Kalki 2898 AD release date: ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీపై ఏపీ, తెలంగాణ ఎన్నికల ప్రభావం ఎంత.. రిలీజ్ డేట్ వాయిదా తప్పదా?
Kalki 2898 AD release date: ప్రభాన నటిస్తున్న కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడేలా కనిపిస్తోంది. ఈ సినిమా మే 9న రిలీజ్ కానుండగా.. మే 13నే ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Kalki 2898 AD release date: కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేస్తారా? శనివారం (మార్చి 16) సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ రిలీజైనప్పటి నుంచీ సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. దీనికి కారణం ఈ సినిమా రిలీజ్ సమయంలోనే ఏపీ, తెలంగాణల్లో ఎన్నికలు జరగనుండటం. తాజా షెడ్యూల్ ప్రకారం మే 13న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కల్కి 2898 ఏడీ.. వాయిదా తప్పదా?
కల్కి 2898 ఏడీ మూవీ రిలీజ్ ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మొత్తానికి వైజయంతీ మూవీస్ కు బాగా కలిసొచ్చిన మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు గత నెలలోనే మేకర్స్ స్పష్టం చేశారు. ఆ రోజు కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా వెలువడిన ఎన్నికల షెడ్యూల్ తో సినిమా రిలీజ్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కల్కి ఓ పాన్ ఇండియా మూవీయే అయినా.. రెండు తెలుగు రాష్ట్రాలే సినిమాకు చాలా కీలకం. అలాంటిది ఎన్నికలకు కేవలం నాలుగు రోజుల ముందు రిలీజ్ అంటే రిస్క్ చేసినట్లే అన్న వాదన వినిపిస్తోంది. సోషల్ మీడియాలో శనివారం మధ్యాహ్నం నుంచి ఇదే చర్చ నడుస్తోంది. మే 11 వరకూ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. అందులోనూ ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ రెండింటికీ ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో జనమంతా ఆ ఎన్నికల హడావిడిలోనే ఉంటారు. ఈ నేపథ్యంలో మూవీని రిలీజ్ చేసే సాహసం మేకర్స్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలాగని ఈ పుకార్లను కూడా ఖండించకపోవడంతో ఈ సందేహాలు మరింత ఎక్కువయ్యాయి.
గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వచ్చేస్తోంది
ఇక అదే సమయంలో విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రాబోతోంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ను శనివారమే (మార్చి 16) అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా ఎన్నికలు ముగిసిన నాలుగు రోజులకు అంటే మే 17న రిలీజ్ కానుంది. కల్కి 2898 ఏడీ రిలీజైన వారానికి ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నికల వేడి ముగిసిన తర్వాత కావడంతో ఈ సినిమాకు ఎలాంటి ప్రభావం ఉండదు.
కల్కి 2898 ఏడీ విషయంలోనే మేకర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. రూ.600 కోట్ల భారీ బడ్జెట్ మూవీ కావడంతో మంచి ఓపెనింగ్స్, పాజిటివ్ టాక్ వస్తేనే మూవీ నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల వేడిలో మూవీ రిలీజ్ మొదటికే మోసం చేసే ప్రమాదమూ లేకపోలేదు. కల్కి 2898 ఏడీ ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ. ఇందులో ప్రభాస్, దీపికా, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటిస్తున్నారు.
ఈ మధ్యే మహా శివరాత్రి సందర్భంగా ఓ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ పాత్ర పేరును భైరవగా రివీల్ చేశారు. శ్రీ కృష్ణుడి నిర్యాణం నుంచి 2898 వరకూ అంటే ఆరు వేల ఏళ్ల పాటు సాగే కథే ఈ మూవీ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ వెల్లడించాడు.