Neru Movie Review: నేరు రివ్యూ - సలార్‌కు పోటీగా రిలీజైన మోహన్‌లాల్, జీతూ జోసెఫ్ మూవీ ఎలా ఉందంటే?
Neru Movie Review: మోహన్‌లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళం మూవీ నేరు ఇటీవల థియేటర్లలో విడుదలైంది. కోర్టు రూమ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Neru Movie Review: మలయాళంలో మోహన్ లాల్, డైరెక్టర్ జీతూ జోసెఫ్‌లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన దృశ్యం, దృశ్యం -2 చిత్రాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. ఈ సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌లో వచ్చిన తాజా మలయాళం చిత్రం నేరు. కోర్ట్ రూమ్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఇటీవల సలార్‌కు పోటీగా థియేటర్లలో విడుదలైంది. ఈ మలయాళ సినిమా ఎలా ఉంది? దృశ్యం తరహాలో నేరుతో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ మరోసారి ఆడియెన్స్‌ను థ్రిల్ చేశారా? లేదా? అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే.
అంధురాలికి న్యాయం....
సారా (అనాశ్వర రంజన్) ఓ అంధురాలు. పన్నెండేళ్ల వయసులోనే కంటిచూపుకోల్పోతుంది. తండ్రి ద్వారా బొమ్మలు తయారు చేయడం నేర్చుకుంటుంది. చేతుల ద్వారా మనిషి ముఖ రూపురేఖలను అంచనా వేసి సరిగ్గా వారి బొమ్మను తయారు చేయగలిగే ప్రతిభ సారాకు ఉంటుంది. ఓ రోజు సారా తల్లిదండ్రులు బ్యాంకుకు వెళతారు.
ఇంట్లో ఒంటరిగా ఉన్న సారాను మైఖేల్ (శంకర్) అనే యువకుడు రేప్ చేస్తాడు. సారా తయారు చేసిన బొమ్మ ద్వారా మైఖేల్ పోలీసులకు దొరికిపోతాడు. మైఖేల్ తండ్రి పెద్ద బిజినెస్‌మెన్ కావడంతో కొడుకును రేప్ కేసు నుంచి బయటపడేసేందుకు సుప్రీంకోర్టు లాయర్ రాజశేఖర్‌ను (సిద్ధిఖీ) రంగంలోకి దింపుతాడు. రాజశేఖర్‌కు భయపడి సారా తరఫున వాదించడానికి లాయర్లు ఎవరూ ముందుకు రారు. రాజశేఖర్ కారణంగా ఐదేళ్లు బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ అయిన విజయ్ మోహన్ (మోహన్ లాల్) సారా తరఫున కోర్టులో వాదించడానికి సిద్ధమవుతాడు.
మైఖేల్ నిర్దోషి అని ప్రూవ్ చేయడానికి రాజశేఖర్ పలు అబద్దపు సాక్ష్యాలు సృష్టిస్తాడు. రాజశేఖర్ పన్నాగాన్ని విజయ్ మోహన్ ఎలా తిప్పికొట్టాడు? అతడు చెప్పినవన్నీ అబద్దాలు అని కోర్టులో ప్రూవ్ చేశాడా? రాజశేఖర్ తరఫున అతడి కూతురు పూర్ణిమ (ప్రియమణి) కేసు ఎందుకు వాదించాల్సివచ్చింది?
మైఖేల్ అసలైన దోషి అని విజయ్ మోహన్ ఏ విధంగా నిరూపించాడు? ఈ కేసు వాదనలో విజయ్ మోహన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు. విజయ్ మోహన్‌ను బార్ కౌన్సిల్ నుంచి రాజశేఖర్ ఎందుకు సస్పెండ్ చేయించాడు? అన్నదే నేరు కథ.
సామాన్యుడి పోరాటం
మోహన్‌లాల్, జీతు జోసేఫ్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలన్నీ న్యాయం కోసం బలవంతుడితో సామాన్యుడు సాగించే పోరాటం చుట్టూ నడుస్తుంటాయి. నేరు కూడా ఆ కోవకు చెందినసినిమానే. గత సినిమాలకు భిన్నంగా కొత్త బ్యాక్‌డ్రాప్‌లో జీతూ జోసెఫ్ సినిమాను తెరకెక్కించాడు.
