The Deal Review: ది డీల్ మూవీ రివ్యూ.. ట్విస్టులతో సాగే తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మెప్పించిందా?
The Deal Movie Review In Telugu: ప్రభాస్ నటించిన ఈశ్వర్ మూవీతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయిన నటుడు హను కోట్ల హీరోగా, దర్శకుడిగా చేసిన సినిమా ది డీల్. ఇవాళ అంటే అక్టోబర్ 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ది డీల్ మూవీ రివ్యూలో తెలుసుకుందాం.
The Deal Review In Telugu: ప్రభాస్ యాక్ట్ చేసిన ఈశ్వర్ చిత్రంతో తెలుగు వెండితెరకు ఇంట్రడ్యూస్ అయిన నటుడు హను కోట్ల. తాజాగా హను కోట్ల హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ది డీల్. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు.
కథ:
భైరవ (హను కోట్ల) యాక్సిడెంట్‌కి గురి కావడంతో కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత కోమా నుంచి బయటపడిన భైరవ గతం మర్చిపోతాడు. కానీ, కోమా నుంచి వచ్చిన భైరవ తన భార్య లక్ష్మీ (ధరణి ప్రియ)ను చూడాలని, కలవాలని అంటాడు. తానెవరో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరోవైపు ఎవరు లేని ఒంటరి అమ్మాయి ఇందు (సాయి చందన)ను చంపేందుకు ఒకరు ట్రై చేస్తుంటారు.
ఇందు తల్లి చాలా రోజుల క్రితమే చనిపోతుంది. బ్యాంక్‌లో పని చేస్తుంటుంది. ఈ క్రమంలోనే ఇందును కాపాడిన భైరవ ఆమెకు దగ్గరవుతాడు. ఇందు కోసం ఆసుపత్రికి మాదవ్ (రవి ప్రకాష్), లక్ష్మీ వస్తారు. అక్కడ లక్ష్మీని చూసిన భైరవ తన భార్య అంటూ గొడవ చేస్తాడు. తమ ప్లాన్స్‌కు అడ్డుగా ఉన్న భైరవను కూడా చంపాలని అనుకుంటారు మాధవ్, లక్ష్మీ.
లక్ష్మీ మాధవ్‌ను భైరవగా ఎందుకు చెబుతుంది మాధవ్‌తో ఎందుకు కలిసి ఉంటుంది? ఇందును ఎందుకు చంపాలనుకుంటారు? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు (రఘు కుంచె) ఇందుకు ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు? అతనికి ఇందుకు ఉన్న సంబంధం ఏంటీ తర్వాత ఏం జరిగింది అనే ఆసక్తికర సన్నివేశాల సముహారమే ది డీల్ మూవీ.
విశ్లేషణ:
కంటెంట్ ఉన్న సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ కథని అల్లుతూ సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలకు చాలా వరకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లో రీచ్ తక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న మేకర్స్ చేసే ఇలాంటి ప్రయోగాలు అభినందనీయంగా ఉండటం విశేషం. స్క్రీన్‌ప్లేలో చేసే మ్యాజిక్‌లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ది డీల్ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే.
ది డీల్ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో బాగుంటుంది. ఆద్యంతం ట్విస్ట్‌లతో సినిమాని నడిపించడం ఎంగేజింగ్‌గా సాగుతుంది. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్ సుఫారీ తీసుకుని చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్, అనంతరం ట్విస్ట్‌లతో అలా సాగిపోతుంది.
సస్పెన్స్‌తో
ఫస్టాఫ్ అంతా హీరో యాక్సిడెంట్, తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మీ మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్‌తో ఆకట్టుకుంటాయి.
ఇంటర్వెల్‌లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది. సెకండాఫ్ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. ఇందుని చంపాలనుకుంటున్నది ఎవరు? ఇంతకి అసలు ఇందు ఎవరు? అనే ట్విస్ట్ సినిమాకి హైలైట్ పాయింట్స్.
అయితే సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్‌ల పరంగా బాగా రాసుకున్నారు దర్శకుడు. కానీ, మూవీ నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి. స్లో నెరేషన్ వల్ల కాస్తా బోరింగ్ ఫీలింగ్ ఉంటుంది. అక్కడక్కడ ట్విస్టులు రివీల్ కావడంతో వేగం కనిపిస్తుంది. ఇక మదర్ సెంటిమెంట్ బాగుంటుంది.
ఉపయోగపడిన అనుభవం
ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. అయితే, కథ రొటీన్‌గా ఉన్న ఫ్యామిలీ మెచ్చే సీన్స్ పడ్డాయి. ఇందుని చంపే సీన్లు కూడా రెగ్యులర్ ఫార్మాట్‌లో ఉన్నాయి. బీజీఎం పర్వాలేదు. భైరవ పాత్రలో హను కోట్ల బాగానే పర్ఫామ్ చేశాడు. సెటిల్డ్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈటీవీలో మాయాబజార్ సీరియల్‌లో చేసిన 150 ఎపిసోడ్స్ అనుభవం ఉపయోగపడినట్లు తెలుస్తోంది.
పాజిటివ్, నెగెటివ్ వేరియేషన్స్ బాగా చూపించాడు. ఇందు పాత్రలో సాయి చందన ఇన్నోసెంట్‌గా ఆకట్టుకుంది. రఘు కుంచె హుందాగా చేశారు. తనదైన యాక్టింగ్‌తో అలరించారు. నెగెటివ్ షేడ్స్‌లో రవి ప్రకాష్ ఆకట్టుకున్నాడు. లక్ష్మీగా ధరణి ప్రియ అలరిస్తుంది. మిగతా పాత్రలు కూడా నటనతో అలరించారు. ఆర్ఆర్ ధృవన్ సంగీతం పర్వాలేదు. కెమెరా వర్క్ బాగానే ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే ట్విస్టులతో సాగే రెగ్యులర్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్.