Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. గుండె పగిలింది: అల్లు అర్జున్ అరెస్టుపై రష్మిక మందన్నా
Rashmika Mandanna: అల్లు అర్జున్ అరెస్టుపై అతని పుష్ప మూవీ కోస్టార్ రష్మిక మందన్నా స్పందించింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసిన ఆమె.. అతని అరెస్టు నమ్మలేకపోతున్నానని, తన గుండె పగిలిందని చెప్పింది.
Rashmika Mandanna: పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ తో కలిసి నటించిన రష్మిక మందన్నా తాజాగా అతని అరెస్టుపై స్పందించింది. శుక్రవారం (డిసెంబర్ 13) చిక్కడపల్లి పోలీసులు అతన్ని అరెస్టు చేయగా.. సాయంత్రానికి తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ జారీ చేసింది. అయితే అతని అరెస్టును తాను నమ్మలేకపోతున్నానంటూ రష్మిక పోస్ట్ చేసింది.
అల్లు అర్జున్ అరెస్టుపై రష్మిక పోస్ట్
అల్లు అర్జున్ అరెస్టుపై టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాని, నితిన్ లాంటి వాళ్లు ఎక్స్ అకౌంట్ల ద్వారా స్పందించగా.. తాజాగా పుష్ప, పుష్ప 2 సినిమాల్లో నటించిన రష్మిక కూడా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా రియాక్ట్ అయింది. అయితే అందరూ దాదాపు ఒకే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదని వాళ్లు అన్నారు.
"ప్రస్తుతం నేను చూస్తున్నదానిని నమ్మలేకపోతున్నాను. జరిగిన ఘటన దురదృష్టకరం. చాలా బాధ కలిగించింది. అయినంత మాత్రాన దానికి ఒకే వ్యక్తిని నిందించడం బాధ కలిగిస్తోంది. ఈ పరిస్థితి నమ్మశక్యం కానిది. అదే సమయంలో నా గుండె పగిలింది" అని ఇన్‌స్టా స్టోరీస్ లో రష్మిక పోస్ట్ చేసింది.
నాని, నితిన్ కూడా..
అల్లు అర్జున్ కు అంతకుముందు నాని, నితిన్ లాంటి వాళ్లు కూడా మద్దతు పలికారు. "సినిమా వాళ్లనగానే ప్రభుత్వ అధికారులు, మీడియా వాళ్లు చూపించే ఉత్సాహం సాధారణ ప్రజల విషయంలోనూ ఉండాలని అనుకుంటున్నాను. అలా అయితే మనది మరింత మెరుగైన సమాజం అయ్యేది.
అది ఓ దురదృష్ట సంఘటన. నా గుండె తరుక్కుపోతోంది. ఈ ఘటన నుంచి మనమందరం పాఠాలు నేర్చుకొని ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మన అందరి తప్పూ ఉంది. ఒక్కరినే బాధ్యుడిని చేయడం సరికాదు" అని నాని ఆ ట్వీట్ లో స్పష్టం చేశాడు.
నితిన్ కూడా ఇలాగే స్పందించాడు. "ఇలాంటి విషాధాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏం చేయాలో మనం ఆలోచించాలి. ఇది తప్పులు వెతికే సమయం కాదు. పాఠాలు నేర్చుకోవాలి. ముందడుగు వేయాలి. అందరం కలిసికట్టుగా బాధ్యత వహించాలి. సురక్షితమైన రేపటి కోసం ప్రయత్నించాలి" అని నితిన్ ట్వీట్ చేశాడు.
సందీప్ కిషన్ కూడా దీనిపై ట్వీట్ చేశాడు. "ఈ దురదృష్టకర సంఘటనకు ఒకే వ్యక్తిని ఎలా బాధ్యుడిని చేస్తారు. ముఖ్యంగా ఇంత జనాభా ఉన్న దేశంలో, సెలబ్రేషన్లు జరుపుకునే సమయంలో ఇలా జరగడం చాలా దురదృష్టకరం. దీని నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. మళ్లీ జరగకుండా చూసుకోవాలి. లవ్ యూ అల్లు అర్జున్ అన్నా" అని ట్వీట్ చేశాడు.
టాపిక్