Photography Tips | స్మైల్ ప్లీజ్.. ఫోటోలు తీసేటపుడు ఈ టిప్స్ పాటించండి!
వెయ్యి మాటలు వ్యక్తపరచని భావాన్ని ఒక ఫోటో చెబుతుంది. కాలం గడిచినా చెదరని సంతకం ఫోటో. కలకాలం నిలిచే జ్ఞాపకం ఫోటో. ఆ ఫోటో బాగా చిత్రీకరించడానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి..
ఒకప్పుడు ఫోటో అంటే అదొక పెద్ద ప్రక్రియ. మనం తీసుకున్న ఫోటోని మనం చూడాలంటే రోజులు పట్టేది. కానీ ఇప్పుడు అందరి అరచేతుల్లో కెమెరా ఉంది. ఎవరికి వారు ఎప్పుడైనా, ఎక్కడైనా తమ స్మార్ట్‌ఫోన్‌లలోనే ఫోటోలు తీసుకోవచ్చు, లెక్కలేనని జ్ఞాపకాలు దాచుకోవచ్చు. మొబైల్ ఫోటోగ్రఫీ ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ గా అవతరించింది.
ఇప్పుడు ఎవరైనా కొత్త ప్రదేశానికి వెళ్లినపుడు ప్రతీది తమ కెమెరాలో బంధించడానికి ఇష్టపడుతున్నారు. మార్కెట్లు, రోడ్లు, జనాలు, చెట్లు, చెట్టుపైన కోతులు, పుట్టలు, పుట్టగొడుగులు ఇలా ఒకటేమిటి తమ హోటెల్ గది నుంచి అద్భుతమైన ప్రకృతి దృశ్యాల వరకు కాదేదీ ఫోటోకి అనర్హం అన్నట్లుగా ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు అందరూ ఫోటోగ్రాఫర్లే.
అయితే భద్రంగా దాచుకునే మీ ఫోటలను మరింత అందంగా చిత్రీకరించడం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలను అందిస్తున్నాం. ఇవి మీ ఫోటోగ్రఫీ నైపుణ్యాలకు మరింత పదును పెడతాయి.
లైటింగ్‌పై దృష్టి పెట్టండి:
ఫోటోను తీసేముందు కాంతి ఎటువైపు ఉందో ముందుగా గమనించాలి. కెమెరాను నేరుగా సూర్యుడు ఉన్న వెపు గానీ, లేదా కాంతి ఉద్భవించే వైపు కాకుండా కాంతిపడే దిశలో ఫోటోలు తీయాలి. అప్పుడే ఫోటోలు చాలా స్పష్టంగా వస్తాయి. లేకపోతే చీకటిగా వస్తాయి. కాబట్టి మీ లెన్సును అన్నివైపులా తిప్పిచూడండి. ఎటువైపు దృశ్యం చక్కగా ఉందో చూసుకొని అప్పుడు ఫోటో తీయండి.
ఫ్రేమ్ సెట్ చేయండి:
మీ కెమెరాలో ఫ్రేమ్ సెట్ చేయడం ద్వారా కూడా ఫోటో అందంగా కనిపిస్తుంది. కెమెరా ఆన్ చేసి చూసినపుడు దీర్ఘచతురస్రాకరంగా కనిపిస్తుంది. అందులో వస్తువు లేదా వ్యక్తి మధ్యలో ఉంటే ఎలా ఉంటుంది? ఒక పక్కగా ఉంటే ఎలా ఉంటుంది, ఏమేమి కనిపించాలి అనేది ముందుగా ఫ్రేములో చూసుకొని ఆ తర్వాత అలా క్లిక్‌మనిపించాలి.
క్లోజ్-అప్ షాట్:
క్లోజ్-అప్ షాట్ తీసేందుకు చాలా దూరం నుంచి ఫోటోలు జూమ్ తీసి చిత్రీకరించవద్దు. వస్తువుకు వీలైనంత దగ్గరగా వెళ్లి, ఆపై దానిపై ఫోకస్ కేంద్రీకరించండి. జూమ్‌ని సవరించి ఫోటో తీస్తే అద్భుతంగా వస్తుంది. దూరం నుంచి జూమ్ చేస్తే ఫోటో మసకబారినట్లు వస్తుంది.
మోడ్ మార్చండి:
ఇప్పుడు వచ్చే దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలో కెమెరా కాన్ఫిగరేషన్ చాలా గొప్పగా ఉంటుంది. ఆ కెమెరాలో డీఫాల్ట్‌గానే ఎన్నో రకాల ఫీచర్లు, మోడ్‌లు ఇస్తున్నారు. ఒకసారి అవన్నీ చెక్ చేయండి. ఎలాంటి మోడ్‌లో ఫోటో ఎలా వస్తుందనేది పరిశీలించండి. ఆ ప్రకారంగా మీకు కావాల్సిన మోడ్‌ను ఎంచుకోండి.అయితే ఫోటో తీసేటపుడు పొరపాటున కూడా ఫిల్టర్లు ఎంచుకోకండి. ఎందుకంటే ఈ ఆ దృశ్యం సహజత్వాన్ని, ఫోటో క్వాలిటీని తగ్గిస్తాయి. వీలైనంత వరకు ఫిల్టర్ లేకుండానే ఫోటోలు తీయడానికి ప్రయత్నించండి.
కెమెరాను కదిలించకుండా జాగ్రత్తపడండి:
కొంతమంది చేతిలో కెమెరా పట్టుకుంటే చేతిలో తుపాకీ ఏదో పట్టుకున్నట్లుగా వారి చేయి షేక్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా వీడియోలు తీసేటపుడు ఇలా చేయి అదిరితే ఫోటోలు, వీడియోలు కూడా షేక్ అవుతాయి. కాబట్టి దీనిని నివారించడానికి ట్రైపాడ్, మోనో పాడ్, సెల్ఫీ స్టిక్‌లను ఉపయోగించండి.
సంబంధిత కథనం