Teeth Health: దంతాలపై పసుపు మచ్చలు ఉన్నాయా? ఈ చిట్కాలను పాటించండి, మిలామిలా మెరిసిపోతాయి-are there yellow spots on the teeth follow these tips and shine like a charm ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Teeth Health: దంతాలపై పసుపు మచ్చలు ఉన్నాయా? ఈ చిట్కాలను పాటించండి, మిలామిలా మెరిసిపోతాయి

Teeth Health: దంతాలపై పసుపు మచ్చలు ఉన్నాయా? ఈ చిట్కాలను పాటించండి, మిలామిలా మెరిసిపోతాయి

Haritha Chappa HT Telugu
Jan 20, 2024 02:47 PM IST

Teeth Health: కొందరికి ఎంతగా బ్రష్ చేసినా దంతాలు పసుపచ్చ రంగులోనే ఉంటాయి. అలాంటివారు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.

దంతాల ఆరోగ్యం
దంతాల ఆరోగ్యం (pixabay)

Teeth Health: ఎవరినైనా ఆకట్టుకునేది చిరునవ్వే. నవ్వగానే తెల్లటి దంతాలు మెరుస్తూ ఉంటే ఆ అందమే వేరు. కానీ కొందరికి దంతాలపై పసుపచ్చ మచ్చలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి అందాన్ని తగ్గిస్తాయి. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా దంతాలను మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కాలు పాటించడానికి పెద్దగా ఖర్చు కూడా అవ్వదు. సాధారణ వస్తువులతోనే దంతాలను మెరిపించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏంటో చూద్దాం.

1. అరటిపండు తినేశాక ఆ తొక్కను పడేయకండి. ఆ తొక్కలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అవి మీ దంతాలను మెరిపించగలవు. తొక్క లోపల భాగంతో మీ దంతాలపై ఐదు నిమిషాల పాటు బాగా రుద్దండి. అరటి తొక్కలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటివి దంతాలు తెల్లబడడంలో సాయపడతాయి.

2. బొగ్గును చూసి అందరూ ముట్టుకోకుండా దూరంగా వెళ్తారు. కానీ బొగ్గుకు మన దంతాలను మెరిపించే శక్తి ఉంటుంది. అందుకే బొగ్గుతో తయారైన టూత్ పేస్ట్ లు ఇప్పుడు వస్తున్నాయి. మంచి బొగ్గు ముక్కును తీసుకొని మీ దంతాలపై కాసేపు రుద్దండి. ఇలా తరచూ చేయడం వల్ల దంతాలపై ఉన్న పసుపచ్చ మరకలు పోతాయి.

3. ప్రాచీన కాలం నుంచి వాడుతున్న ఒక ఇంటి చిట్కా ఉంది. బేకింగ్ సోడాలో కొద్దిగా నిమ్మరసం కలిపి బ్రష్ పై పెట్టి దాంతో దంతాలను శుభ్రం చేయడం వల్ల దంతాలు మెరిసే అవకాశం ఉంది. కనీసం ఒక నిమిషం లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు ఈ మిశ్రమంతో దంతాలను రుద్దవలసి ఉంటుంది.

4. స్ట్రాబెర్రీలు దంతాల రంగును మెరుగుపరిచేలా చేస్తాయి. బాగా పండిన స్ట్రాబెర్రీని మెత్తగా చేసి ఆ పేస్టులో బేకింగ్ సోడాను కలపండి. ఆ మిశ్రమాన్ని దంతాలకు రాసి బాగా రుద్దండి. స్ట్రాబెరీ లో మాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది దంతాలను తెల్లగా మారుస్తుంది.

5. ఆయిల్ పుల్లింగ్ వల్ల దంతాలు తెల్లగా మారుతాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెను తీసుకొని నోట్లో వేసుకోవాలి. 15 నుంచి 20 నిమిషాలు పాటు పుక్కిలిస్తూ ఉండాలి. ఈ కొబ్బరినూనె దంతాలపై ఉన్న మరకలు త్వరగా పోయేలా చేస్తుంది. ఇది ఉమ్మేసాక బ్రష్ చేసుకుంటే దంతాలు తెల్లగా మెరిసే అవకాశం ఉంది.

6. ఆపిల్ సిడర్ వెనిగర్ సూపర్ మార్కెట్లలో లభిస్తుంది. ఈ ఆపిల్ సిడర్ వెనిగర్‌ని నీటిలో వేసి ఆ నీటిని నోట్లో వేసుకొని పుక్కిలిస్తూ ఉండాలి. ఒక నిమిషం పాటు అలా పుక్కిలించి ఉమ్మేయాలి. తర్వాత బ్రష్ చేసుకుంటే దంతాల మెరుపు ఖాయం.

7. ఆవాల నూనెను వాడడం ద్వారా దంత సమస్యలను తీర్చుకోవచ్చు. ఒక చిన్న స్పూను ఉప్పు తీసుకొని, ఆ ఉప్పులో ఆవాలు నూనెను కలపాలి. ఈ మిశ్రమాన్ని దంతాలకు అప్లై చేసి కొన్ని నిమిషాల పాటు రుద్దుతూ ఉండాలి. తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల దంతాలు మెరవడం ఖాయం.

WhatsApp channel

టాపిక్