Pt Sir Review: పీటీ సార్ రివ్యూ - అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన కోలీవుడ్‌ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?-pt sir review hip hop tamizha murder mystery thriller movie telugu review amazon prime ott review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pt Sir Review: పీటీ సార్ రివ్యూ - అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన కోలీవుడ్‌ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Pt Sir Review: పీటీ సార్ రివ్యూ - అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన కోలీవుడ్‌ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 23, 2024 08:29 AM IST

Pt Sir Review: కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ హిప్ హాప్ త‌మిళ హీరోగా న‌టించిన పీటీ సార్ మూవీ ఇటీవ‌ల‌ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే?

పీటీ సార్ మూవీ రివ్యూ
పీటీ సార్ మూవీ రివ్యూ

Pt Sir Review: హిప్ హాప్ త‌మిళ‌, క‌శ్మీర ప‌ర‌దేశి హీరోహీరోయిన్లుగా న‌టించిన పీటీ సార్ మూవీ ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో (Amazon Prime OTT) రిలీజైంది. ఈ మెసేజ్ ఓరియెంటెడ్ మూవీకి కార్తీక్ వేణుగోపాల‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ మూవీ ఎలా ఉంది? క‌థ ఏమిటంటే

పీటీ సార్ పోరాటం...

క‌న‌గ‌వేల్ (హిప్ హాప్ త‌మిళ‌) ఈరోడ్‌లోని జీపీ స్కూల్‌లో పీటీ టీచ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. చ‌దువుతో పాటు ఆట‌లు కూడా పిల్ల‌ల‌కు ముఖ్య‌మే అని న‌మ్ముతుంటాడు. క‌న‌గ‌వేల్ జాత‌కంలో దోషం ఉంద‌ని ఓ పూజారి చెబుతాడు. క‌న‌గ‌వేల్‌కు పెళ్లి జ‌రిగితేనే ఆ దోషం పోతుంద‌ని అంటాడు. దాంతో క‌న‌గ‌వేల్‌ను ఓ పిరికివాడిగా త‌ల్లి పెంచుతుంది. క‌ళ్ల ముందే ఎలాంటి అన్యాయాలు జ‌రిగిన చూడ‌న‌ట్లు ఉండ‌మ‌ని చెబుతుంది.

త‌న స్కూల్‌లోనే టీచ‌ర్‌గా ప‌నిచేసే వ‌న‌తిని (క‌శ్మీర ప‌ర‌దేశి) ప్రేమిస్తాడు క‌న‌గ‌వేల్‌. క‌న‌గ‌వేల్‌ను వ‌న‌తి పెళ్లి చేసుకోవ‌డం ఆమె తండ్రి మాణిక‌వేల్‌కు (ప్ర‌భు) ఇష్టం ఉండ‌దు. కూతురి మాట‌ను కాద‌న‌లేక పెళ్లికి ఒప్పుకుంటాడు. క‌న‌గ‌వేల్‌, వ‌న‌తి ఎంగేజ్‌మెంట్‌కు ఏర్పాట్లు చేస్తారు. అదేరోజు క‌న‌గ‌వేల్ ఇంటి ప‌క్క‌నే ఉండే నందిని (అనైక సురేంద్ర‌న్‌) హ‌త్య‌కు గురువుతుంది.

ఈ హ‌త్య‌కు త‌మ స్కూల్ ఓన‌ర్ జీపీకి (త్యాగ‌రాజ‌న్‌) సంబంధం ఉంద‌ని క‌న‌గ‌వేల్ అనుమానిస్తాడు. త‌న డ‌బ్బు, అధికారంతో నందిని హ‌త్య‌ను సూసైడ్‌గా జీపీ మార్చాడ‌ని భావించి అత‌డిపై పోరాటానికి సిద్ధ‌మ‌వుతాడు. ఆ త‌ర్వాత ఏమైంది?

జీపీ డ‌బ్బు, పొలిటిక‌ల్ ప‌వ‌ర్‌ను ఎందురించి ఓ సామాన్య పీటీ టీచ‌ర్ క‌న‌గ‌వేల్ ఎలా నిల‌బ‌డ్డాడు? నందినిని నిజంగా హ‌త్య‌కు గురైందా? ఆమె హ‌త్య‌కు జీపీకి ఉన్న సంబంధం ఏమిటి? కోర్లులో జీపీపై వేసిన కేసులో క‌న‌గ‌వేల్ విజ‌యాన్ని సాధించాడా? క‌న‌గ‌వేల్‌కు జ‌డ్జ్ ఎందుకు శిక్ష‌ను విధించాడు? క‌న‌గ‌వేల్ జాత‌కంలో ఉన్న దోషం ఏమిటి? అన్న‌దే పీటీ సార్ మూవీ(Pt Sir Review) క‌థ‌.

స్పోర్ట్స్ డ్రామా మూవీ...

పీటీ సార్‌...టైటిల్ చూడ‌గానే ఇదేదో స్పోర్ట్స్ డ్రామా మూవీ అని ఆడియెన్స్ ఫిక్సైపోయారు. సినిమా యూనిట్ కూడా ఇది స్పోర్ట్స్ మూవీనే అని ప్ర‌చారం చేసింది. కానీ అదొక ప్ర‌మోష‌న‌ల్ స్ట్రాట‌జీ అని సినిమా చూసిన త‌ర్వాతే ఆడియెన్స్‌కు క్లారిటీ వ‌స్తుంది.

సోష‌ల్ మెసేజ్‌....

