Dil Raju Guntur Kaaram: శత్రువులు ఉండరు.. గుంటూరు కారం టాక్ మారుతోంది: నిర్మాతలు దిల్‍రాజు, నాగ వంశీ కామెంట్స్
Dil Raju - Guntur Kaaram: గుంటూరు కారం సినిమాకు నెగెటివ్ టాక్ రావడం గురించి ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ మూవీ నైజాం హక్కులను దక్కించుకున్న ఆయన.. నేడు మీడియా సమావేశంలో మాట్లాడారు. టాక్, కలెక్షన్లు సహా మరిన్ని విషయాలపై వ్యాఖ్యలు చేశారు.
Dil Raju - Guntur Kaaram: భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుంటూరు కారం సినిమా తొలి రోజే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. శుక్రవారం (జనవరి 12) రిలీజైన ఈ చిత్రానికి నెగెటివ్ అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. సంక్రాంతి బరిలో భారీ మూవీగా అడుగుపెట్టింది. అయితే, తొలి రోజు భారీ కలెక్షన్లు వచ్చినా.. టాక్ మాత్రం మిశ్రమంగా వచ్చింది. ఈ తరుణంలో గుంటూరు కారంపై ప్రముఖ నిర్మాత, ఈ మూవీ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్‍రాజు, నిర్మాత నాగవంశీ నేడు (జనవరి 13) మీడియా సమావేశంలో మాట్లాడారు.
అలా వెళ్లినా నచ్చుతుంది
నెగెటివ్ టాక్ వచ్చిన సినిమాలు కొన్ని బ్లాక్‍బాస్టర్ అయిన సందర్భాలు గతంలో ఉన్నాయని దిల్‍రాజు అన్నారు. నెగెటివ్ వైబ్స్ మధ్య థియేటర్లలోకి వెళితే మూవీలో ఏ అంశం కనెక్ట్ అయినా సినిమా ప్రేక్షకులకు నచ్చేస్తుందని తెలిపారు. ఆరంభంలో మిక్స్డ్ టాక్ వచ్చినా.. ఆ తర్వాత నుంచి గుంటూరు కారం సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని దిల్‍రాజు అన్నారు.
మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ ఆధారంగా మదర్ సెంటిమెంట్‍తో గుంటూరు కారం వచ్చిందని దిల్‍రాజు అన్నారు. తాను రెండోసారి సుదర్శన్ థియేటర్లో ఈ సినిమా చూశానని, అప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీని ఎంతో ఎంజాయ్ చేశారని దిల్‍రాజు అన్నారు. ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతోందని అన్నారు. మిక్స్డ్ టాక్ సాయంత్రానికి తగ్గిపోయిందని దిల్‍రాజు చెప్పారు.
ఇండస్ట్రిలో శత్రువు ఉండరు
నైజాంలో హను-మాన్ సినిమాకు థియేటర్లు దక్కకుండా చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కూడా దిల్‍రాజు స్పందించారు. సినీ ఇండస్ట్రీలో కొందరికి మరికొందరు శత్రువులుగా, మిత్రులుగా ఉండరని, మొత్తంగా చూస్తే ఇదో వ్యాపారం అని చెప్పారు. థియేటర్ల కేటాయింపు వివాదం సంక్రాంతి తర్వాత అంతా సద్దుమణుగుతుందని అన్నారు.
“మొత్తంగా ఇది వ్యాపారం. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరూ కొందరికి శత్రువులుగా.. మిత్రులుగా ఉండరు. తాము పెట్టిన పెట్టుబడిని ఎలా తిరిగి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారు. దారులు వెతుకుతారు. ప్రతీ సంక్రాంతికి థియేటర్ల కేటాయింపునకు సంబంధించి వివాదం నడుస్తుంటుంది. పండగ అయిపోతే మళ్లీ ఇవన్నీ మర్చిపోతారు. కొత్త రిలీజ్‍లపై దృష్టి సారిస్తారు” అని దిల్‍రాజు చెప్పారు.
టాక్ మారుతోంది
గుంటూరు కారం చిత్రానికి అర్ధరాత్రి ఒంటి గంట షోల నుంచే మిక్స్డ్ టాక్ వచ్చిందని, అయితే సాయంత్రం, నైట్ షోల్లో ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం ప్రారంభించినప్పటి నుంచి టాక్ మారుతోందని నిర్మాత నాగవంశీ చెప్పారు. తాము అంచనా వేసిన దాని కంటే ఈ మూవీకి తొలి రోజు ఎక్కువ కలెక్షన్లు వచ్చాయని తెలిపారు. బాక్సాఫీస్ వద్ద రీజనల్ తెలుగు సినిమా చాలా రోజుల తర్వాత సత్తాచాటుతోందని నాగవంశీ చెప్పారు.
గుంటూరు కారం సినిమా తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.94 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దక్కించుకుందని మూవీ యూనిట్ ప్రకటించింది.
గుంటూరు కారం చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించగా.. థమన్ సంగీతం అందించారు. హారిక హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ నిర్మించారు. ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‍గా నటించారు. మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, జగపతి బాబు, రావు రమేశ్, జయరాం కీలకపాత్రలు పోషించారు.