Rakul Singh on Konda Surekha: మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్-rakul preet singh on konda surekha comments urges stop using her name for political mileage ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Rakul Singh On Konda Surekha: మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్

Rakul Singh on Konda Surekha: మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్

Hari Prasad S HT Telugu
Oct 03, 2024 09:05 PM IST

Rakul Singh on Konda Surekha: రకుల్ సింగ్ తీవ్రంగా స్పందించింది. తెలంగాణ మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై దుమారం రేగుతున్న వేళ రకుల్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమ మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దని, తన పేరు వాడితే బాగుందని హెచ్చరించింది.

మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్
మా మౌనాన్ని చేతగానితనంగా చూడకండి.. నా పేరు వాడితే బాగుండదు: రకుల్ సింగ్ వార్నింగ్

Rakul Singh on Konda Surekha: కొండా సురేఖ కామెంట్స్ పై టాలీవుడ్ ప్రముఖుల నుంచి దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఎక్స్ వేదికగా చాలా తీవ్రంగా స్పందించింది. రాజకీయ లబ్ధి కోసం తన పేరు వాడుకోవడం ఆపేయాలని, తమ మౌనాన్ని చేతగానితనంగా చూడొద్దని రకుల్ వార్నింగ్ ఇచ్చింది.

రకుల్ సింగ్ సీరియస్

నాగార్జున, నాగ చైతన్య, సమంతలపై కొండా సురేఖ చేసిన కామెంట్స్ పై గురువారం (అక్టోబర్ 3) ఉదయం నుంచీ టాలీవుడ్ ప్రముఖులు రియాక్ట్ అవుతూనే ఉన్న విషయం తెలుసు కదా. ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రకుల్ సింగ్ కూడా ఎక్స్ వేదికగా రియాక్టయింది. అయితే ఆమె మిగతా అందరి కంటే కాస్త ఘాటుగానే హెచ్చరించింది.

"ప్రపంచవ్యాప్తంగా క్రియేటివిటీ, ప్రొఫెషనలిజానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మంచి పేరుంది. ఈ అందమైన ఇండస్ట్రీలో నా ప్రయాణం చాలా బాగా సాగింది. ఇప్పటికీ నేను అనుసంధానమయ్యే ఉన్నాను.

ఈ ఇండస్ట్రీలోని ఓ మహిళ గురించి ఇలాంటి విషపూరిత, నిరాధార ఆరోపణలను వినడం చాలా బాధగా ఉంది. ఓ బాధ్యతాయుత పదవిలో ఉన్న మరో మహిళే ఇలాంటి కామెంట్స్ చేయడం మరింత బాధ కలిగిస్తోంది. హుందాతనం కోసం మేము మౌనంగా ఉంటాం. కానీ దానిని మా బలహీనతగా భావిస్తారు.

నేను పూర్తిగా రాజకీయాలకు దూరం. నాకు ఏ పార్టీ, వ్యక్తితో సంబంధం లేదు. నా పేరును మీ చెత్త రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం మానేయండి. ఆర్టిస్టులను రాజకీయాలకు దూరంగా ఉంచండి. ఊహాజనిత కథనాలతో వాళ్లకు ముడిపెట్టి వాళ్ల పేర్లను రాజకీయాల్లోకి లాగకండి" అని రకుల్ సింగ్ ట్వీట్ చేసింది.

నాగార్జున లీగల్ యాక్షన్

మరోవైపు మంత్రి కొండా సురేఖపై నాగార్జున లీగల్ చర్యలకు దిగాడు. నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. తన కుటుంబ పరువుకు భంగం కలిగించారని పిటిషన్‌‌లో పేర్కొన్నారు. కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్ దాఖలు చేశారు.

సినిమా, ఇతర రంగాల్లో అక్కినేని కుటుంబానికి ఉన్న మంచి పేరును నాగార్జున ప్రస్తావించారు. అక్టోబర్ 2వ తేదీన హైదరాబాద్‌లో లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. బాపు ఘాట్ వద్ద మంత్రి కొండా సురేఖ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పిటిషన్‌లో వివరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 356 కింద పరువు నష్టం దాఖలు చేశారు హీరో అక్కినేని నాగార్జున.

'నాగచైతన్య డివోర్స్ 100 శాతం కేసీఆర్, కేటీఆర్ చేయబట్టే అయ్యింది. ఎందుకంటే.. ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కూల్చవద్దు అంటే..సమంతను నా దగ్గరకు పంపాలని అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంతను వెళ్లమని చెప్పి నాగార్జున వాళ్లు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్లను అనింది. వెళ్లను అని చెబితే.. వింటే విను.. లేకపోతే వెళ్లిపో అని విడాకులు ఇచ్చారు' అని కొండా సురేఖ వ్యాఖ్యానించినట్టు పిటిషన్‌లో ప్రస్తావించారు.

పెద్దఎత్తున విమర్శలు రావడంతో.. కొండా సురేఖ వివరణ ఇచ్చారు. 'ఆవేదనతోనే విమర్శలు చేశా. నాకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదు. అనుకోకుండా ఓ కుటుంబంపై మాట జారాను. నేను చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా బాధపడ్డా. అందుకే నా వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా. కేటీఆర్‌ విషయంలో వెనక్కి తగ్గేదిలేదు. పరువు నష్టం దావా వేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా. కేటీఆర్ తప్పనిసరిగా క్షమాపణ చెప్పాలి' అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానించారు.

Whats_app_banner