కంప్లీట్ కోర్టు రూమ్ డ్రామాగా నేరు మూవీ సాగుతుంది. ఓ నిస్సహాయురాలైన అంధురాలికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ లాయర్ కథతో ఎంగేజింగ్ డ్రామాగా నేరు మూవీని తెరకెక్కించాడు జీతూ జోసెఫ్.
అబద్దాలతో కేసు గెలవాలని ప్రయత్నించే లాయర్ ఓ వైపు...నిజం కోసం పోరాడే లాయర్ మరోవైపు...ఒకరిపై మరొకరు వేసే ఎత్తులు పై ఎత్తులతో నేరు మూవీ థ్రిల్లింగ్‌ను పంచుతుంది. కోర్టుల్లో సామాన్యుడికి న్యాయం అందుతుందా? న‌్యాయ వ్యవస్థను డబ్బు, అధికారం ఎలా ప్రభావితం చేస్తున్నాయనే సందేశాన్ని అంతర్లీనంగా నేరు మూవీలో చూపించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్.
రియలిస్టిక్ కోర్ట్ రూమ్ డ్రామా...
కోర్ట్ రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో గతంలో పవన్ కళ్యాణ్, అజిత్ వంటి స్టార్ హీరోలు సినిమాలు చేశారు. కానీ వాటికి భిన్నంగా రియలిస్టిక్‌గా నేరు సినిమా సాగుతుంది. , ఫైట్లు, పాటలు, కామెడీ ట్రాక్ వంటి కమర్షియల్ హంగులు లేకుండా నిజంగానే కోర్టు వాదనలకు కళ్ల ముందు చూస్తున్న అనుభూతిని కలిగించేలా నేరు సినమాను తెరకెక్కించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్.
దృశ్యం తరహాలో...
దృశ్యం తరహాలో ట్విస్ట్‌లు, టర్న్‌లు ఊహించి సినిమా చూస్తే మాత్రం డిజపాయింట్ అవుతారు. రాజశేఖర్ వేసిన ప్లాన్స్‌ను విజయ్ మోహన్ తన తెలివితేటలతో చిత్తు చేసే సీన్స్‌ను డైరెక్టర్ సింపుల్‌గా రాసుకున్నాడు. మెయిన్ ట్విస్ట్ చిరంజీవి ముఠామేస్త్రి సినిమాను గుర్తుకుతెస్తుంది. కథ నడిచే తీరు ఆర్ట్ సినిమాను తలపిస్తుంది.
కథ మొదలైన అర్ధగంట తర్వాతే...
మోహన్ లాల్ తో పాటు ప్రతి పాత్రకు సమ ప్రాధాన్యత ఇస్తూ సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ జీతూ జోసెఫ్. మోహన్ లాల్ క్యారెక్టర్ కథ ప్రారంభమైన అర్ధగంట తర్వాతే ఎంట్రీ ఇస్తుంది. విజయ్ మోహన్ పాత్రలో మోహన్ లాల్ చెలరేగిపోయాడు. కోర్టులో అతడు చెప్పే డైలాగ్స్ క్లాప్స్ కొట్టేలా ఉంటాయి. అపోజిషన్ లాయర్‌ను ఓడించడానికి అతడు వేసే ఎత్తుల నుంచే మోహన్‌లాల్‌లోని హీరోయిజాన్ని డిఫరెంట్‌గా పండించాడు డైరెక్టర్.
మోహన్ లాల్ తో సమానంగా సిద్ధిఖీ పాత్ర సాగుతుంది. డబ్బు కోసం దోషిని కాపాడేందుకు ప్రయత్నించే కన్నింగ్ లాయర్‌గా డైలాగ్స్‌తోనే చక్కటి విలనిజాన్ని పడించాడు. ప్రియమణి గెస్ట్ రోల్ మాదిరిగానే అనిపిస్తుంది. ఆమె పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. సారాగా అనస్వర రాజన్, ఆమె తల్లిదండ్రులుగా జగదీష్, శ్రీధన్య యాక్టింగ్ బాగుంది.
మోహన్ లాల్ నట విశ్వరూపం...
నేరు ఎలాంటి కమర్షియల్ హంగులకు తావు లేని రియలిస్టిక్ కోర్టు డ్రామా మూవీ. మోహన్ లాల్ నట విశ్వరూపానికి చక్కటి నిదర్శనంగా ఈ సినిమా నిలుస్తుంది. దృశ్యం తరహాలో అంచనాలు పెట్టుకొని చూస్తే మాత్రం నిరాశతప్పదు.