Sreeleela: బాలీవుడ్‍లో అడుగుపెట్టనున్న శ్రీలీల! ఆ స్టార్ నటుడి కొడుకు సినిమాలో ఛాన్స్
Sreeleela Bollywood: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల బాలీవుడ్ ఆఫర్ దక్కించుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్‍లో త్వరలోనే ఈ అమ్మడు ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
Sreeleela: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల తక్కువ కాలంలోనే చాలా స్టార్‌డమ్ తెచ్చుకున్నారు. అందంతో పాటు అద్భుతంగా డ్యాన్స్ చేయడం కూడా ఈ తెలుగమ్మాయికి కలిసి వచ్చింది. దీంతో స్టార్ హీరోలతో వరుసగా సినిమాల్లో శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నారు. అయితే, బాక్సాఫీస్ వద్ద వరుసగా సినిమాలు బోల్తా కొట్టడంతో ఇటీవల ఆమెకు అవకాశాలు కాస్త తగ్గాయి. అయితే, మళ్లీ జోరు పెంచారు. త్వరలోనే శ్రీలీల బాలీవుడ్‍లో అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది.
స్టార్ నటుడి కొడుకు సినిమాలో..
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ నటిస్తున్న చిత్రంలో శ్రీలీల హీరోయిన్‍గా అవకాశం దక్కించుకున్నారని తెలుస్తోంది. దిలేర్ పేరుతో రూపొందనున్న ఈ మూవీలో ఇబ్రహీం సరసన శ్రీలీల హీరోయిన్‍గా ఎంపికయ్యారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది.
దిలేర్ చిత్రానికి కృణాల్ దేశ్‍ముఖ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ కోసం ఇప్పటికే శ్రీలీలకు అడ్వాన్స్ కూడా ఇచ్చారట మేకర్స్. ఈ చిత్రాన్ని మాడ్‍డాక్ ఫిల్మ్స్ పతాకంపై వినేశ్ విజన్, పూజా విజన్ నిర్మిస్తున్నారు.
దిలేర్ మూవీ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కాస్త జరిగింది. శ్రీలీల వచ్చిన తర్వాత మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని మూవీ టీమ్ నిర్ణయించిందని తెలుస్తోంది. 2025లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా మూవీ యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.
మళ్లీ శ్రీలీల జోరు
శ్రీలీల హీరోయిన్‍గా నటించిన స్కంద, ఆదికేశవ, ఎక్స్‌ట్రా ఆర్డినరీమ్యాన్ సినిమాలు గతేడాది బాక్సాఫీస్ వద్ద భారీగా నిరాశపరిచాయి. భగవంత్ కేసరి విజయం సాధించినా.. ఈ మూవీలో ఆమెది హీరోయిన్ పాత్ర కాదు. సూపర్ స్టార్ మహేశ్ బాబుతో శ్రీలీల హీరోయిన్‍గా నటించిన గుంటూరు కారం కూడా హిట్ కాలేకపోయింది. దీంతో శ్రీలీలకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. అయితే, ఈ భామ జోరు మళ్లీ ఇప్పుడు పెరుగుతోంది.
శ్రీలీల లైనప్
నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్‍హుడ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్‍గా నటిస్తున్నారు. వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్ హీరోగా ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోనూ శ్రీలీల హీరోయిన్‍గా ఉన్నారు. అయితే, హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.
మాస్ మహారాజ్ రవితేజతో శ్రీలీల మరోసారి కలిసి నటించనున్నారని తెలుస్తోంది. రవితేజతో చేసిన ధమాకా మూవీతోనే లీల ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు, ఆ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. సామజరగమన మూవీతో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భాను.. ఈ చిత్రంతో దర్శకుడిగా మారనున్నారు. శ్రీలీల నటించడంపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కోలీవుడ్‍లో అజిత్ కుమార్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలోనూ శ్రీలీల నటిస్తారనే రూమర్లు ఉన్నాయి.
ఇక ‘దిలేర్’తో బాలీవుడ్‍లోనూ శ్రీలీల అడుగుపెట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ టీమ్ నుంచి కూడా ఈ విషయంపై త్వరలోనే ప్రకటన వస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్‍లోనూ శ్రీలీలకు బాగా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
టాపిక్