Guntur Kaaram Review: గుంటూరు కారం రివ్యూ - మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మ్యాజిక్ వర్కవుట్ అయ్యిందా? లేదా?
Guntur Kaaram Review: అతడు, ఖలేజా తర్వాత దాదాపు పడమూడేళ్ల విరామం అనంతరం మహేష్‌బాబు, త్రివిక్రమ్ కలిసి చేసిన గుంటూరు కారం మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే
Guntur Kaaram Review: మహేష్ బాబు(Mahesh Babu), త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా కమర్షియల్‌గా అంతగా విజయాల్ని సాధించలేకపోయినా ఈ సినిమాకు భారీగా ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా మహేష్‌ను ఈ సినిమాల్లో కొత్త కోణంలో ఆవిష్కరించారు త్రివిక్రమ్. దాదాపు పదమూడేళ్ల తర్వాత మళ్లీ మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా గుంటూరు కారం.
సంక్రాంతి కానుకగా శుక్రవారం భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. గుంటూరు కారం ఎలా ఉంది? హ్యాట్రిక్ సక్సెస్‌లతో జోష్ మీదున్న మహేష్‌కు ఆ విజయ పరంపరను గుంటూరు కారంతో కొనసాగించాడా లేదా అన్నది చూద్దాం...
గుంటూరు రమణ కథ...
రమణను (మహేష్‌బాబు) చిన్నతనంలోనే తల్లి వదిలిపెట్టి వెళ్లిపోతుంది. తండ్రి రాయల్ సత్యం (జయరామ్) జైలు పాలవ్వడంతో రమణను అత్తయ్య (ఈశ్వరీరావు) పెంచి పెద్దచేస్తుంది. రాయల్ సత్యానికి దూరమైన వసుధార మరో పెళ్లి చేసుకుంటుంది. గొప్ప రాజకీయనాయకురాలిగా ఎదుగుతుంది. వసుంధరను మినిస్టర్‌ను చేయాలని ఆమె తండ్రి వైరా వెంకట సూర్యానారాయణ (ప్రకాష్ రాజ్) ప్రయత్నిస్తాడు. మినిస్టర్ పదవిపై ఆశ ఉన్న మరో పొలిటికల్ లీడర్ కాటా మధు (రవిశంకర్)...వసుంధరకు పదవి దక్కకూడదని రాయల్ సత్యంతో ఆమె పెళ్లి, రమణతో బంధుత్వాన్ని బయటపెట్టాలని చూస్తాడు.
తల్లితో తనకు ఎలాంటి సంబంధం లేదని బాండ్‌పేపర్స్‌పై రమణ చేత సంతకం చేయించాలని వైరా సూర్యనారాయణ అతడిని గుంటూరు నుంచి హైదరాబాద్‌కు పిలిపిస్తాడు. పేపర్స్‌పై సంతకం చేయడానికి రమణ ఒప్పుకోకపోవడంతో అతడిపై తప్పుడు కేసులు పెట్టిస్తాడు. ఆ తర్వాత ఏమైంది? రమణకు తల్లి వసుంధర దూరం కావడానికి కారణమేమిటి?
రాయల్ సత్యం ఎందుకు జైలుకు వెళ్లాడు? వసుంధరపై రివేంజ్ తీర్చుకోవడానికి కాటా మధు ఏం చేశాడు? వసుంధరపై ఎటాక్ చేసిన హరిదాస్ ఎవరు? ఆ ఎటాక్‌తో వైరా వెంకట సూర్యనారాయణకు సంబంధం ఉందా? రమణపై అంతులేని ప్రేమ ఉన్నా అతడికి వసుంధర దూరంగా ఉండటానికి కారణం ఏమిటి? రమణ కథలో అమ్ము (శ్రీలీల) రాజీ( మీనాక్షి చౌదరి) పాత్ర ఏమిటి? అన్నదే గుంటూరు కారం(Guntur Kaaram Review) మూవీ కథ.
ఫక్తు మాస్ మూవీ...
గుంటూరు కారం ఫక్తు కమర్షియల్ హంగులతో రూపొందిన మాస్ మసాలా ఎంటర్‌టైనర్. మహేష్ నుంచి అభిమానులు కోరుకునే ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్, మాస్ స్టెప్పులు అన్ని ఉండేలా చూసుకుంటూ తనదైన శైలి సెంటిమెంట్స్, కామెడీతో దర్శకుడు త్రివిక్రమ్ గుంటూరు కారం కథను(Guntur Kaaram Review) రాసుకున్నాడు. కమర్షియల్ హంగుల విషయంలో సక్సెస్ అయిన త్రివిక్రమ్ అసలు కథ విషయంలో తప్పటడుగులు వేశారు.
