Kanguva Runtime: సూర్య ‘కంగువ’ సినిమా ఫైనల్ రన్‍టైమ్ ఫిక్స్.. తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లంటే!
Kanguva Runtime: కంగువ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. దీంతో ఈ మూవీ రన్‍టైమ్ ఎంత ఉండనుందో సమాచారం బయటికి వచ్చేసింది. అలాగే, ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు ఎన్ని కోట్లకు అమ్ముడయ్యాయో కూడా వెల్లడైంది.
కంగువ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రంపై హైప్ విపరీతంగా ఉంది. ఈ చిత్రం నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. తమిళంలో రూపొందిన ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్ సహా మొత్తంగా 10 భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. కంగువ మూవీకి శివ దర్శకత్వం వహించారు. కాగా, ఈ సినిమా రన్‍టైమ్ వివరాలు తాజాగా బయటికి వచ్చాయి.
రన్‍టైమ్ ఇదే
కంగువ సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకుందని సమాచారం బయటికి వచ్చింది. ఈ మూవీకి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. కంగువ సినిమా రన్‍టైమ్ 2 గంటల 34 నిమిషాల 38 సెకన్లు (154 నిమిషాల 38 సెకన్లు)గా ఉండనుంది.
కంగువ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఎలాంటి కట్స్ చెప్పలేదు. అయితే, రక్తపాతం ఎక్కువగా ఉన్న కొన్ని హింసాత్మక సన్నివేశాల విజువల్స్‌లో కాస్త మార్పులు సూచించింది. ఇక, ఈ ఫ్యాంటసీ యాక్షన్ మూవీకి 154 నిమిషాల రన్‍టైమ్ సరిగ్గా సూటవుతుంది. మూవీ గ్రిప్పింగ్‍గా ఉండే అవకాశం ఉంది.
కంగువ తెలుగు హక్కులు ఇలా..
కంగువ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు సుమారు రూ.25కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం బయటికి వచ్చింది. సాధారణంగా సూర్య సినిమాల మార్కెట్ వాల్యూ తెలుగు రాష్ట్రాల్లో రూ.10 కోట్ల నుంచి రూ.15కోట్ల వరకు ఉండేది. అయితే, కంగువ చిత్రం భారీ బడ్జెట్‍తో రూపొందడం, ఈ చిత్రానికి ఫుల్ క్రేజ్ ఉండటంతో ఏకంగా రూ.25కోట్లకు తెలుగు థియేట్రికల్ హక్కులకు దక్కినట్టు తెలుస్తోంది.
కంగువ నిర్మాణంలో భాగమైన యూవీ క్రియేషన్స్ ఈ మూవీని ఆంధ్రప్రదేశ్‍లో డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ చిత్రం నైజాం (తెలంగాణ) థియేట్రికల్ హక్కులను మైత్రీ మూవీ మేకర్స్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాజిటివ్ టాక్ వస్తే తెలుగులో ఈ మూవీ మంచి కలెక్షన్లు దక్కించుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
జోరుగా ప్రమోషన్లు
కంగువ సినిమా కోసం మూవీ టీమ్ పాన్ ఇండియా రేంజ్‍లో జోరుగా ప్రమోషన్లు చేస్తోంది. వరుసగా ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో హీరో సూర్య పాల్గొంటున్నారు. తెలుగులోనూ ప్రచారం గట్టిగానే చేస్తున్నారు. హైదరాబాద్‍లో ప్రీ-రిలీజ్ మీట్‍లో సూర్య పాల్గొన్నారు. వైజాగ్‍లో భారీస్థాయిలో ఈవెంట్ జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలను ఒక్కొక్కరినీ ఈవెంట్‍లో ప్రశంసించారు సూర్య. వారిలో తనకు నచ్చిన విషయాలను చెప్పారు. ఈ ఈవెంట్‍కు ప్రేక్షకులు భారీగానే హాజరయ్యారు.
కంగువపై మూవీ టీమ్ గట్టి నమ్మకంతో ఉంది. ఈ చిత్రం రూ.2,000 కోట్లు సాధిస్తుందని అంచనా ఉందని నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా ఇటీవల చెప్పారు. స్టూడియో గ్రీన్ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు. యూవీ క్రియేషన్స్ కూడా సహ నిర్మాతగా ఉంది. ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍తో నిర్మించినట్టు అంచనా. కంగువ మూవీలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, రెడిన్ కింగ్‍స్లే, యోగిబాబు, వత్సన్ చక్రవర్తి కీలకపాత్రలు చేశారు. ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.