2022 Jeep Compass | జీప్ కంపాస్ SUV యానివర్శరీ ఎడిషన్ విడుదల, ప్రత్యేకతలివే!
జీప్ ఇండియా 2017లో లాంచ్ చేసిన జీప్ కంపాస్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. 5వ వార్షికోత్సవం సందర్భంగా 2022 Jeep Compass Anniversary Edition మోడల్‌ను విడుదల చేసింది.
ప్రముఖ వాహన తయారీ సంస్థ జీప్ ఇండియా తమ కంపాస్ SUV 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని స్పెషల్ యానివర్సరీ ఎడిషన్ వాహనాన్ని విడుదల చేసింది. సరికొత్త Jeep Compass Anniversary Edition ధర ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 24.44 లక్షలుగా ఉంది. ఇప్పటికే ఈ SUVకి సంబంధించి జీప్ ఇండియా వెబ్‌సైట్‌లో అలాగే డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లు ప్రారంభమైనాయి. ఇది 4x2 అలాగే 4x4 రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్ లో అందుబాటులో ఉంది
డిజైన్ ఇంకా ఫీచర్లను పరిశీలిస్తే.. కంపాస్ 5వ వార్షికోత్సవ ఎడిషన్ వాహనంలో గ్రానైట్ క్రిస్టల్ ముగింపుతో కూడిన 18-అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఐదవ-వార్షిక స్మారక బ్యాడ్జ్, కొత్త గ్లోస్ బ్లాక్ గ్రిల్, గ్రే వింగ్ మిర్రర్‌లతో గ్రే కలర్ బంపర్ గార్నిష్‌ని పొందింది. అలాగే బాడీ కలర్ క్లాడింగ్, కాంట్రాస్టింగ్ రూఫ్ రైల్స్ ఉన్నాయి.
క్యాబిన్ లోపల డ్యాష్‌బోర్డ్‌పై పియానో బ్లాక్ యాక్సెంట్‌లు, బ్లాక్ హెడ్‌లైనర్‌తో ఆల్ బ్లాక్ కలర్ స్కీమ్‌ను కలిగి ఉంది. ఇంకా గన్ మెటల్ ఇంటీరియర్ యాక్సెంట్‌లను పొందుతుంది. లైట్ టంగ్‌స్టన్ స్టిచింగ్‌తో ప్రత్యేక లెదర్ సీట్లు ఇవ్వడం క్యాబిన్‌కు మరింత చమత్కారమైన రూపాన్ని అందిస్తోంది.
ఇతర ఇంటీరియర్ భాగాలలో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ IRVM వంటివి హైలైట్‌లుగా ఉన్నాయి.
ఇంజన్ స్పెసిఫికేషన్స్
5వ వార్షికోత్సవ ఎడిషన్ కూడా దీని ప్రామాణిక SUV వలె అదే ఇంజన్ సెటప్‌ను కలిగి ఉంది. 4X2 కాన్ఫిగరేషన్‌లో 1.4-లీటర్ మల్టీఎయిర్ పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ DCT గేర్‌బాక్స్ జతగా ఉంటుంది. ఇది 163hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. మరొకటి 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌తో 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది 173hp శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
అయితే మల్టీజెట్‌లో టాప్-ఆఫ్-ది-లైన్ 5వ వార్షికోత్సవ కంపాస్ 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేసిన డీజిల్ వెర్షన్లో మాత్రమే 4X4 కాన్ఫిగరేషన్‌తో పొందవచ్చు.
ఈ జీప్ SUV మార్కెట్లో హ్యుందాయ్ టక్సన్, సిట్రోయెన్ C5 ఎయిర్‌క్రాస్, ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ వంటి ప్రీమియం SUVలకు పోటీగా నిలుస్తుంది.
సంబంధిత కథనం