OTT Suspense Thriller: ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ట్రెండింగ్‍లోకి వచ్చేసిన చిత్రం
Savi - OTT Streaming: సావి సినిమా థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. అయితే, ఓటీటీలో మాత్రం ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. అప్పుడే ట్రెండింగ్‍లోకి ఈ మూవీ వచ్చేసింది.
కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా ఒక్కోసారి థియేటర్లలో పెద్దగా కలెక్షన్లు దక్కించుకోలేకపోతాయి. కమర్షియల్‍గా హిట్ కొట్టలేకపోతాయి. బాలీవుడ్ మూవీ ‘సావి’ కూడా ఇదే కోవలోకి వస్తుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ అనిల్ కపూర్, దివ్య కోషల, తెలుగు నటుడు హర్షవర్దన్ రానే ప్రధాన పాత్రలు చేసిన ఈ మూవీ మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రానికి ఎక్కువగా పాజిటివ్ స్పందనే వచ్చింది. అయినా కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో దక్కలేదు. అయితే, ఇప్పుడు సావి చిత్రం ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది.
నెటిజన్ల పాజిటివ్ రెస్పాన్స్
సాని సినిమా తాజాగా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. హిందీలో స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. గ్రిప్పింగ్‍గా, థ్రిల్లింగ్‍గా ఈ చిత్రం ఉందని అభిప్రాయపడుతున్నారు. అనవసరమైన సాగదీత లేకుండా పక్కా థ్రిల్లర్‌లా ఉందని కామెంట్లు చేస్తున్నారు. సస్పెన్స్, ఎమోషన్ కూడా పండిందని అంటున్నారు.
ట్రెండింగ్‍లో..
సావి చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‍లోకి దూసుకొచ్చేసింది. ఇండియా ట్రెండింగ్‍లో ఈ మూవీ ప్రస్తుతం రెండో స్థానంలో ట్రెండ్ అవుతోంది. జాన్వీ కపూర్ మూవీ మిస్టర్ అండ్ మిసెస్ మహీ ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్‍లో ఉంది. ఇదే జోరు కొనసాగిస్తే సావి ఫస్ట్ ప్లేస్‍కు వెళ్లే అవకాశం ఉంది.
సావి సినిమా గురించి..
సావి చిత్రానికి అభినయ్ దేవ్ దర్శకత్వం వహించారు. అనీథింగ్ ఫర్ హర్ అనే ఫ్రెంచ్ మూవీ స్ఫూర్తితో 2010లో వచ్చిన అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది నెక్స్ట్ త్రీడేస్’ ఆధారంగా సావి మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రం లండన్ బ్యాక్‍డ్రాప్‍లో సాగుతుంది.
సావి చిత్రంలో అనిల్ కపూర్, దివ్య కోషల, హర్షవర్దన్ రానేతో పాటు రాగేశ్వరి లూంబా, మైరాజ్ కక్కర్, హిమాన్షి చౌదరి, లూక్ వూగ్లర్, ఎంకే రైనా, రవి ముల్తానీ కీలకపాత్రలు పోషించారు. విశేష్ ఫిల్మ్స్, టీ సిరీస్ ఫిల్మ్స్ బ్యానర్లపై ముకేశ్ భట్, భూషణ్ కుమార్, కృషన్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విశాల్ మిశ్రాతో పాటు మరో నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
సావి చిత్రం సుమారు రూ.20కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ మూవీకి దాదాపు రూ.17కోట్ల కలెక్షన్లే వచ్చాయి. కమర్షియల్‍గా ఈ చిత్రం సక్సెస్ కాలేదు.
సావి స్టోరీలైన్
సావి (దివ్య కోషల), ఆమ భర్త నకుల్ సచ్‍దేవ (హర్షవర్దన్ రానే), వారి కుమారుడు బ్రిటన్‍లోని లివర్‌పూల్‍లో సంతోషంగా జీవనం సాగిస్తుంటారు. అయితే, ఓ తప్పుడు మర్డర్ కేసులో నకుల్ అరెస్ట్ అవుతాడు. ఈ కేసులో అతడు దోషిగా నిర్దారణ అయి, ఏకంగా 12 ఏళ్ల జైలుశిక్ష పడుతుంది. దీంతో వారి జీవితాలు పూర్తిగా తిలకిందులు అవుతాయి. కానీ నకుల్‍ను బయటికి తీసుకొచ్చేందుకు సావి ప్రయత్నిస్తుంది. నకుల్‍ను జైలులోనే చంపేందుకు ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుందని సావికి తెలుస్తుంది. దీంతో భర్తను కాపాడేందుకు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆ తర్వాత ఏమైంది? తన భర్తను సావి కాపాడుకుందా? అసలు ఆ మర్డర్ మిస్టరీ ఏంటి? అనేదే సావి మూవీ స్టోరీగా ఉంది.
టాపిక్