Suriya on Tollywood Heroes: టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరి గురించి మాట్లాడిన సూర్య.. ఏం చెప్పారంటే..
Suriya on Tollywood Heros: కంగువ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వైజాగ్‍లో గ్రాండ్‍గా జరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు ఒక్కొక్కరి గురించి తమిళ స్టార్ సూర్య ఈ ఈవెంట్‍లో మాట్లాడారు. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన కంగువ చిత్రం నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి శివ దర్శకత్వం వహించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, హిందీ సహా మరో మూడు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగుపై కూడా సూర్య చాలా ఫోకస్ పెట్టారు. తెలుగు వెర్షన్ కోసం ప్రమోషన్లను ఎక్కువగానే చేస్తున్నారు. ఈ క్రమంలో వైజాగ్‍లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఆదివారం భారీస్థాయిలో జరిగింది.
కంగువ తెలుగు ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కు జనాలు భారీగా హాజరయ్యారు. తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఈవెంట్‍కు వచ్చారు. ఈ ఈవెంట్‍లో టాలీవుడ్ స్టార్ హీరోల గురించి సూర్య మాట్లాడారు. ఒక్కరిపై తన అభిప్రాయాలను చెప్పారు.
ప్రభాస్ డైలాగ్‍తో..
తెలుగులో పెద్ద హీరోలు ఉన్నారని, కొందరి పేర్లు చెబితే వారిలో ఏం నచ్చిందో చెప్పాలని సూర్యను డైరెక్టర్ శివ అడిగారు. ముందుగా ప్రభాస్ పేరు చెప్పారు శివ. “ప్రభాస్.. డార్లింగ్, స్వీట్ హార్ట్” అని సూర్య అన్నారు. మిర్చి చిత్రంలోని కటౌట్ చూసి కొన్నికొన్ని నమ్మేయాలి డ్యూడ్ డైలాగ్ చెప్పారు. ఏదైనా చేయగలరని ప్రజలను ప్రభాస్ నమ్మించగలని సూర్య అన్నారు. కల్కి అద్భుతంగా ఉందని, కల్కి 2 కోసం వేచిచూస్తున్నానని అన్నారు.
పవన్ కల్యాణ్ గురించి..
పవన్ కల్యాణ్ గురించి చెప్పాలని శివ అడిగారు. సినిమాల్లోనూ.. నిజజీవితంలోనూ పవన్ సేమ్ అని సూర్య చెప్పారు. ఓపెన్ హార్టెడ్ అని చెప్పారు. పవన్ కల్యాణ్ ఫేమస్ గెస్చర్ చేశారు.
మహేశ్ నాకు జూనియర్
మహేశ్ బాబు, తాను కలిసి స్కూల్‍కు వెళ్లామని సూర్య చెప్పారు. స్కూల్‍లో మహేశ్ తనకు కాస్త జూనియర్ అని తెలిపారు. ఏ సినిమా చేసినా డిఫరెంట్ లీగ్‍లో మహేశ్ ఉంటారని చెప్పారు. ఎక్స్‌ప్రెషన్లు అద్భుతంగా ఇస్తారని తెలిపారు. మహేశ్ బాబు యాక్టింగ్ యాటిట్యూడ్ తనకు చాలా నచ్చుతుందని అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పడే కష్టం, డ్యాన్స్‌కు తాను పెద్ద ఫ్యాన్ అని సూర్య చెప్పారు. పుష్ప 2 కోసం వేచిచూస్తున్నానని అన్నారు. తెలుగులో గజినీ చిత్రాన్ని అల్లు అరవింద్ రిలీజ్ చేసినందుకు ఇప్పుడు ఇలా ఉన్నానని సూర్య చెప్పారు.
రామ్‍చరణ్ చేసిన 15 సినిమాల్లోనే గ్లోబల్ స్టార్ అయ్యారని, తనకు సోదరుడి లాంటి వారని సూర్య చెప్పారు.
ఎన్టీఆర్‌ను చూసి ఆశ్చర్యపోతా
జూనియర్ ఎన్టీఆర్‌లా స్వచ్ఛంగా తెలుగులో ఎవరూ మాట్లాడలేరని సూర్య అన్నారు. తారక్ ఎనర్జీతో ఆశ్చర్యపోతానని చెప్పారు. ఇతర ఇండస్ట్రీ జనాలు కూడా ఎన్టీఆర్‌కు అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోస్తుంటారని అన్నారు.
చిరంజీవి స్ఫూర్తితో..
తాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు గెలిచినప్పుడు చిరంజీవి తనకు కాల్ చేసి విష్ చేశారని సూర్య వెల్లడించారు. “నాకు ఎక్స్‌లో చాలా మంది విష్ చేశారు. అయితే చిరంజీవి స్వయంగా కాల్ చేసి అభినందనలు తెలిపారు. చిరంజీవితో వారి ఇంట్లో భోజనం చేశాం. ఆయన మాకు వడ్డించారు” అని సూర్య చెప్పారు. తనకు చెన్నైలో ఓ ఎన్‍జీవో ఉందని, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్ఫూర్తితోనే తాను అది మొదలుపెట్టానని సూర్య అన్నారు.