ETV Win OTT Movies Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళ్, తెలుగు ఇలా అనేక భాషలకు సంబంధించిన సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తుంటారు. అయితే, కేవలం తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు మాత్రం చాలా అరుదు.
ప్రస్తుతం తెలుగు భాషలో సినిమాలు, వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు రెండే ఉన్నాయి. వాటిలో ఆహా ఓటీటీ (Aha OTT) ఒకటి అయితే, మరొకటి ఈటీవీ విన్ (ETV Win OTT). ఈ రెండు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ సినిమాలు, వెబ్ సిరీసులను తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో అతి ఎక్కువగా తెలుగు కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతూ దూసుకుపోతోంది ఈటీవీ విన్.
అలాంటి ఈటీవీ విన్ ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే (మే 9) రెండు సినిమాలు తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటిలో ఒకటి తెలుగు స్ట్రైట్ ఫిల్మ్ అయితే.. మరొకటి తమిళ డబ్బ్‌డ్ సినిమా. ఈటీవీ విన్‌లో గురువారం నుంచి చిత్రం చూడరా (Chitram Choodara OTT), పార్థు (Parthu OTT) అనే రెండు సినిమాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
హీరో వరుణ్ సందేశ్, జబర్దస్త్ కమెడియన్ ధన్‌రాజ్, నటుడు కాశీ విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా చిత్రం చూడరా. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఆర్ఎన్ హర్షవర్ధన్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఇందులో వరుణ్ సందేశ్‌కు జోడీగా శీతల్ భట్ హీరోయిన్‌గా చేసింది. వీరితోపాటు రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీ రాజా, మీనా కుమారి, అన్నపూర్ణ, రచ్చ రవి పలువురు ఇతర కీలక పాత్రలు పోషించారు.
చిత్రం చూడరా కథ విషయానికొస్తే.. సినిమాల్లోకి వెళ్లాలనే ఆశతో పల్లెటూరి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు తమకు ఎలాంటి సంబంధం లేని దొంగతనం కేసులో ఇరుక్కోవడం, ఆ తర్వాత వారి జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనే అంశాలతో సినిమా సాగుతుంది. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకుండా నేరుగా ఓటీటీలోకి రావడం విశేషం.
ఇక తెలుగులో పార్థు టైటిల్‌తో ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన తమిళ డబ్బింగ్ సినిమా ఓమై సెన్నై (Oomai Sennaai Movie). సైకో థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమా 2021లో థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. తమిళ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ అసిస్టెంట్ అర్జున్ ఏకలవ్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
తంగదురై, సనమ్ శెట్టి, సాయి రాజ్ కుమార్, గజరాజ్, జయ కుమార్, అరుల్ డి శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన పార్థు సినిమా నేటి నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో డీ గ్లామర్ లుక్‌లో తమిళ బిగ్ బాస్ సీజన్ 4 (Bigg Boss Tamil) కంటెస్టెంట్ సనమ్ శెట్టి (Sanam Shetty) అలరించింది. బిగ్ బాస్ హౌజ్‌లో 63 రోజులు ఉన్న సనమ్ శెట్టి హాట్ లుక్స్, లవ్ ఎఫైర్స్‌తో బాగా పాపులర్ అయింది.