Sreenu Vaitla: మహేష్ బాబుతో ఆ సినిమా చేయడం నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు: శ్రీను వైట్ల కామెంట్స్ వైరల్
Sreenu Vaitla: మహేష్ బాబుతో తాను చేసిన ఓ సినిమాపై డైరెక్టర్ శ్రీను వైట్ల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన జీవితంలో తాను చేసిన అతిపెద్ద తప్పు అదే అని అతడు అనడం విశేషం. తన లేటెస్ట్ మూవీ విశ్వం ప్రమోషన్లలో భాగంగా అతడీ కామెంట్స్ చేశాడు.
Sreenu Vaitla: శ్రీను వైట్ల.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడు. తన మార్క్ కామెడీతో ఎన్నో హిట్స్ అందుకున్న దర్శకుడతడు. అయితే అతని కెరీర్లో కొన్ని మాయని మచ్చలు కూడా ఉన్నాయి. అలాంటి మూవీల్లో ఒకటి ఆగడు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో అంతకుముందే దూకుడులాంటి బ్లాక్‌బస్టర్ అందించిన శ్రీను వైట్లకు.. ఈ ఆగడు మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది.
ఆగడు చేయడం పెద్ద తప్పు
తాజాగా గోపీచంద్ తో కలిసి శ్రీను వైట్ల చేసిన విశ్వం మూవీ రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్లలో అతడు బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఈ ఆగడు మూవీ చేయడమే అని శ్రీను వైట్ల అనడం గమనార్హం. నిజానికి తానో భారీ బడ్జెట్ స్టోరీని సిద్ధం చేసి మహేష్ కు చెప్పగా.. అతడు కూడా ఓకే అన్నాడని, అయితే చివరి నిమిషంలో ప్రొడ్యూసర్లు వెనుకడుగు వేయడంతో కథను మార్చాల్సి వచ్చిందని తెలిపాడు.
ఆ స్టోరీపై తనకే పూర్తిగా నమ్మకం లేదని కూడా అన్నాడు. శ్రీను వైట్ల భయపడినట్లే ఆగడు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. అయితే స్టోరీ గురించి తెలిసి కూడా తాను ముందడుగు వేయడం అన్నది జీవితంలో తాను చేసిన పెద్ద తప్పుగా మిగిలిపోయిందని చెప్పాడు.
గోపీచంద్‌తో విశ్వం
చాలా రోజుల తర్వాత శ్రీను వైట్ల మళ్లీ ఓ యాక్షన్ డ్రామా విశ్వంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ మూవీలో గోపీచంద్ లీడ్ రోల్లో నటించాడు. ఈ సినిమా గురించి కూడా అతడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. గతంలో శ్రీను వైట్ల మార్క్ కామెడీ అతని సినిమాల్లో కనిపించేది.
ముఖ్యంగా దూకుడు, బాద్‌షాలాంటి సినిమాల్లో అతడు క్రియేట్ చేసిన సరికొత్త కామెడీ మ్యాజిక్ వర్కౌట్ అయింది. దీనిని ఆ తర్వాత కూడా చాలా సినిమాల్లో అనుకరించారని, ఇప్పుడది రొటీన్ అయిపోయిందని శ్రీను వైట్ల అన్నాడు. అందుకే తాను ఈసారి విశ్వం మూవీలో సరికొత్తగా మరో కామెడీ ట్రాక్ ను అందించబోతున్నానని, ఇది ఇంకా బాగుంటుందని కూడా ఓ ఇంటర్వ్యూలో శ్రీను చెప్పాడు.
విశ్వం మూవీ గురించి..
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న గోపీచంద్ ఓ మంచి హిట్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఇప్పుడు శ్రీను వైట్లతో కలిసి విశ్వం అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ కానుంది. ఇదొక యాక్షన్ కామెడీ జానర్ మూవీ.
కావ్య థాపర్ ఫిమేల్ లీడ్ గా నటిస్తోంది. కేవలం 75 రోజుల్లోనే విశ్వం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై గోపీచంద్ తోపాటు శ్రీను వైట్ల కూడా భారీ ఆశలే పెట్టుకున్నారు. ఈ ఇద్దరూ మరోసారి టాలీవుడ్ లో నిలదొక్కుకోవాలంటే విశ్వం హిట్ కావడం తప్పనిసరిగా మారింది.