Swarnandhra 2047 : ఆంధ్రప్రదేశ్ దశ దిశ మార్చేందుకే.. స్వర్ణాంధ్ర-2047 : సీఎం చంద్రబాబు
Swarnandhra 2047 : ఆంధ్రప్రదేశ్ దశ దిశను మార్చేలా స్వర్ణాంధ్ర – 2047 విజన్‌ను ఆవిష్కరించామని.. ప్రపంచంలోని తెలుగు జాతిని ఉన్నత స్థానంలో నిలపడమే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దీనికి స్వర్ణాంధ్ర-2047 విజన్‌తో బీజం పడిందని వివరించారు.
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తూ.. విజన్ డాక్యుమెంట్ తీసుకురావడం తమ అకుంఠిత దీక్షకు నిదర్శనమని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ మహాసంకల్పంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. చారిత్రక సమావేశానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా ఎదుగుతోందని అన్నారు.
2047లో మనం వందేళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు జరపుకుంటామని, ఆ నాటికి భారతదేశం అగ్రదేశంగా మారాలనే లక్ష్యంతో వికసిత్ భారత్ - 2047ను కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిందని చంద్రబాబు వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్రం కూడా ఒక స్పష్టమైన లక్ష్యంతో స్వర్ణాంధ్ర-2047ను విజన్ డాక్యుమెంట్ రూపొందించుకుందని వ్యాఖ్యానించారు.
'పది సూత్రాల వృద్ధి సోపానాలతో విలువైన విజన్ సాక్షాత్కరించింది. పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం-మానవ వనరుల అభివృద్ధి, ఇంటింటికీ నీటి భద్రత, రైతు-వ్యవసాయ సాంకేతికత, ప్రపంచస్థాయి పంపిణీ వ్యవస్థ (లాజిస్టిక్స్), శక్తి-ఇంధనాల వ్యయ నియంత్రణ, అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, అన్ని దశల్లో సమగ్ర సాంకేతికత మార్గదర్శక సూత్రాల నవపథం ఆవిష్కృతమైంది' అని చంద్రబాబు వివరించారు.
'నేను 1978 నుంచి అనేక ఎన్నికల్లో పోటీచేశాను. కానీ, 93 శాతం సక్సెస్ రేటు, 57 శాతం ఓటు బదిలీని 2024 ఎన్నికల్లో మాత్రమే చూశా. పవన్ కళ్యాణ్ వంటి మంచి మిత్రుడు ఉండటం చాలా సంతోషంగా ఉంది. పాలన చేపట్టాక చూస్తుంటే మా ఊహలకన్న ఎక్కువ విధ్వంసం జరిగిందని తెలిసింది. గాడితప్పిన పరిపాలనను చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో తలసరి ఆదాయం మూడువేల డాలర్ల కంటే తక్కువగా ఉంది. 2047 నాటికి తలసరి ఆదాయాన్ని 42 వేల డాలర్లుకు చేర్చాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
'హైదరాబాద్‌లో హైటెక్‌సిటీ ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా మేమందరం రాళ్లు మాత్రమే చూశాం. మీరు మాత్రం అందులో ఒక విజన్ చూశారని పవన్ కళ్యాణ్ ఎప్పుడూ అంటుంటారు. ఆ రోజు అక్కడ ఒక సింగపూర్‌ను, దుబాయ్‌ను చూశా. న్యూయార్క్ వంటి నగరాన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదనే ఆలోచన చేసి, ముందుకెళ్లాను. ఆనాడు చేసిన విజన్, పునాది కారణంగా హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే రాష్ట్రంగా తయారైందని చెప్పడానికి గర్వంగా ఉంది' అని చంద్రబాబు చెప్పారు.
'మన దగ్గర మెరికల్లాంటి యువత ఉన్నారు. తిరుగులేని మానవవనరులు, సహజ వనరులు, నదులు, సముద్రతీరం ఉన్నాయి. వీటన్నింటినీ సక్రమంగా ఉపయోగించుకుంటే ఏదైనా సాధ్యమే. వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఉండాలనే లక్ష్యంతో పది సూత్రాలతో స్వర్ణాంధ్ర - 2047 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. సమాజమే దేవాలయం.. పేదలే దేవుళ్లు అని చెప్పిన వ్యక్తి ఎన్‌టీఆర్.. ఆ స్ఫూర్తితోనే నేడు జీరో పావర్టీ కోసం సంకల్పించాం' అని చంద్రబాబు స్పష్టం చేశారు.