Ambassador 2.0 | సరికొత్త అవతారంలో మళ్లీ వస్తున్న క్లాసిక్ అంబాసిడర్ కార్!
Ambassador 2.0 - 90వ దశకంలో రాజదర్పానికి చిహ్నంగా నిలిచిన అంబాసిడర్ కార్ ఇప్పుడు సరికొత్త అవతారంలో మళ్లీ 2.0గా ఇండియాకు రాబోతుంది.
దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన ఆ క్లాసిక్ ఇండియన్ కార్.. మార్కెట్లోకి కొత్తకొత్త కార్లు రావడంతో క్రమక్రమంగా ఆ వెలుగును కోల్పోతూ వచ్చింది. ప్రజల నుంచి డిమాండ్ లేకపోవడం, అలాగే దాని తయారీదారు హిందుస్థాన్ మోటార్స్ నిధుల కొరతను ఎదుర్కోవడంతో 2014 నుంచి అంబాసిడర్ కార్ల ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఈ ఐకానిక్ మళ్లీ సరికొత్త అవతారంలో అంబాసిడర్ 2.0గా భారత మార్కెట్లోకి తిరిగి రాబోతున్నట్లు నివేదికలు వెల్లడించాయి.
హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (HMFCI) ఈ క్లాసిక్ కారును పునరుద్ధరించటానికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ అయిన ప్యుగోట్‌తో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు సరికొత్త అంబాసిడర్ 2.0 కార్ డిజైన్ ఎలా ఉండాలి? ఇంజన్ అమరికలపై కలిసి పనిచేస్తున్నాయి. వీరి జాయింట్ వెంచర్లో భాగంగా హిందుస్థాన్ మోటార్స్ చెన్నై ప్లాంట్‌లో ఈ కారును తయారు చేయనున్నారు. మరో రెండేళ్లలో అంటే 2024లో అంబాసిడర్ 2.0ను మార్కెట్లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ముద్దుగా 'అంబీ' అని పిలుస్తున్నారు.
అంబాసిడర్ కారు అచ్ఛం బ్రిటిష్ కారు మోరిస్ ఆక్స్‌ఫర్డ్ సిరీస్ IIIను పోలి ఉంటుంది. ఇండియాలో 1958లో ప్రారంభమైన అంబాసిడర్ కారు కొద్దికాలంలోనే ప్రజాదరణ చూరగొని స్టేటస్ సింబల్‌గా ఉద్భవించింది. ఇండియాలో దశాబ్దాలుగా అత్యధికంగా అమ్ముడుపోయిన కారుగా నిలిచింది. అయితే 57 సంవత్సరాల తర్వాత భారీ నష్టాల కారణంగా 2014లో ఉత్పత్తి నిలిచిపోయింది. అదే క్రమంలో 2017లో ఫ్రెంచ్ సంస్థ ప్యుగోట్‌కు అంబాసిడర్ బ్రాండ్‌ను రూ. 80 కోట్లకు CK బిర్లా గ్రూప్ విక్రయించింది.
సంబంధిత కథనం