Srikanth Box Office Collections: దుమ్మురేపుతున్న శ్రీకాంత్ మూవీ.. మన పారిశ్రామికవేత్త బయోపిక్ బాలీవుడ్‌లో సూపర్ హిట్
Srikanth Box Office Collections: శ్రీకాంత్ మూవీ బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. మన తెలుగు పారిశ్రామికవేత్త బయోపిక్ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
Srikanth Box Office Collections: శ్రీకాంత్ పేరుతో బాలీవుడ్ లో ఈ మధ్యే రిలీజైన మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. రాజ్ కుమార్ రావ్ నటించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే ఇండియాలో రూ.12 కోట్ల వరకూ వసూలు చేసింది. ఈ సినిమా మన తెలుగు అంధ పారిశ్రామికవేత్త శ్రీకాంత్ బొల్లా జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావడం విశేషం.
శ్రీకాంత్ మూవీ బాక్సాఫీస్
గత శుక్రవారం (మే 10) థియేటర్లలో రిలీజైన శ్రీకాంత్ మూవీ ఫస్ట్ వీకెండ్ ఇండియాలోనే రూ.12 కోట్ల వరకూ వసూలు చేసినట్లు Sacnilk.com వెల్లడించింది. ఈ సినిమాలో శ్రీకాంత్ బొల్లా పాత్రను ప్రముఖ నటుడు రాజ్ కుమార్ రావ్ పోషించాడు. తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర రూ.2.25 కోట్ల వసూళ్లతో ప్రారంభమైన ఈ మూవీ.. క్రమంగా వసూళ్లను పెంచుకుంటూ వెళ్తోంది.
రెండో రోజు రూ.4.2 కోట్లు రాగా.. మూడో రోజైన ఆదివారం రూ.5.5 కోట్లు వచ్చాయి. దీంతో ఇప్పటి వరకూ ఇండియాలోనే ఈ మూవీ రూ.11.95 కోట్లు నెట్ వసూళ్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు రూ.13.9 కోట్లుగా ఉన్నాయి. ఓవర్సీస్ లో ఈ సినిమా రిలీజ్ కాలేదు. ఆదివారం మూడో రోజు హిందీ మార్కెట్లో ఈ మూవీ ఆక్యుపెన్సీ రేటు 25.59 శాతంగా ఉంది.
ఏంటీ శ్రీకాంత్ మూవీ? ఎవరీ శ్రీకాంత్ బొల్లా?
ఆంధ్రప్రదేశ్‍కు చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితం ఆధారంగా ఈ శ్రీకాంత్ మూవీ తీశారు. కంటి చూపు లేక అనేక సవాళ్లు ఎదురైనా.. ఉన్నత చదువులతో పాటు ఎన్నో ఘనతలు సాధించిన శ్రీకాంత్ బొల్లా స్ఫూర్తిగా మూవీని తెరకెక్కించారు. శ్రీకాంత్ బొల్లా సొంతఊరు ఆంధ్రప్రదేశ్‍లోని మచిలీపట్నం. వ్యవసాయ కుటుంబంలో ఆయన జన్మించారు.
అయితే, తనకు కంటి చూపు లేని ప్రతికూలతను అనుకూలంగా మార్చుకొని ఆయన కష్టపడ్డారు. చదువులో రాణించారు. అమెరికాలోని MIT నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తొలి అంతర్జాతీయ అంధ విద్యార్థిగా శ్రీకాంత్ బొల్లా చరిత్రకు ఎక్కారు.
శ్రీకాంత్ బొల్లా ప్రస్తుతం పారిశ్రామికవేత్తగా ఉన్నారు. హైదరాబాద్‍లో ఆయన బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించారు. ఆయనకు అమెరికాలో కార్పొరేట్ ఉద్యోగ అవకాశాలు వచ్చినా.. ఇండియాలోనే తన ఆవిష్కరణలు చేసేందుకు నిర్ణయించుకున్నారు.
2012లో శ్రీకాంత్ బొల్లాంట్ ఇండస్ట్రీస్ స్థాపించాక.. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కూడా ఫండింగ్ చేశారు. చెట్లు, మొక్కల ఆధారంగా ఈ కంపెనీ పర్యావరణహిత ప్రొడక్టులను తయారు చేస్తోంది. ఈ సంస్థ ద్వారా వందలాది మంది దివ్యాంగులకు శ్రీకాంత్ ఉపాధి కల్పిస్తున్నారు. ఆసియాలో 30 ఏళ్లలోపు 30 మంది అంటూ 2017లో ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రచురించిన జాబితాలో శ్రీకాంత్ బొల్లాకు చోటు దక్కింది.
శ్రీకాంత్ బొల్లా.. సామాజిక సేవ కూడా ముమ్మరంగా చేస్తున్నారు. దివ్యాంగులైన పిల్లల కోసం 2011లో సమన్వయ్ సెంటర్‌ను ఆయన స్థాపించారు. బ్రయిలీ ప్రింట్ ప్రెస్ ఏర్పాటు, ఆ పిల్లలకు విద్యను అందించడం, ఆర్థికంగా సహకారం, పునరావాసం కల్పించడం లాంటి సేవలు అందిస్తున్నారు. ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా చేస్తున్నారు.
టాపిక్