Ram Charan completed 15 Years: రామ్‌చరణ్ సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు.. చిరంజీవి స్పెషల్ మెసేజ్
Ram Charan completed 15 Years: రామ్‌చరణ్ సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో తన తనయుడికి ఓ స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.
Ram Charan completed 15 Years: చిరుత మూవీతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు రామ్‌చరణ్ తేజ. మెగాస్టార్ చిరంజీవి తనయుడిగానే మొదట్లో ప్రేక్షకులకు దగ్గరైనా తర్వాత తన నటన, డ్యాన్స్‌లతో అభిమానులను సంపాదించుకున్నాడు. ముద్దుగా మెగా పవర్ స్టార్ అని వాళ్లు పిలుచుకునే రేంజ్‌కు ఎదిగాడు. రెండేళ్లలోనే మగధీరతో కెరీర్‌లో అతిపెద్ద హిట్ అందుకొని, రంగస్థలంలో తన నట విశ్వరూపం చూపించి.. ఆర్‌ఆర్‌ఆర్‌లో దానిని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు రామ్‌చరణ్.
2007లో సరిగ్గా సెప్టెంబర్ 28నే రామ్‌చరణ్ నటించిన చిరుత మూవీ రిలీజైంది. ఆ మూవీలో జులపాల జుట్టుతో కనిపించిన అతడు.. ఫైట్లలో ఇరగదీశాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆరెంజ్ ఇచ్చిన షాక్‌తో కథలను ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ 15 ఏళ్ల కెరీర్‌లో రామ్‌చరణ్ కేవలం 14 సినిమాల్లో నటించాడు.
ఆర్సీ15 ఇప్పుడు లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు. తన తనయుడు చెర్రీ సినీ ఇండస్ట్రీలో 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్‌లో అతని కోసం ఓ ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఈ దశాబ్దంన్నర కాలంలో చరణ్ ఓ నటుడిగా ఎదిగిన తీరుకు ఎంతో ముచ్చటపడుతూ చిరు ఈ పోస్ట్ చేయడం విశేషం.
"సినీ ప్రయాణంలో 15 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా రామ్‌చరణ్‌కు శుభాకాంక్షలు. చిరుత నుంచి మగధీర నుంచి రంగస్థలం నుంచి ఆర్‌ఆర్‌ఆర్.. ఇప్పుడు శంకర్‌తో ఆర్సీ 15 వరకూ అతడు ఓ నటుడిగా ఎదిగిన తీరు చూస్తుంటే ఎంతో ముచ్చటగా ఉంది" అని చిరంజీవి ట్వీట్ చేశాడు.
ఈ 15 ఏళ్ల కెరీర్‌లో తండ్రి చిరంజీవితో కలిసి రామ్‌చరణ్ రెండు సినిమాల్లో కనిపించాడు. మగధీర మూవీలో చిరు స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వగా.. ఈ మధ్యే వచ్చిన ఆచార్య మూవీలో చిరుతో ఫుల్ లెంగ్త్ రోల్‌లో నటించాడు రామ్‌చరణ్. ఇప్పుడు ఆర్సీ15 మూవీని లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్నాడు. ఆ తర్వాత ఆర్సీ16 మూవీకి కూడా చెర్రీ సైన్ చేశాడు.
ఇక ఇటు చిరంజీవి గాడ్‌ఫాదర్‌గా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత భోళాశంకర్, వాల్తేర్ వీరయ్యలాంటి మూవీస్ కూడా ఉన్నాయి. మెగాస్టార్ కూడా ఈ మధ్యే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 44 ఏళ్లు పూర్తి చేసుకున్నాడు.