉన్న చర్మాన్ని కలిగి ఉన్నా తులసిని మీ రోజువారీ చర్మ సంరక్షణలో భాగంగా చేసుకుంటే చర్మాన్ని ఆరోగ్యవంతంగా చేయడంలో, యవ్వన మెరుపును అందించడంలో సహాయపడుతుంది. ఔషధ మొక్క అయిన తులసిని మీ అందం, చర్మ సంరక్షణ కోసం ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కపివా ఆర్ అండ్ డీ హెడ్ డాక్టర్ కృతి సోనీ హెచ్‌టీ లైఫ్‌స్టైల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తులసి మీ సౌందర్యానికి ఉపయోగపడే మార్గాలను వివరించారు.

1. యాంటీ ఏజింగ్ గుణాలు కలిగిన తులసి

తులసిలో యాంటీఆక్సిడెంట్స్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇది యాంటీ ఏజింగ్ స్కిన్‌కేర్ రొటీన్‌కు అద్భుతంగా పనికొస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేసే ఫ్రీ రాడికల్స్ నుండి చర్మం దెబ్బతినకుండా నిరోధించడంలో తులసి సహాయపడుతుంది. ఇందులోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ ఇన్‌ఫ్లేషన్, ఎరుపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఈ రెండూ వృద్ధాప్య రూపానికి కారణమవుతాయి. తులసి సారం లేదా నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా మీరు మీ చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

2. మొటిమలకు చికిత్స

తులసి సహజ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మొటిమలకు సమర్థవంతమైన ఔషధంగా పని చేస్తుంది. దాని యాంటీ బాక్టీరియల్ లక్షణాల కారణంగా ఇది మొటిమలకు కారణమయ్యే క్రిములను తొలగించడంలో సహాయపడుతుంది. ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడానికి, రంధ్రాలు తెరుచుకోవడానికి సహాయపడుతుంది. తులసి సారం లేదా తులసి నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడితే మొటిమలను క్లియర్ చేయవచ్చు. భవిష్యత్తులో అవి ఏర్పడకుండా నిరోధించవచ్చు. మీకు కొద్దిస్థాయిలో లేదా ఎక్కువ స్థాయిలో మొటిమలు ఉన్నా తులసి సమర్థవంతమైన చికిత్సగా ఉపయోగపడుతుంది.

3. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది

తులసిలో అధిక స్థాయిలో విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మాన్ని సహజంగా ప్రకాశవంతంగా మార్చుతుంది. ఇందులోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు విటమిన్ సి కలిసి డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ రూపాన్ని తగ్గిస్తాయి. అలాగే ఇది చర్మపు రంగును ప్రకాశవంతం చేయడానికి సహాయపడుతుంది. తులసి సారం లేదా తులసి నూనెతో కూడిన చర్మ సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల చర్మానికి కాంతి, ఆరోగ్యకరమైన మెరుపు వస్తుంది.

4. మాయిశ్చరైజింగ్

తులసిలో స్వాభావికంగా ఉండే మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా చర్మం తేమగా, మృదువుగా ఉంటుంది. ఇది చర్మానికి లోతైన పోషణను అందించగల ముఖ్యమైన నూనెలను కలిగి ఉంటుంది. ఇది పొడి బారిన చర్మం కోసం ఉపయోగించడానికి అద్భుతమైన పదార్ధం.

5. ప్రశాంతతనిస్తుంది

తులసి చర్మంపై చికాకును మాయం చేసి ప్రశాంతతనిస్తుంది. చికాకు నుంచి ఉపశమనం ఇస్తుంది. తులసిలో ఉండే యూజెనాల్‌ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలతో కూడిన సమ్మేళనం. ఇది చర్మంపై వాపు, మంటను తగ్గిస్తుంది. తులసిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మాన్ని పర్యావరణ ఒత్తిళ్ల నుండి రక్షించడంలో సహాయపడతాయి.

WhatsApp channel

టాపిక్