Tollywood Villain: 300 సినిమాల్లో విలన్.. చివరికి చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా చితికి..
Tollywood Villain: టాలీవుడ్ తోపాటు బాలీవుడ్ లోనూ విలన్ గా నటించిన మహేష్ ఆనంద్ చివరి దశలో చాలా దారుణమైన జీవితం గడిపాడు. తన వాళ్లు ఎవరూ లేక చేతిలో ఓ మందు బాటిల్ తో అతడు తుదిశ్వాస విడిచాడు.
Tollywood Villain: సినిమా అనేది ఓ అందమైన ప్రపంచం. అందులో ఉన్న వాళ్ల జీవితాలు బయటి నుంచి అందరికీ అందంగానే కనిపిస్తాయి. కానీ ఆ ఇండస్ట్రీలో ఉండి, ఒకప్పుడు స్టార్‌డమ్ అనుభవించిన వాళ్లు కూడా దారుణమైన పరిస్థితులు చవిచూడటం మనం చూశాం.
ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా అలాంటి వాడే. బాలీవుడ్, టాలీవుడ్ లలో ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించి.. చివరికి చుట్టూ ఎవరూ లేని పరిస్థితుల్లో తనువు చాలించాడు.
విలన్ మహేష్ ఆనంద్ విషాదాంతం
బాలీవుడ్, టాలీవుడ్ లలో 1990ల్లో 300కుపైగా సినిమాల్లో విలన్ గా నటించాడు మహేష్ ఆనంద్. హిందీ, తెలుగుతోపాటు మలయాళం సినిమాల్లోనూ తనదైన ముద్ర వేశాడు. కానీ అంతటి నటుడు కూడా చివరికి ఎంతో పేదరికంలో, తనకు ఎవరూ సపర్యలు కూడా చేసే పరిస్థితులు లేక ఒంటరిగా కన్నుమూశాడు. ఆల్కహాల్ కు బానిసైన అతడు చివరికి ఓ మందు బాటిల్ పక్కన ఉన్నప్పుడే తుది శ్వాస విడిచాడు.
మహేష్ ఆనంద్ 2019, ఫిబ్రవరిలో కన్నుమూశాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషి డోరు ఎంతసేపు కొట్టినా ఎవరూ తీయలేదు. చుట్టుపక్కల వాళ్లు వచ్చి డోరు తీసి చూడగా అప్పటికే అతడు చనిపోయాడు. ఆ సమయంలో అతని పక్కనే ఓ మందు బాటిల్, ముందు తినకుండా అలాగే ఉంచిన ఆహారం కనిపించాయి.
మహేష్ ఆనంద్‌కు ఎందుకీ దుస్థితి?
తాను చనిపోవడానికి రెండేళ్ల ముందు సోషల్ మీడియా ద్వారా మహేష్ ఆనంద్ తనకు ఎందుకీ పరిస్థితి వచ్చిందో ఓ పోస్టులో వివరించాడు. "నా స్నేహితులు, సన్నిహితులందరూ నన్ను ఆల్కహాలిక్ అనేవారు. నాకు కుటుంబం లేదు. నా సవతి సోదరుడు నన్ను రూ.6 కోట్లకు మోసం చేశాడు. నేను 300కుపైగా సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు కనీసం నీళ్లు కొనడానికి డబ్బులు లేవు. ఈ ప్రపంచంలో నాకు ఒక్క స్నేహితుడు కూడా లేడు" అని అతడు అన్నాడు.
ఇక మరో పోస్టులో అతడు తన కొడుకు గురించి రాయడం విశేషం. "నా తనయుడు త్రిశూల్.. నేను చనిపోయే ముందు ఒక్కసారి హగ్ చేసుకో. నా జీవితమంతా ప్రేమిస్తూనే ఉంటాను. నేనే నీ నిజమైన తండ్రిని. నాకు తెలుసు వాళ్లు నీ పేరును ఆంథోనీ వోహ్రాగా మార్చారు" అని మహేష్ ఆనంద్ ఆ పోస్టులో అన్నాడు.
మహేష్ ఆనంద్ తెలుగు సినిమాలు
మహేష్ ఆనంద్ ప్రధానంగా హిందీ సినిమాల్లోనే నటించాడు. 1982లో వచ్చిన సనమ్ తేరీ కసమ్ మూవీతో తెరంగేట్రం చేశాడు. తర్వాత బాలీవుడ్ లో టాప్ విలన్లలో ఒకడిగా ఎదిగాడు. తెలుగులోనూ 16 సినిమాల్లో నటించాడు. 1989లో చిరంజీవి లంకేశ్వరుడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. చివరిగా 2005లో పవన్ కల్యాణ్ నటించిన బాలు సినిమాలో కనిపించాడు.
1994 నుంచి 1996 మధ్య మూడేళ్ల పాటు అతడు టాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటించాడు. నంబర్ వన్, బొబ్బిలి సింహం, అల్లుడా మజాకా, సాంప్రదాయంలాంటి హిట్ సినిమాల్లో విలన్ గా కనిపించడం విశేషం.