సోష‌ల్ మెసేజ్‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను మేళ‌వించి ద‌ర్శ‌కుడు కార్తీక్ వేణుగోపాల‌న్ పీటీ సార్‌ మూవీని తెర‌కెక్కించాడు. స‌మాజంలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న అకృత్యాలు, అన్యాయాల‌పై ఓ పీటీ టీచ‌ర్(Pt Sir Review) ఎలాంటి పోరాటం సాగించాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఆడ‌పిల్ల‌ల పెంప‌కం విష‌యంలో అతి జాగ్ర‌త్త‌ల పేరుతో త‌ల్లిదండ్రులు ఎలాంటి ఆంక్ష‌లు విధిస్తున్నారు.... త‌మ క‌ల‌లు, కోరిక‌ల విష‌యంలో సొసైటీలోఅమ్మాయిలు ఏ విధంగా వివ‌క్ష‌కు గురువుతున్నార‌ని ఆలోచ‌నాత్మ‌కంగా ఈ మూవీలో చూపించారు.

మ‌హిళ‌ల అవ‌స‌రాలు, బ‌ల‌హీన‌త‌ల‌ను అడ్డుంపెట్టుకొని కొంద‌రు పెద్ద మ‌నుషులు చెసే వెకిలి చేష్ట‌లు ఎలా ఉంటాయ‌నే మెసేజ్‌ను సినిమా ద్వారా అందించారు. త‌మ‌పై జ‌రుగుతోన్న అకృత్యాల‌ను స‌హిస్తూ అమ్మాయిలు మౌనంగా ఉండొద్ద‌ని, వాటిపై ఎదురుతిరిగి పోరాడాల‌ని పాయింట్‌తో పీటీ సార్ మూవీ రూపొందింది.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ...

ఈ సోష‌ల్ మెసేజ్‌ను మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ ద్వారా థ్రిల్లింగ్‌గా స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశాడు డైరెక్ట‌ర్‌. ఈ సినిమా ఫ‌స్ట్ హాఫ్ క‌న‌గ‌వేల్ లైఫ్‌, వ‌న‌తితో అత‌డి ప్రేమాయ‌ణం చుట్టూ స‌ర‌దాగా సాగిపోతుంది. పాట‌లు, కామెడీతో టైమ్‌పాస్ చేశారు డైరెక్ట‌ర్‌. నందిని హ‌త్య‌కు గురైన త‌ర్వాతే సినిమా(Pt Sir Review) స‌రైన ట్రాక్‌లోకి వ‌చ్చిన‌ట్లు క‌నిపిస్తుంది.

నందిని మ‌ర్డ‌ర్ వెనుక జీపీ ఉన్నాడ‌ని క‌న‌గ‌వేల్ అనుమానించ‌డం, డ‌బ్బు, అధికారంలో త‌న‌కంటే బ‌ల‌వంతుడైన జీపీని దెబ్బ‌కొట్టేందుకు క‌న‌గ‌వేల్ వేసే ప్లాన్స్ ఆక‌ట్టుకుంటాయి. అయితే కీల‌క‌మైన కోర్డ్ ఎపిసోడ్స్‌లో మాత్రం ద‌ర్శ‌కుడు స‌రిగ్గా రాసుకోన‌ట్లుగా అనిపిస్తుంది ఆ సీన్స్ తేలిపోయాయి. . క్లైమాక్స్‌లో వ‌చ్చే ట్విస్ట్ ఊహించిందే అయినా స‌ర్‌ప్రైజింగ్‌గానే ఉంది.

అదే మైన‌స్‌...

ఫ‌స్ట్ హాఫ్ సినిమాకు మైన‌స్‌గా మారింది. క‌థ ఎంతకుముందుకు క‌ద‌ల‌క అక్క‌డే తిరుగుతున్న ఫీలింగ్ క‌లుగుతుంది. విల‌న్ అకృత్యాల‌ను బ‌య‌ట‌పెట్టేందుకు హీరో వేసే ఎత్తుల్లో సాదాసీదాగా ఉన్నాయి.

సీరియ‌స్ రోల్‌లో...

క‌న‌గ‌వేల్ అనే పీటీ సార్‌గా ఎమోష‌న‌ల్ రోల్‌లో హిప్ హాప్ త‌మిళ యాక్టింగ్ ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సీరియ‌స్ రోల్‌కు న్యాయం చేసేందుకు క‌ష్ట‌ప‌డ్డాడు. హీరోయిన్ క‌శ్మీర ప‌ర‌దేశి పాత్ర‌కు పెద్ద‌గా ఇంపార్టెన్స్ లేదు. సెకండాఫ్‌లో ఒక్క‌సారి కూడా ఆమె స్క్రీన్‌పై క‌నిపించ‌దు. విల‌న్‌గా త్యాగ‌రాజ‌న్‌, క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ప్ర‌భు, జ‌డ్జ్‌గా కే భాగ్య‌రాజ్ వంటి సీనియ‌ర్లు న‌టించ‌డం ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యింది. కీల‌క పాత్ర‌లో అనైక సురేంద‌ర్ న‌ట‌న బాగుంది.

Pt Sir Review -ఫీల్‌గుడ్ మూవీ...

పీటీ సార్ మంచి మెసేజ్‌తో తెర‌కెక్కిన క‌మ‌ర్షియ‌ల్ మూవీ. తెలుగు డ‌బ్బింగ్ కూడా చ‌క్క‌గా కుదిరింది. ఫీల్‌గుడ్ మూవీ చూసిన అనుభూతిని అందిస్తుంది.

రేటింగ్‌: 2.5/5

WhatsApp channel