Vijayendra Prasad on Oscars: మోదీ, స్పీల్‌బర్గ్ ఒక్కటే చెప్పారు.. మన దేశ గొప్పతనాన్ని చాటమని..: విజయేంద్ర ప్రసాద్
Vijayendra Prasad on Oscars: మోదీ, స్పీల్‌బర్గ్ ఒక్కటే చెప్పారు.. మన దేశ గొప్పతనాన్ని చాటమని అంటూ నాటు నాటు పాట ఆస్కార్ గెలిచిన తర్వాత అన్నారు ఆర్ఆర్ఆర్ మూవీకి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్. ఆయన రాజ్యసభ సభ్యుడు కూడా అయిన విషయం తెలిసిందే.
Vijayendra Prasad on Oscars: ఆర్ఆర్ఆర్ మూవీని ప్రపంచస్థాయికి తీసుకెళ్లి ఏకంగా ఆస్కార్ గెలిచేలా చేసిన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అతని సినిమాలను కథలు తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పుడు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నారు. ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ ఆస్కార్స్ గెలిచిన తర్వాత న్యూస్18తో మాట్లాడిన ఆయన.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ మూవీకి కథ అందించింది విజయేంద్ర ప్రసాదే. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ, హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్‌బర్గ్ ఒకే రకమైన సలహా ఇచ్చినట్లు చెప్పారు. కొన్ని రోజుల కిందట తాను మోదీతో మాట్లాడుతున్న సమయంలో.. భారతదేశ సంస్కృతి చాలా గొప్పదని, దానిని ప్రపంచానికి చాటేలా కృషి చేయాలని సూచించినట్లు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.
ఏదో రెండు, మూడు నిమిషాల పాటు మాట్లాడాల్సి ఉన్నా.. దేశం గురించి మాట్లాడుతూ తెలియకుండానే 40 నిమిషాలు గడిచిపోయినట్లు కూడా చెప్పారు. మన దేశాన్ని ప్రపంచం ఎలా చూడాలో ఆయన చెప్పడం చూసి తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. మోదీ విజన్ తనను చాలా ఆశ్చర్యానికి గురి చేసినట్లు వెల్లడించారు.
ఇక ఆస్కార్స్ కోసం అమెరికా వెళ్లిన రాజమౌళిని స్పీల్‌బర్గ్ కలిసిన సమయంలో అతడు కూడా ఇలాంటి సలహానే ఇచ్చినట్లు గుర్తు చేశారు. భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవని.. వాటిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేలా సినిమాలు తీయాలని రాజమౌళికి సూచించినట్లు చెప్పారు. ఎవరో గుర్తించాలన్న ఉద్దేశంతో పశ్చిమ దేశాల సాంప్రదాయాలతో భారత సంస్కృతిని ముడిపెట్టొద్దని కూడా చెప్పినట్లు విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
ఇక ఆర్ఆర్ఆర్ మూవీ కోసం తమ కుటుంబంలోని మూడు తరాలు పని చేసిన విషయాన్ని కూడా ఇదే ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. తాను కథ అందించగా.. రాజమౌళి డైరెక్ట్ చేశాడని, రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా, వాళ్ల తనయుడు కార్తికేయ మార్కెటింగ్ లో, కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ గా, అతని తనయుడు కాలభైరవ సింగర్ గా చేసిన విషయాన్ని తెలిపారు.
సంబంధిత కథనం