Sayaji Shinde: పాలిటిక్స్‌లోకి సాయాజీ షిండే.. ఎన్సీపీ కండువా కప్పుకున్న టాలీవుడ్ విలన్
Sayaji Shinde: టాలీవుడ్ లో విలన్ పాత్రలతో పాపులర్ అయిన నటుడు సాయాజీ షిండే పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అతడు శుక్రవారం (అక్టోబర్ 11) మహారాష్ట్రలో అజిత్ పవర్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.
Sayaji Shinde: సాయాజీ షిండే.. వచ్చీరాని తెలుగులో తన మార్క్ డైలాగులతో విలనీని పండించిన నటుడు. ఇప్పుడా యాక్టర్ కాస్తా పొలిటీషియన్ అయ్యాడు. సినిమాల్లో ఎన్నోసార్లు రాజకీయ నాయకుడి అవతారమెత్తిన అతడు.. ఇప్పుడు నిజ జీవితంలోనూ రాజకీయాల్లోకి వెళ్లాడు. సాయాజీ శుక్రవారం (అక్టోబర్ 11) అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)లో చేరాడు.
ఎన్సీపీలోకి సాయాజీ షిండే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, టాలీవుడ్ లో చాలా మూవీస్ లో విలన్ పాత్రలు పోషించిన సాయాజీ షిండే ఎన్సీపీలో చేరాడు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్ పాల్గొన్నారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున సాయాజీ ఓ స్టార్ కంపేనర్ కానున్నాడు. వచ్చే నెలలోనే ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. తాను ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్ర పోషించానని, ఇప్పుడు నిజ జీవితంలోనూ రాజకీయాల్లోకి వచ్చినట్లు చెప్పాడు.
పవార్ పని తీరు నచ్చే..
ఈ సందర్భంగా సాయాజీ షిండే మాట్లాడుతూ.. అజిత్ పవార్ పని తీరు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. "అజిత్ పవార్ పని తీరు నాకు బాగా నచ్చింది. అడవుల పునరుజ్జీవ కార్యక్రమంలో భాగంగా నేను అజిత్ తో మాట్లాడాను. దీనిపై మరింత సమర్థవంతంగా పని చేయాలంటే నేను వ్యవస్థలో భాగం కావాలని భావించాను" అని సాయాజీ చెప్పాడు.
మహారాష్ట్రలోని సతారా జిల్లాలో సాయాజీ షిండే జన్మించాడు. 65 ఏళ్ల వయసున్న అతడు.. 1999లో బాలీవుడ్ లో వచ్చిన స్కూల్ మూవీ ద్వారా విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లిష్, గుజరాతీ, భోజ్‌పురి భాషల్లో నటించాడు. ముఖ్యంగా తెలుగులో నటన ద్వారా అతనికి మంచి పేరు వచ్చింది. శుక్రవారమే (అక్టోబర్ 11) అతడు నటించిన మా నాన్న సూపర్ హీరో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ మధ్యే అతడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కూడా కలిసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆలయాల్లో ప్రసాదంతోపాటు ఓ మొక్క కూడా ఇచ్చేలా చూడాలని పవన్ ను సాయాజీ కోరాడు. దీనిపై పవన్ సానుకూలంగా స్పందించాడు.