Saripodhaa Sanivaaram: దిల్‍రాజు చేతికి నాని ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ హక్కులు.. సినిమా ఆ నెలలోనే వస్తుందా?-saripodhaa sanivaaram movie andhra pradesh telangana rights acquired by dil raju ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Saripodhaa Sanivaaram: దిల్‍రాజు చేతికి నాని ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ హక్కులు.. సినిమా ఆ నెలలోనే వస్తుందా?

Saripodhaa Sanivaaram: దిల్‍రాజు చేతికి నాని ‘సరిపోదా శనివారం’ థియేట్రికల్ హక్కులు.. సినిమా ఆ నెలలోనే వస్తుందా?

Chatakonda Krishna Prakash HT Telugu
Jan 20, 2024 11:35 AM IST

Saripodhaa Sanivaaram: సరిపోదా శనివారం సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‍రాజు దక్కించుకున్నారు. నాని హీరోగా నటించిన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ కావొచ్చంటే..

సరిపోదా శనివారంలో నాని
సరిపోదా శనివారంలో నాని

Saripodhaa Sanivaaram: హాయ్ నాన్న సినిమా సక్సెస్‍తో హీరో నేచురల్ స్టార్ నాని హ్యాపీగా ఉన్నారు. గత డిసెంబర్‌లో రిలీజ్ అయిన హాయ్ నాన్న ఫీల్ గుడ్ మూవీగా ప్రశంసలు పొందడంతో పాటు కమర్షియల్‍గానూ మంచి కలెక్షన్లతో విజయం సాధించింది. ఇక నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నారు. యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘అంటే సుందరానికి’ తర్వాత నాని - వివేక్ కాంబో రిపీట్ అవుతుండడం, అందులోనూ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తుండటంతో ‘సరిపోదా శనివారం’ మూవీకి క్రేజ్ బాగా ఉంది.

ప్రస్తుతం ‘సరిపోదా శనివారం’ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల థియేట్రికల్ హక్కుల డీల్ జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‍రాజుకు చెందిన చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ (SVC) సొంతం చేసుకుంది.

సరిపోదా శనివారం తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్‍రాజు సంస్థ దక్కించుకున్నట్టు డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ అధికారికంగా వెల్లడించింది. “నాని.. సరిపోదా శనివారం సినిమా కోసం రాజు (దిల్ రాజు), శిరీష్‍తో భాగస్వాములవడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సొంతం చేసుకుంది” అని ట్వీట్ చేసింది.

నాని గత రెండు సినిమాలు దసరా, హాయ్ నాన్న చిత్రాలను తెలంగాణలో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ రెండు మూవీస్ మంచి కలెక్షన్లను దక్కించుకున్నాయి. ఇప్పుడు సరిపోదా శనివారం.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను ఆయనే తీసుకున్నారు.

రిలీజ్ అప్పుడేనా?

సరిపోదా శనివారం సినిమా షూటింగ్ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అన్నీ ప్లాన్ చేసుకున్న విధంగా సాగితే ఈ చిత్రం ఆగస్టులో విడుదలవుతుంది.

సరిపోదా శనివారం చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా కనిపించనున్నారు. ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారు. తమిళ నటుడు ఎస్‍జే సూర్య కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. జేక్స్ బెజోయ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు.

సరిపోదా శనివారం చిత్రాన్ని థ్రిల్లర్‌గా వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌తోనే ఈ మూవీ చాలా ఆసక్తిని రేకెత్తించింది. చైన్‍లతో నాని ఉండడం.. శనివారం మాత్రమే ప్రత్యేకమైన పవర్ ఉంటుందనేలా గ్లింప్స్‌లో హింట్ ఇచ్చారు మేకర్స్. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్‍లో రిలీజ్ చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ చేసేందుకు నిర్ణయించారు.

మరోవైపు సరిపోదా శనివారం షూటింగ్‍కు శుక్రవారమే (జనవరి 19) వచ్చారు ప్రముఖ నటుడు ఎస్‍జే సూర్య. పవర్ హౌస్ వచ్చేశారంటూ ఎస్‍జే సూర్య గురించి మేకర్స్ అప్‍డేట్ ఇచ్చారు. ఈ మూవీలో ఆయన నెగెటివ్ పాత్ర చేయనున్నారని తెలుస్తోంది.

దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని మరో సినిమా చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంపై శ్రీకాంత్ వర్క్ చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్‍తోనూ నాని ఓ మూవీ చేస్తారని బజ్ నడుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఈ విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.