Singer Suchitra: గే అన్నందుకు మాజీ భర్తకు క్షమాపణలు చెప్పిన సింగర్
Singer Suchitra: సింగర్ సుచిత్ర కొన్ని వివాదాస్పద కామెంట్లతో దుమారం రేపారు. తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్ గే అంటూ మాట్లాడారు. ఈ విషయంపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. తాజాగా కార్తీక్‍కు సుచిత్ర క్షమాపణలు చెప్పారు. మరిన్ని కామెంట్లు చేశారు.
సింగర్ సుచిత్ర కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు సినీ సెలెబ్రిటీలపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ధనుష్, త్రిష, కమల్ హాసన్ లాంటి స్టార్ నటీనటులపై ఆరోపణలు చేశారు. అలాగే, తన మాజీ భర్త, నటుడు కార్తీక్ కుమార్‌ను గే అంటూ మాట్లాడారు. ఈ అంశం దుమారం రేపింది. అయితే, ఇప్పుడు ఎట్టకేలకు కార్తీక్‍కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు సుచిత్ర.
పోలీసులు తరచూ ఫోన్లు చేస్తున్నారు
తాను చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు కార్తీక్ కుమార్ ఫిర్యాదు చేశారని, అప్పటి నుంచి తనకు ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయని సుచిత్ర నేడు ఓ వీడియో చేశారు. తన యూట్యూబ్ ఛానెల్ సుచీ స్పేస్‍లో ఈ విషయంపై నేడు వీడియో వదిలారు. కార్తీక్‍కు క్షమాపణలు చెప్పారు. “నేను ఇంటర్వ్యూల్లో తనను గే అన్నందుకు పట్టినంపాక్కం పోలీస్ స్టేషన్‍లో కార్తీక్ కుమార్ ఫిర్యాదు నమోదు చేశారు. బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అడిగారు. నేను అతడికి ఈ విషయంలో మెయిల్ కూడా పంపా. నాకు కొన్ని వారాలుగా పోలీసుల నుంచి చాలా కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నారు. నేను కార్తీక్‍కు క్షమాపణలు చెప్పకపోతే.. జైలుకు పంపుతామని పోలీస్ ఆఫీస్ర విజయలక్ష్మి అంటున్నారు. ఆమె మానసిక ప్రశాంతనను నేను చెడగొట్టాలని అనుకోవడం లేదు. అందుకే కార్తీక్‍కు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా” అని సుచిత్ర తన వీడియోలో చెప్పారు. తన యూట్యూబ్ ఛానెల్‍ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు.
అద్భుతమైన మనిషి అంటూ..
గే అని కార్తీక్ కుమార్ కెరీర్‌ను తాను నాశనం చేశారని కొందరు దూషిస్తున్నారని సుచిత్ర అన్నారు. కార్తీక్ అద్భుతమైన మనిషి అంటూ చెప్పారు. “గే అన్నందుకు నేను క్షమాపణలు చెబుతున్నా. నేను ఆయన కెరీర్‌ను నాశనం చేయాలని అనుకోలేదు. కార్తీక్ చాలా మంచి మనిషి. ఈ క్షమాపణ వల్ల నీకు ఎక్కువ సినిమాలు వస్తాయని నేను ఆశిస్తున్నా” అని సుచిత్ర అన్నారు.
తన మాటలకు కార్తీక్ కుమార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నట్టు అనిపిస్తోందని వెటకారంగా అన్నారు సుచిత్ర. ఆయన తన జీవితం, రెండో భార్యపై ఎక్కువగా దృష్టి పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అలాగే, కార్తీక్ ఓ సందర్భంలో తనను పిచ్చిది అంటూ దూషించారని కూడా గుర్తుచేశారు. ఆయన చేసే సినిమాలను మాత్రం విశ్లేషించడం ఆపబోనని సుచిత్ర చెప్పారు.
స్టార్ యాక్టర్లపై కూడా..
ఈ ఏడాది మేలో యూట్యూబ్ ఛానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో సుచిత్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన భర్త కార్తీక్ గే అన్నారు. అలాగే, తమిళ స్టార్ హీరో ధనుష్.. గే పార్టీలు నిర్వహించే వారని ఆరోపణలు చేశారు. దీంతో సుచిత్రపై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. కమల్ హాసన్, త్రిష, విజయ్, ఐశ్వర్య రజినీకాంత్, ఆండ్రియా జెమీమాపై కూడా అర్థం లేని మాటలు మాట్లాడారు సుచిత్ర. 2017లో సుచిత్ర ట్విట్టర్ అకౌంట్‍లో కొందరు యాక్టర్ల ఫొటోలు, వీడియోలు పోస్ట్ అవడం రచ్చకు దారితీశాయి. సుచీ లీక్స్ అంటూ చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రాంక్స్ అంటూ కూడా ఆమె గతంలో సింపుల్‍గా చెప్పారు.