OTT Top Releases in May: మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే.. సూపర్ హిట్ సినిమాలు.. ఓ భారీ వెబ్ సిరీస్
OTT Top 5 Releases in May: మే నెలలో మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్నాయి. ముఖ్యంగా నాలుగు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్‍కు రానున్నాయి. అలాగే, సజయ్‍లీలా భాన్సాలీ రూపొందించిన వెబ్ సిరీస్ కూడా రానుంది.

OTT Top Releases in May: ఏప్రిల్ నెలలో ఓటీటీల్లోకి చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు వచ్చేశాయి. ముఖ్యంగా చాలా తెలుగు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చాయి. గామి, ఓం భీమ్ బుష్ నుంచి టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ వరకు ఏప్రిల్‍లో కొన్ని పాపులర్ సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. అయితే, మే నెలలో తెలుగు చిత్రాలు పెద్దగా ఓటీటీల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఏప్రిల్‍లో ఫ్యామిలీ స్టార్ మినహా థియేటర్లలో పాపులర్ సినిమాలు రిలీజ్ కాలేదు. అయితే, మే నెలలో ఇతర భాషలకు చెందిన కొన్ని పాపులర్ సినిమాలు, సిరీస్‍లు ఓటీటీలోకి రానున్నాయి. ఇందులో మంజమ్మల్ బాయ్స్ సహా మరిన్ని తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. మే నెలలో ఓటీటీల్లో 5 ముఖ్యమైన రిలీజ్‍లు ఇవే..
హీరామండి: ది డైమండ్ బజార్
బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ భారీ బడ్జెట్‍తో రూపొందించిన ‘హీరామండి: ది డైమండ్ బజార్’ వెబ్ సిరీస్ మే 1వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మనీషా కొయిరాలా, అదితి రావ్ హైదరి, సోనాక్షి సిన్హా, షార్మీన్ సేగల్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హిందీ సిరీస్‍పై అంచనాలు భారీగా ఉన్నాయి. ట్రైలర్ ఆకట్టుకోవడంతో హీరామండిపై మంచి హైప్ ఉంది. ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ నుంచి వస్తున్న తొలి వెబ్ సిరీస్ కావడం కూడా చాలా ఇంట్రెస్టింగ్‍గా ఉంది. మే 1న ఈ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రీమింగ్‍కు వస్తుంది. తెలుగు డబ్బింగ్‍లోనూ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
మంజుమ్మల్ బాయ్స్
మలయాళ బ్లాక్‍బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ చిత్రం కూడా మే నెలలోనే ఓటీటీలోకి రానుంది. మే 5వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలోకి ఈ మూవీ అడుగుపెట్టనుంది. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు రానుంది. మలయాళంలో ఫిబ్రవరి 22న మంజుమ్మల్ బాయ్స్ రిలీజైంది. మలయాళ ఇండస్ట్రీలో రూ.200 కోట్ల కలెక్షన్లు దక్కించుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. తెలుగులోనూ ఏప్రిల్ 6న రిలీజై మంచి కలెక్షన్లను దక్కించుకుంది. ఇక మే 5 నుంచి ఈ చిత్రాన్ని హాట్‍స్టార్ ఓటీటీలో చూసేయవచ్చు. ఈ మూవీకి చిదంబరం దర్శకత్వం వహించగా.. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసీ, బాలు వర్గీస్, గణపతి, లాల్ జూనియర్ ప్రధాన పాత్రలు పోషించారు.
సైతాన్
బాలీవుడ్ సూపర్ నేచులర్ హారర్ థ్రిల్లర్ ‘సైతాన్’ చిత్రం కూడా మే నెలలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది. ఈ చిత్రం మే 3న స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతుందని తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అజయ్ దేవ్‍గణ్, జ్యోతిక, మాధవన్ ప్రధాన పాత్రలు పోషించిన సైతాన్ మూవీ మార్చి 8న థియేటర్లలో విడుదలైంది. రూ.200కోట్లకు పైగా కలెక్షన్లను సాధించి సూపర్ హిట్ అయింది. ఈ చిత్రం మేలో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుంది.
జర హట్కే జర బచ్కే
జర హట్కే జర బచ్కే సినిమా ఎట్టకేలకు మే నెలలో ఓటీటీలోకి రానుంది. జియో సినిమా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుంది. మే మూడో వారంలో ఈ చిత్రం జియో సినిమాలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్‍పై ప్రకటన రానుంది. విక్కీ కౌశాల్, సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ జర హట్కే జర బచ్కే 2023 జూన్ 2న థియేటర్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు సుమారు 11 నెలల తర్వాత జియోసినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.
ఆవేశం
మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో నటించిన ఆవేశం సినిమా థియేటర్లలో బ్లాక్‍బస్టర్ అవుతోంది. జీతూ మాధవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే రూ.100 మార్కును దాటేసింది. ఏప్రిల్ 11న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ కామెడీ చిత్రం ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఆవేశం సినిమా మే 17వ తేదీన ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్‍కు వస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఆలస్యమైతే మే ఆఖరి వారంలోనే అయినా ప్రైమ్ వీడియోలోకి అడుగుపెడుతుందని తెలుస్తోంది.