Kanguva First Review: సూర్య భారీ బడ్జెట్ మూవీ ‘కంగువ’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది
Kanguva First Review: కంగువ సినిమాపై ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చింది. ఈ మూవీకి డైలాగ్ రైటర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తాను కంగువ చిత్రాన్ని చూశానంటూ ఎలా ఉందో రివ్యూ రాసుకొచ్చారు. ఆయన ఏం చెప్పారంటే..
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఫ్యాంటసీ యాక్షన్ మూవీ ‘కంగువ’పై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. శివ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ మూవీ నవంబర్ 14వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా సాగుతున్నాయి. హీరో సూర్య వరుసగా ప్రమోషన్ ఈవెంట్లు, ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. కాగా, కంగువ సినిమా గురించి ఫస్ట్ రివ్యూ అప్పుడే వచ్చేసింది.
విజువల్స్, సూర్య పర్ఫామెన్స్ అద్భుతం
కంగువకు డైలాగ్స్ అందించిన లిరిసిస్ట్ మదన్ కర్కి ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ మూవీ ఫుల్ వెర్షన్ తాను చూశానంటూ తన రివ్యూ రాశారు. ఈ చిత్రంలో భారీ విజువల్స్, లోతైన స్టోరీ, సూర్య పర్ఫార్మెన్స్ సహా మరిన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయంటూ ట్వీట్ చేశారు.
కంగువ చిత్రం ఒకానొక అద్భుతమైన చిత్రం అంటూ రాసుకొచ్చారు. “కంగువ ఫుల్ వెర్షన్‍ను ఈ రోజే చూశా. డబ్బింగ్ జరుగుతున్న సమయంలో ప్రతీ సీన్‍ను నేను వందసార్లకు పైగా చూశా. అయితే ప్రతీసారి ఈ సినిమా ప్రభావం పెరుగుతూనే ఉంది. భారీ విజువల్స్, ఆర్ట్ డిటైలింగ్, లోతైన కథ, గొప్ప మ్యూజిక్ సహా సూర్య పవర్‌హౌస్ పర్ఫామెన్స్ కలిపి ఒకానొక అద్భుతంగా రూపొందింది. అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ రూపొందించిన దర్శకుడు శివకు, కలను నిజం చేసిన స్టూడియో గ్రీన్‍కు ధన్యవాదాలు” అని మదన్ కర్కి పోస్ట్ చేశారు.
కంగువ భారీ స్థాయిలో రిలీజ్
కంగువ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ఇంగ్లిష్, ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో నవంబర్ 14న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,500 థియేటర్లలో ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. భారీ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ ఉండనుంది. హీరో సూర్య సహా మూవీ టీమ్ ప్రమోషన్లను జోరుగా చేస్తోంది. దేశవ్యాప్తంగా ప్రమోషన్ ఈవెంట్లను నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
కంగువ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటించారు. ఈ చిత్రంలో సూర్య డ్యుయల్ రోల్ చేశారు. బాబీ డియోల్, జగపతి బాబు, యోగిబాబు, నటరాజన్ సుబ్రమణియం ఈ మూవీలో కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో సూర్య డబ్బింగ్ కోసం మేకర్స్ ఏఐ టెక్నాలజీ వాడారు. తమిళం తప్ప వేరే భాషల్లో డబ్బింగ్ ఆర్టిస్టులతో కాకుండా సూర్య వాయిస్ కోసం ఏఐని వినియోగించారు.
కంగువ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీకృష్ణ, ప్రమోద్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‍తో రూపొందించినట్టు అంచనా. కంగువ మూవీ రూ.2000కోట్ల కలెక్షన్లు దక్కించుకుంటుందని నిర్మాత జ్ఞానవేల్ రాజా ఇటీవల ఓ ఈవెంట్‍లో అన్నారు. ఈ చిత్రంపై తమకు ఆస్థాయిలో నమ్మకం ఉందని చెప్పారు. ఈ సినిమాకు దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 2డీతో పాటు 3డీ ఫార్మాట్‍లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.