Vishwak Sen: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది: విశ్వక్‍సేన్.. వారి గురించేనా?-vishwak sen requested tollywood top celebrities to watch and talk about gaami movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vishwak Sen: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది: విశ్వక్‍సేన్.. వారి గురించేనా?

Vishwak Sen: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది: విశ్వక్‍సేన్.. వారి గురించేనా?

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2024 09:06 PM IST

Vishwak Sen on Gaami Movie: టాలీవుడ్‍లో గామి లాంటి సినిమా ఇంతకు ముందెప్పుడూ రాలేదని హీరో విశ్వక్‍సేన్ అన్నారు. తమ సినిమాకు మద్దతుగా నిలువాలని తెలుగు సినిమా పెద్దలకు సూచించారు.

Vishwak Sen: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది: విశ్వక్‍సేన్
Vishwak Sen: పెద్ద మనుషులు మాట్లాడితే బాగుంటుంది: విశ్వక్‍సేన్

Vishwak Sen on Gaami Movie: మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గామి సినిమాపై ప్రశంసలు వస్తున్నాయి. విజువల్ వండర్‌లా ఉందని, డిఫరెంట్ కాన్సెప్ట్ అంటూ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారంటూ దర్శకుడు విద్యాధర్ కగితకు, కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ విశ్వక్‍కు ప్రశంసలు దక్కుతున్నాయి. మార్చి 8న రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లను దక్కించుకుంది. ఇప్పటి వరకు రూ.20కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. అయితే, ప్రయోగాత్మకంగా వచ్చిన గామి సినిమాపై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్న.. టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు పెద్దగా ఈ చిత్రం గురించి మాట్లాడడం లేదు. డిఫరెంట్ మూవీగా వచ్చిన ఈ చిత్రానికి సినీ ప్రముఖుల నుంచి కావాల్సినంత మద్దతు దక్కడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా హీరో విశ్వక్ సేన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

నలుగురు పెద్ద మనుషులు మాట్లాడితే..

గామి ప్రమోషన్లలో భాగంగా తిరుపతిలో మీడియా సమావేశంలో నేడు (మార్చి 13) మాట్లాడారు విశ్వక్‍సేన్. తెలుగు ఇండస్ట్రీలో గామి లాంటి సినిమా ఇంతకు ముందెప్పుడూ రాలేదని తాను గర్వంగా చెబుతున్నానని అన్నారు. ఇది మన తెలుగు సినిమా అని, నలుగురు పెద్ద మనుషులు చూసి మాట్లాడితే బాగుంటుందని విశ్వక్ అన్నారు.

20 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు ఇండస్ట్రీ గర్వపడే చిత్రంగా గామి నిలిచిపోతుందని విశ్వక్ అన్నారు. “తెలుగు ఇండస్ట్రీలో కొత్త సినిమా రావాలని మేం ఆరేళ్లు కష్టపడి చేసిన ప్రయత్నం ఇది. మా సినిమాకు కూడా నలుగురు పెద్ద మనుషులు వచ్చి.. చూసి మాట్లాడితే బాగుంటుంది. ఇది మన తెలుగు సినిమా. కచ్చితంగా తెలుగులో ఇలాంటి సినిమా ఇంతకు ముందైతే రాలేదని నేను గర్వంగా చెబుతాను. 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా తెలుగులో ఇలాంటి సినిమా ఉందని గర్వపడే సినిమా ఇది. ఇవి ఓవర్ కాన్పిడెన్స్‌తో చెబుతున్న మాటలు కావు. నేను సినిమా రిలీజైన నాలుగు రోజుల తర్వాత మాట్లాడుతున్నా” అని విశ్వక్ అన్నారు.

వారి గురించేనా..?

గామి సినిమా గురించి టాలీవుడ్ టాప్ సెలెబ్రెటీలు చాలా మంది స్పందించలేదు. మలయాళం నుంచి తెలుగులోకి వచ్చిన ప్రేమలు చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపిస్తూ మంగళవారం (మార్చి 13) ట్వీట్ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి.. ప్రేమలు సక్సెస్ మీట్‍కు హాజరై ఆ చిత్రాన్ని ఆకాశానికెత్తేశారు. తన కుమారుడు కార్తికేయ.. ప్రేమలు చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయడంతో రాజమౌళి ఆ ఈవెంట్‍కు వెళ్లారు. రిలీజ్‍కు ముందు గామిపై పోస్ట్ చేసిన రాజమౌళి.. విడుదల తర్వాత స్పందించలేదు. అలాగే, టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరూ ఈ చిత్రానికి మద్దతుగా పెద్దగా స్పందించలేదు. దీంతో ఇది మన తెలుగు సినిమా అని.. నలుగురు పెద్దలు చూసి మాట్లాడాలంటూ విశ్వక్‍సేన్ కోరినట్టు అర్థమవుతోంది.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఆ నెలలోనే..

ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించాలనేదే తన లక్ష్యమని విశ్వక్‍సేన్ చెప్పారు. కమర్షియల్‍గా ఉంటూనే కంటెంట్ ఉన్న చిత్రాలను చేస్తానని తెలిపారు. ఓ ఫార్మాట్‍లో ఉండే సినిమాలను తాను చేయనని, కొత్తగా ఉంటేనే చేస్తానని స్పష్టం చేశారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రంలోనూ కొత్త పాయింట్ ఉంటుందని, ఈ చిత్రం మే నెలలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

IPL_Entry_Point