అత్తారింటికి దారేదితో పోలికలు...
చిన్నతనంలోనే తల్లికి కొడుకు దూరం కావడం, పాతికేళ్ల తర్వాత ఆమెను కలవడం అనే పాయింట్‌తో అలా వైకుంఠపురములో. అత్తారింటికి దారేదితో పాటు అజ్ఞాతవాసి సినిమాలు చేశాడు. అదే పాయింట్‌ను కాస్త అటూ ఇటా మార్చి పొలిటికల్ అంశాలను టచ్ చేస్తూ గుంటూరు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించాడు. త్రివిక్రమ్ సినిమాల్లో కనిపించే మనసుల్ని కదిలించే ఫ్యామిలీ ఎమోషన్స్. అతడి మార్క్ పంచ్‌లు, ప్రాసలు సినిమాలో మిస్సయ్యాయి.
జిమ్మిక్కులు వర్కవుట్ కాలేదు..
మూడు లైన్లలో ముగిసే కథను రెండున్నర గంటల నడిపించడానికి త్రివిక్రమ్ చాలా జిమ్మిక్కులు చేశాడు. ఓ ఫైట్..పాట...సెంటిమెంట్ సీన్ అన్న చందంగా నడుస్తుంది. తల్లీకొడుకుల బంధాన్ని నడిపించే బలమైన సంఘర్షణ, సీన్స్ సినిమాలో(Guntur Kaaram Review) కనిపించదు. శ్రీలీల పాత్రను కథలో ఇరికించినట్లుగా ఉంది. హీరో చేత బాండ్ పేపర్స్‌పై సంతకం పెట్టించడానికి ఆమె పాట్ల నుంచి వచ్చే కామెడీ, పాటలు నాన్ సింక్ అయినా అవే కాస్తంత సినిమాకు రిలీఫ్ నిస్తాయి. తల్లికి హీరో దూరం కావడానికి కారణమయ్యే ట్విస్ట్ కూడా ఈజీగా గెస్ చేసేలానే ఉంటుంది. త్రివిక్రమ్ సినిమాల్లో హీరోతో పాటు ప్రతి పాత్ర కథలో అంతర్భాగంగానే కనిపిస్తుంటాయి. కానీ ఇందులో మాత్రం కథకు ఏ మాత్రం సంబంధం లేని పాత్రలే ఎక్కువగా అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటాయి.
మహేష్ వన్ మెన్ షో...
గుంటూరు కారం సినిమాకు మహేష్ వన్ మెన్ షోగా నిలిచాడు. సినిమాను పూర్తిగా తన భుజస్కందాలపై వేసుకొని నడిపించాడు. మాస్ పాత్రలో అతడు చెప్పిన డైలాగ్స్...కామెడీ టైమింగ్ మెప్పిస్తాయి. డ్యాన్సుల్లో ఇరగదీశాడు. ఎనర్జీ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ సాదాసీదా కథను నిలబెట్టడానికి ఏం చేయాలో అంతా చేశాడు. శ్రీలీల పాటలకే పరిమితమైంది.
త్రివిక్రమ్ సినిమాల్లో మాదరిగా పెద్దగా ఆమె పాత్ర రిజిస్టర్ కాదు. మీనాక్షి చౌదరి అతిథిగానే కనిపిస్తుంది. మహేష్ తల్లిగా రమ్యకృష్ణ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో మెప్పించింది. జయరాజ్, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు, అజయ్‌తో పాటు చాలా మంది సీనియర్లు ఉన్నా ఏ పాత్ర ను కూడా మహేష్‌కు ధీటుగా రాసుకోలేకపోయాడు త్రివిక్రమ్. తమన్ పాటల్లో కుర్చీ మడతపెట్టి మాస్ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంది. బీజీఎమ్ పర్వాలేదు.
ఫ్యాన్స్‌కు మాత్రమే...
గుంటూరు కారం మహేష్ ఫ్యాన్స్‌ను మాత్రమే మెప్పించే రొటీన్ కమర్షియల్ మూవీ. త్రివిక్రమ్ మ్యాజిక్ మిస్ ఫైర్ కావడంతో యావరేజ్ స్థాయిలోనే ఈ సినిమా మిగిలిపోయింది.