Weapon Review: వెపన్ రివ్యూ - అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన సత్యరాజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Weapon Review: సత్యరాజ్, వసంత్‌రవి, తాన్యహోప్ ప్రధాన పాత్రల్లో నటించిన వెపన్ మూవీ ఇటీవల అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సూపర్ హీరో మూవీ ఎలా ఉందంటే?
Weapon Review: సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో నటించిన వెపన్ మూవీ తెలుగులో ఆమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఎలా ఉందంటే?
ఇద్దరు సూపర్ హీరోల కథ...
అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. సూపర్ హ్యూమన్స్‌పై వీడియోలు చేస్తుంటాడు. మరోవైపు పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతుంటాడు. తేని ఏరియాలో మిత్రన్ (సత్యరాజ్) అనే సూపర్ హ్యూమన్ ఉన్నాడని అగ్నికి ఓ వీడియో ద్వారా తెలుస్తుంది. తన ప్రియురాలు అవంతికతో (తాన్య హోప్)తో కలిసి మిత్రన్‌ను వెతుక్కుంటూ తేనికి వస్తాడు అగ్ని. అదే టైమ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పెద్ద బాంబు బ్లాస్ట్ జరుగుతుంది.
అదే ప్రదేశంలో ఎన్ఎస్‌జీ టీమ్‌కు అగ్ని దొరుకుతాడు. అతడిని ఉగ్రవాదిగా భావించి అరెస్ట్ చేస్తారు. అగ్ని నుంచి నిజాలు రాబట్టే బాధ్యతను ఏంజెట్ ఎక్స్ (వసంత్ రవి) తీసుకుంటాడు. మరోవైపు మిత్రన్ ను పట్టుకోవడానికి ఇండియన్ ఎకానమీని రూల్ చేస్తోన్న ఆయుధాల స్మగ్లింగ్ డీలర్ డీకే (రాజీవ్ మీనన్) తన మనుషులను పంపిస్తాడు. అయితే డీకే పంపించిన మనుషులు అందరిని మిత్రన్ చంపేస్తుంటాడు.
డీకే మనుషులను సూపర్ హ్యూమన్ ఎందుకు టార్గెట్ చేశాడు? అగ్నికి సూపర్ హ్యూమన్‌తో ఉన్న సంబంధం ఏమిటి? డీకేను చంపాలని ప్రయత్నించిన సూపర్ హ్యూమన్ అతడి కూతురు అవంతికను ఎందుకు కాపాడాడు? 1942లో హిట్లర్ నుంచి సూపర్ హ్యూమన్ సీరమ్‌ను దొంగిలించిన చెళియన్ ఏమయ్యాడు? అగ్నికి, అతడిని ఇంటరాగేషన్ చేసిన మిస్టర్ ఎక్స్ అలియాస్ ఆత్మకు ఏదైనా రిలేషన్ ఉంది? సూపర్ హ్యూమన్స్ ఒక్కరు ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? అన్నదే ఈ మూవీ కథ.
ఐడియా బాగుంది కానీ...
వెపన్ సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వెపన్ కథను దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు.కానీ రాతలో ఉన్న కొత్తదనం స్క్రీన్‌పై మాత్రం మిస్సయిన అనుభూతి కలుగుతుంది. టిఫికల్ స్క్రీన్‌ప్లేను ఆడియెన్స్‌కు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు తడబడినట్లు అనిపిస్తుంది.
హిట్టర్ తయారు చేసిన సీరమ్...
హిట్లర్ తయారు చేసిన సూపర్ సీరమ్, దానిని సుభాష్ చంద్రబోస్ సహాయకుడు దొంగిలించాడంటూ గ్రాఫిక్స్‌తో చూపించే ఇంట్రడక్షన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. 1942 నుంచి ఒక్కసారిగా సినిమా ప్రజెంట్ జనరేషన్‌లోకి వస్తుంది. అక్కడి నుంచే దర్శకుడు కథపై పట్టుకోల్పోయాడు.
సినిమాను కథను డైరెక్ట్‌గా కాకుండా మూడు పాత్రల ధృక్కోణంలో ఏం జరిగిందో చెప్పినట్లుగా చూపిస్తూ వాటిని చివరలో లింక్ చేయాలనే ఐడియా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. చెప్పిన తీరే బోరింగ్‌గా ఉంది. అగ్ని సూపర్ హ్యూమన్స్ గురించి వెతకడం, అతడి యూట్యూబ్ స్టోరీస్ ట్రాక్ బోరింగ్‌గా సాగుతుంది. బ్లాక్ సొసైటీ లీడర్ అంటూ విలన్‌ను పరిచయం చేయడం, అతడి ప్రయోగాల తాలూకు ఎపిసోడ్స్‌లో వినూత్నంగా చూపించాలనే దర్శకుడి ప్రయత్నాలు సాగతీతగా ఉన్నాయి.
ట్విస్ట్‌లు బాగున్నాయి...
ప్రీ క్లైమాక్స్ నుంచే ఒక్కో ట్విస్ట్‌ను రివీల్ చేస్తూ వచ్చాడు. అసలు మిత్రన్‌కు, అగ్నికి ఉన్న సంబంధం ఏమిటి? ఏజెంట్ ఎక్స్ ఎవరు అన్నది సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తాయి. ఈ సినిమాకు సెకండ్ పార్ట్ కూడా ఉన్నట్లు క్లైమాక్స్‌లో అనౌన్స్‌చేశాడు డైరెక్టర్. విలన్ పాత్రను హీరో చంపేస్తాడు. కానీ అతడు చంపింది కేవలం క్లోన్‌ను మాత్రమేనని అసలు విలన్ బతికే ఉన్నాడంటూ ఓపెన్ ఎండింగ్ క్లైమాక్స్‌తో సినిమాను ముగించాడు.
గంట తర్వాతే ఎంట్రీ...
ఈ సినిమాకు హీరో సత్యరాజ్. కానీ అతడి సినిమా మొదలైన గంట తర్వాతే ఎంట్రీ ఇస్తుంది. సూపర్ హ్యూమన్ పాత్రలో తన యాక్టింగ్‌తో మెప్పించాడు. అగ్నిగా వసంత్ రవి యాక్షన్, ఎమోషన్స్ కలబోసిన పాత్రలో కనిపించాడు. తాన్య హోప్, రాజీవ్‌మీనన్‌తో పాటు చాలా మంది నటీనటులు వెపన్‌లో కనిపిస్తారు. ప్రతి క్యారెక్టర్ స్టైలిష్‌గా రాసుకున్నాడు డైరెక్టర్. ఆ కొత్తదనం యాక్టింగ్ విషయంలో ఉంటే బాగుండేది.
ప్రయోగం బెడిసికొట్టింది...
సూపర్ హీరో కథతో దర్శకుడు చేసిన ఈ ప్రయోగం పూర్తిగా బెడిసికొట్టింది. యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఓ సారి చూడొచ్చు. కథ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్‌గా ఉంటుంది.