Pushpa 2: ఇక్కడ 50 కోట్లతో తీస్తే మలయాళంలో 25 కోట్లతో తీస్తున్నారు.. పుష్ప 2 నిర్మాత షాకింగ్ కామెంట్స్
Pushpa 2 Producer Malayalam Movies Budget: పుష్ప 2 నిర్మాత వై రవి శంకర్ తెలుగు ఇండస్ట్రీ, మలయాళ చిత్ర పరిశ్రమల సినిమాల బడ్జెట్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇక్కడ 50 కోట్లతో తెరకెక్కిస్తే అదే సేమ్ క్వాలిటీతో మలయాళంలో 25 కోట్లతో తీస్తున్నారని అన్నారు.
Y Ravi Shankar The Goat Life: ప్రభాస్ నటించిన సలార్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన లేటెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా ది గోట్ లైఫ్. దీన్నే తెలుగులో ఆడు జీవితం అనే టైటిల్‌తో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. మలయాళం భాషతోపాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ ది గోట్ లైఫ్ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
తాజాగా హైదరాబాద్‌లో శుక్రవారం (మార్చి 22) ది గోట్ లైఫ్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకకు మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌తోపాటు మూవీ డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్ హాజరు అయ్యారు. వీరితోపాటు పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రొడ్యూసర్ వై రవి శంకర్ హాజరు అయి వేడుకలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ది గోట్ లైఫ్ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తుంది.
ఈ సందర్భంగా ఆడు జీవితం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత వై రవి శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ది గోట్ లైఫ్ (తెలుగులో ఆడు జీవితం) సినిమాను తెలుగులో ఈ నెల 28న రిలీజ్ చేస్తున్నాం. ఇలాంటి వండర్ ఫుల్ ఫిల్మ్‌ను మా సంస్థ నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం గర్వంగా ఉంది. కొత్త తరహా సినిమాలు కావాలని కోరుకునే వారికి సమాధానంగా ఈ మూవీని చెప్పుకోవచ్చు" అని నిర్మాత వై రవి శంకర్ అన్నారు.
"ఇక్కడ మనం 50 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కించే సినిమాను సేమ్ క్వాలిటీ , ప్యాషన్‌తో మలయాళంలో 25 కోట్ల రూపాయలతో రూపొందిస్తారు. 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తీసిన ది గోట్ లైఫ్ సినిమా ప్రొడక్షన్ వ్యాల్యూ వంద కోట్ల రూపాయలకు పైనే అనుకోవచ్చు. ఈ సినిమాను దర్శకుడు బ్లెస్సీ గారు ఎన్నో ఏళ్లు శ్రమించి రూపొందించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ గారు, రసూల్ పూకుట్టి వంటి గ్రేట్ టెక్నీషియన్స్ పనిచేశారు. సాంగ్స్ బిగ్ హిట్ అయ్యాయి" అని వై రవి శంకర్ తెలిపారు.
"లాక్ డౌన్ టైమ్‌లో అయ్యప్పనుమ్ కోషియమ్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రాన్స్ వంటి గొప్ప మలయాళ మూవీస్ చూశాను. మలయాళ మూవీస్‌కు దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు మల్టీ టాలెంటెడ్. మన మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేసిన లూసిఫర్ సినిమాను మలయాళంలో ఆయన దర్శకత్వంలో రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన మరో గ్రేట్ ఫిల్మ్ ఇది. ది గోట్ లైఫ్ సినిమా తెలుగులో తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అని నిర్మాత రవి శంకర్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే, ఆడు కాలం సినిమాను (ది గోట్ లైఫ్) మలయాళంలో విజువల్ రొమాన్స్ బ్యానర్‌పై రూపొందించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ సినీ కెరీర్‌లో ఇది ప్రతిష్టాత్మక చిత్రంగా ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాను 2009లో మొదలు పెడితే.. 2019లో షూటింగ్ ప్రారంభమైంది. అనంతరం కొన్ని గ్యాప్‌లు వస్తూ ఎట్టకేలకు 2024 మార్చి 28న విడుదల కానుంది.