OTT Political Comedy: ఓటీటీలోకి సుహాసిని మలయాళ పొలిటికల్ డ్రామా వెబ్ సిరీస్.. తెలుగులోనూ! స్ట్రీమింగ్ డేట్ ఇదే
Jai Mahendran OTT Series Release Date: జై మహేంద్రన్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఎట్టకేలకు ఖరారైంది. వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సిరీస్ స్ట్రీమింగ్‍కు రానుంది. పొలిటికల్ కామెడీ డ్రామాగా ఈ సిరీస్ రూపొందింది.
కొన్ని వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍కు ముందే వివాదాల్లో చిక్కుకొని ఆలస్యమవుతుంటాయి. మలయాళ వెబ్ సిరీస్ ‘జై మహేంద్రన్’ విషయంలోనూ ఇదే జరిగింది. ఈ పొలిటికల్ డ్రామా సిరీస్ ఈ ఏడాది మార్చిలోనే రావాల్సింది. అయితే వివాదం తలెత్తడంతో ఆలస్యమైంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రిజి నాయర్ క్రియేటర్‌గా ఉన్న ఈ సిరీస్‍కు శ్రీకాంత్ మోహన్ దర్శకత్వం వహించారు. సైజు కురుప్, సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ప్రధాన పాత్రలు చేశారు.
స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
జై మహేంద్రన్ వెబ్ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో అక్టోబర్ 11వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంతో పాటు తెలుగు ఆడియో వెర్షన్ కూడా వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై సోనీలివ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఆలస్యం ఇందుకే..
జై మహేంద్రన్ వెబ్ సిరీస్ ఈ ఏడాది మార్చిలో స్ట్రీమింగ్‍కు రావాల్సింది. అయితే, టీజర్లోని కొన్ని డైలాగ్స్, పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఈ సిరీస్‍పై ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో మేకర్స్ మార్పులు చేశారు. ఆగస్టులో స్ట్రీమింగ్‍కు తెచ్చేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయితే, మళ్లీ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ జై మహేంద్రన్ వెబ్ సిరీస్ అక్టోబర్ 11వ తేదీన సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.
జై మహేంద్రన్ సిరీస్‍లో సైజు, సుహాసినితో పాటు సురేశ్ కృష్ణ, మియా, బాలచందర్ చుల్లికడ్, మణియన్‍పిళ్ల రాజు, విష్ణు గోవిందన్, సిద్ధార్థ్ శివ కీలకపాత్రలు చేశారు. కొల్ల నట్టమ్ చిత్రంతో బెస్ట్ మలయాళ మూవీ విభాగంలో 2019లో జాతీయ అవార్డును కైవసం చేసుకున్న రాహుల్ రిజి నాయర్ క్రియేటర్‌గా ఉండటంతో జై మహేంద్ర సిరీస్‍కు మరింత క్రేజ్ వచ్చింది.
స్టోరీలైన్ ఇదే
విపరీతంగా అవినీతి చేసే ప్రభుత్వం అధికారి మహేంద్రన్ (సైజు కురుప్) చుట్టూ ఈ సిరీస్ స్టోరీ సాగుతుంది. వ్యవస్థలోని లోపాలను వినియోగించుకోవడం, అవినీతికి కొందరు రాజకీయ నాయకులు వత్తాసు పలకడం ఉంటుంది. ఎడాపెడా అవినీతికి పాల్పడే మహేంద్రన్ ఓ దశలో సస్పెండ్ అవుతాడు. అతడు చేసిన పనికి ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అసలు మహేంద్రన్ ఏం చేశాడు? ఈ సమస్య నుంచి అతడు బయటపడ్డాడా? ఎదురైన సవాళ్లు ఏంటి? అనే అంశాలు జై మహేంద్రన్ సిరీస్‍లో ఉంటాయి.