Period Action Movie: తెలుగులో రిలీజైన మలయాళం పీరియాడిక్ యాక్షన్ మూవీ - యూట్యూబ్‌లో ఫ్రీగా చూసేయండి!
Period Action Movie: మలయాళం పీరియాడిక్ యాక్షన్ మూవీ పథోన్‌పథం నూట్టండు తెలుగులో పులి పేరుతో డబ్ అయ్యింది. పులి తెలుగు వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌తో పాటు ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా యూట్యూబ్‌లో తెలుగులో ఈ యాక్షన్ మూవీ రిలీజైంది. ఓటీటీలో ఫ్రీగా ఈ మూవీ చూడొచ్చు.
Period Action Movie: మలయాళం పీరియాడికల్ యాక్షన్ మూవీ పథోన్‌పథం నూట్టండు పులి పేరుతో తెలుగులోకి డబ్ అయ్యింది. ఈ మూవీ ఆహా ఓటీటీతో పాటు ఆమెజాన్ ప్రైమ్‌లో చాలా రోజుల క్రితమే రిలీజైంది. తాజాగా పులి మూవీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ సినిమాను ఫ్రీగా చూడొచ్చని మేకర్స్ ప్రకటించారు.
మోహన్ లాల్, మమ్ముట్టి...
పులి సినిమాలో సిజు విల్సన్, కాయదు లోహర్, పూనమ్ బజ్వా, దిప్తీ సతీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు వినయన్ దర్శకత్వం వహించాడు. పులి సినిమాకు మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్, మమ్ముట్టి వాయిస్ ఓవర్‌ను అందించడం గమనార్హం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మోహన్ లాల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభం కాగా...సెకండ్ హాఫ్ మమ్ముట్టి వాయిస్ ఓవర్‌తో మొదలై ఆడియెన్స్‌లో ఆసక్తిని రేకెత్తించింది.
కులవివక్షపై...
కేరళలో ట్రావెన్ కోర్ వంశస్తుల కాలంలో రాజుల కుతంత్రాలు, కుల వివక్ష లాంటి సామాజిక కట్టుబాట్లపై పోరాటం చేసిన సంఘ సంస్కర్త వేళాయుధ ఫణిక్కర్ జీవితం ఆధారంగా పులి మూవీని డైరెక్టర్ వినయన్ తెరకెక్కించాడు. 2022లో మలయాలంలో రిలీజైన ఈ మూవీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్ అభిమానులను మెప్పించాయి.దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ యాభై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. 2022లో మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల్లో ఒకటిగా పులి నిలిచింది.
పులి మూవీ కథ ఏంటంటే?
ట్రావెన్ కోర్ ప్రాంతాన్ని రామవర్మ (అనూప్ మీనన్) పరిపాలిస్తుంటాడు. రామవర్మకు అధికార ప్రతినిధులైన పడవీడన్ నంబి, కైమల్, కన్నన్ కురూప్ తక్కువ కులాల వారికి ఆలయ ప్రవేశం లేదంటూ శాసనాలు చేస్తారు. తక్కువ కులస్తుల ఆచార వ్యవహారాలు, వస్త్రధారణ విషయంలో అనేక కట్లుబాట్లు విధిస్తూ వారిని చిత్ర హింసలకు గురిచేస్తుంటారు. అణగారిన వర్గాలకు జరుగుతోన్న అన్యాయాలపై వేళాయుధన్ పోరాటం చేస్తుంటాడు.
యుద్ధ విధ్యల్లో నిష్ణాతుడైన వేలాయుధన్ అంటే రాజప్రతినిధులకు భయం ఉంటుంది. అతడిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటారు. అదే సమయంలో అనంత పద్మనాభస్వామికి చెందిన విలువైన ఆభరణాలు దొంగిలించబడతాయి. ఆ ఆభరణాలను దొంగిలించింది ఎవరు? ఈ దొంగతనానికి వేళాయుధన్‌కు ఏమైనా సంబంధం ఉందా? కుల వివక్షను రూపుమాపడానికి వేళాయుధన్ ఏం చేశాడు అన్నదే ఈ మూవీ కథ.
పులి సినిమాకు అవార్డులు…
పులి మూవీ మూడు కేరళ స్టేట్ అవార్డులను గెలుచుకుంది. కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డులు ఈ సినిమాకు వచ్చాయి. పులి సినిమాకు కల్కి 2898 ఏడీ ఫేమ్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.