Netflix Documentaries: డబ్బు బాగా సంపాదించాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ డాక్యుమెంటరీలు చూడండి-watch these netflix documentaries on how to make money get smart with money decoding bill gates ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Netflix Documentaries: డబ్బు బాగా సంపాదించాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ డాక్యుమెంటరీలు చూడండి

Netflix Documentaries: డబ్బు బాగా సంపాదించాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ డాక్యుమెంటరీలు చూడండి

Hari Prasad S HT Telugu
Apr 09, 2024 08:24 AM IST

Netflix Documentaries: ఓటీటీల్లో సినిమాలు, వెబ్ సిరీసే కాదు.. బాగా డబ్బు సంపాదించడానికి పనికొచ్చే కొన్ని డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ లో అలాంటివి చాలానే ఉన్నాయి. అవేంటో చూడండి.

డబ్బు బాగా సంపాదించాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ డాక్యుమెంటరీలు చూడండి
డబ్బు బాగా సంపాదించాలనుకుంటే నెట్‌ఫ్లిక్స్‌లోని ఈ డాక్యుమెంటరీలు చూడండి

Netflix Documentaries: నెట్‌ఫ్లిక్స్ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనూ క్రమంగా టాప్ ఓటీటీగా ఎదుగుతోంది. ఈ ఓటీటీలో ఎన్నో స్ఫూర్తి నింపే డాక్యుమెంటరీలు ఉన్నాయి. అవి డబ్బు ఎలా సంపాదించాలో చెప్పడంతోపాటు ఆర్థిక విషయాలు సాధికారికంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నది కూడా చెబుతాయి. వాటిలో బెస్ట్ డాక్యుమెంటరీలు ఏవో ఇక్కడ చూడండి.

గెట్ స్మార్ట్ విత్ మనీ

నెట్‌ఫ్లిక్స్ లోని ఈ గెట్ స్మార్ట్ విత్ మనీ డాక్యుమెంటరీ ఆర్థికపరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. ఎంతో మంది ఆర్థిక నిపుణులు ఈ డాక్యుమెంటరీలో విలువైన సూచనలు ఇచ్చారు. తమ లక్ష్యాలను చేరుకోవడానికి ఖర్చును నియంత్రించి, పొదుపుపై దృష్టి సారించేలా వీళ్ల సలహాలు ఉన్నాయి. జీవితంలో ముందడుగు వేయాలంటే అప్పుల ఊబిలో నుంచి బయటపడాలన్నది చాలా ముఖ్యమైన అంశంగా ఈ డాక్యుమెంటరీ చూస్తే తెలుస్తుంది.

ఇన్‌సైడ్ బిల్స్ బ్రెయిన్: డీకోడింగ్ బిల్ గేట్స్

బిల్ గేట్స్ తెలుసు కదా. ఒకప్పుడు ఎన్నో ఏళ్ల పాటు ప్రపంచ కుబేరుల జాబితాలో తొలిస్థానంలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇచ్చే సలహాలు, సూచనలు జీవితంలో ముందడుగు వేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. 2019లో ఈ మూడు భాగాల డాక్యుమెంటరీ వచ్చింది. ప్రపంచ కుబేరుడిగా ఉన్నా ఓ సాధారణ జీవితం ఎలా గడపాలన్నది బిల్ గేట్స్ ను చూసి నేర్చుకోవచ్చు.

ది మైండ్ ఎక్స్‌ప్లెయిన్డ్

మనిషి మెదడు అనేది చాలా ప్రత్యేకం. ఈ భూమిపై మరే జీవికి లేని శక్తి మనిషికి ఈ మెదడు ద్వారానే వస్తోంది. మరి అలాంటి మనిషి మెదడులోని సంక్లిష్టతలు, అసలు అది ఎలా పని చేస్తుంది? దానిని మరింత సమర్థవంతంగా ఎలా ఉపయోగించాలన్నది ఈ డాక్యుమెంటరీలో చూడొచ్చు.

ట్రస్ట్ నో వన్: ది హంట్ ఫర్ ద క్రిప్టో కింగ్

క్రిప్టో కరెన్సీ ఎంతలా సంచలనం సృష్టించిందో మనకు తెలుసు. అలాంటి క్రిప్టో కరెన్సీల్లో ఒకటైన క్వాడ్రిగాసీఎక్స్ ఎక్స్‌ఛేంజ్ కుప్పకూలిపోవడం, అందులో పెట్టుబడి పెట్టిన కొందరు దాని వ్యవస్థాపకుడైన గెర్రీ కాటన్ అకాల మరణంపై జరిపే ఇన్వెస్టిగేషనే ఈ డాక్యుమెంటరీ. రెండేళ్ల కిందట ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజైంది.

ది ప్లేబుక్

జీవితంలో గొప్ప క్రీడాకారులుగా ఎదగాలనుకునే వాళ్లు ఈ డాక్యుమెంటరీని మిస్ కావద్దు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు, కోచ్‌లు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇందులో ఇచ్చారు. ఫీల్డ్ లోపల, బయట గొప్ప అథ్లెట్లు ఎలా నడుచుకుంటారన్నది దీని ద్వారా తెలుసుకోవచ్చు.

ది సోషల్ డైలమా

సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితాల్లో ఓ విడదీయలేని భాగమైంది. అయితే ఆ సోషల్ మీడియా మన జీవితాలపై చూపించే ప్రతికూల ప్రభావాలను ఈ ది సోషల్ డైలమా డాక్యుమెంటరీలో చూడొచ్చు. ఎంతో మంది ప్రముఖుల ఇంటర్వ్యూల ద్వారా సోషల్ మీడియా ప్రభావాన్ని ఇందులో వివరించే ప్రయత్నం చేశారు.

ది మినిమలిస్ట్స్ లెస్ ఈజ్ నౌ

జీవితంలో ఎంత సంపాదించినా, సాధించినా ఓ సాధారణ జీవితం గడపటం ఎంత ముఖ్యమో ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది. మినిమలిస్ట్స్ గా పేరుగాంచిన ఇద్దరు స్నేహితులు సింపుల్ గా జీవించడంలో ఉండే ప్రయోజనాలను దీని ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.

Whats_app_banner