World Cup Final vs Box Office: బాక్సాఫీస్ కలెక్షన్లపై వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బ.. ఆ సినిమాలకు భారీ నష్టాలు
World Cup Final vs Box Office: బాక్సాఫీస్ కలెక్షన్లపై వరల్డ్ కప్ ఫైనల్ దెబ్బ గట్టిగానే పడింది. ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సినిమాలు ఆదివారం (నవంబర్ 19) భారీగానే నష్టాలు చవిచూశాయి.
World Cup Final vs Box Office: వరల్డ్ కప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరిగిన ఆదివారం (నవంబర్ 19) రోజు సినిమాల బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఇండియా, ఆస్ట్రేలియా ఆడిన ఈ ఫైనల్ మ్యాచ్ చూడటానికి అభిమానులంతా టీవీలకే అతుక్కుపోవడంతో థియేటర్లు వెలవెలబోయాయి. బాలీవుడ్, టాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకూ ఈ ఫైనల్ దెబ్బ గట్టిగానే తగిలింది.
బాలీవుడ్ లో గత ఆదివారం దీపావళి సందర్భంగా రిలీజైన టైగర్ 3 మూవీ.. ఈ ఫైనల్ మ్యాచ్ కారణంగా భారీగానే కలెక్షన్లను కోల్పోయింది. శనివారం (నవంబర్ 18) రూ.18 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. ఆదివారం రూ.10 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా అన్ని సినిమాల కలెక్షన్లూ పడిపోయాయి. చాలా వరకూ థియేటర్లలో మధ్యాహ్నం నుంచి ఏకంగా షోలనే రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఫైనల్ మ్యాచ్.. కోట్లలో నష్టాలు
మధ్యాహ్నం 2 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడంతో.. నూన్ షో, ఫస్ట్, సెకండ్ షోలపై ప్రభావం పడింది. ఆదివారం అయినా కూడా ఎక్కడ ఏ థియేటర్ కూడా హౌజ్ ఫుల్ అయిన పరిస్థితి కనిపించలేదు. తెలుగులో ఈ మధ్యే రిలీజైన మంగళవారం సినిమాపై కూడా ఈ ఫైనల్ మ్యాచ్ ప్రభావం బాగానే పడింది. తొలి రోజు రూ.2.2 కోట్ల షేర్ ఈ సినిమా సాధించింది.
అయితే మూడో రోజైన ఆదివారం ఇది రూ.1 కోటికి పడిపోయింది. ఒకవేళ ఫైనల్ మ్యాచ్ లేకపోయి ఉంటే ఇది కనీసం రూ.3 కోట్ల వరకూ ఉంటుందని మేకర్స్ భావించారు. అయితే క్రికెట్ మ్యాచ్ దెబ్బకు ఫస్ట్ వీకెండ్ మూడు రోజులు కలిపి ప్రపంచవ్యాప్తంగా మంగళవారం మూవీ కేవలం రూ.5 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేయగలిగింది.
ఇండియా, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ ఫైనల్ వల్ల దేశవ్యాప్తంగా వివిధ భాషల సినిమాలు అన్నీ కలిపి బాక్సాఫీస్ కలెక్షన్లు రూ.50 నుంచి రూ.100 కోట్ల వరకూ నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మ్యాచ్ కోసం ముందు నుంచీ ఎంతో ఆతృతగా ఎదురు చూసిన కోట్లాది మంది అభిమానులు.. అసలు థియేటర్ల వైపు తొంగి చూడలేదు.
టాపిక్